మరింత పటిష్టంగా మార్జిన్‌ ట్రేడింగ్‌  | Extended market hours not a priority, says Sebi ChairmanTuhin Kanta Pandey | Sakshi
Sakshi News home page

మరింత పటిష్టంగా మార్జిన్‌ ట్రేడింగ్‌ 

Nov 19 2026 5:01 AM | Updated on Nov 19 2026 5:01 AM

Extended market hours not a priority, says Sebi ChairmanTuhin Kanta Pandey

ట్రేడింగ్‌ వేళల పెంపునకు నో 

సెబీ చైర్మన్‌ టీకే పాండే

ముంబై: మార్జిన్‌ ట్రేడింగ్‌ సౌకర్యాల(ఎంటీఎఫ్‌)ను మరింత పటిష్టపరచనున్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. అయితే ఈ అంశంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎక్సే్ఛంజెస్‌ సదస్సు సందర్భంగా విలేకరులకు తెలియజేశారు. మార్కెట్లలో లావాదేవీల నిర్వహణ(ట్రేడింగ్‌) సమయ పెంపునకు ప్రాధాన్యత ఇవ్వబోమని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. 

ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో దీనిపై ఒక వర్కింగ్‌ గ్రూప్‌ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి నిబంధనల అమలుకు తొలుత సైబర్‌సెక్యూరిటీతో సవాళ్లు ఎదురుకానున్నట్లు తెలియజేశారు. యూఎస్‌లో ఇలాంటి పలు సమస్యలు రోజువారీ తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. ట్రేడింగ్‌ వేళలు పెంచేముందు లిక్విడిటీ సమస్యకు పరిష్కారం వెదకవలసి ఉన్నట్లు తెలియజేశారు. 

అంతేకాకుండా ప్రజల నిద్రా సమయం తదితరాలనుసైతం పరిగణించవలసి ఉన్నదని వివరించారు. మరుసటి రోజు తెల్లవారి లేచేసరికి ఒక సెక్యూరిటీ ధరలో భారీ మార్పును చూడటానికి ఎవరూ ఇష్టపడరని వ్యాఖ్యానించారు. కాగా.. పలు కోణాల్లో ఎంటీఎఫ్‌ను పటిష్ట పరిచే యోచనకు తెరతీసినట్లు తెలియజేశారు. అయితే ఎలాంటి నిర్ణయానికీ రాలేదని వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ అంశంలో విభిన్నతరహా సమాలోచనలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ అంశంలో తుది నిర్ణయానికి వస్తే వెల్లడిస్తామని తెలియజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement