ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం.. 349 ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. రెండు విమానాలు ఎదురెదురుగా ఢీకొన్న ఆ ఘటన అత్యంత విషాదకర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. 1996లో జరిగిన ఈ చార్ఖీ దాద్రి ఘోర ప్రమాదాన్ని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా గుర్తుచేశారు. ప్రమాదం తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు చేపట్టిన సహాయక చర్యలను ప్రస్తావిస్తూ.. అప్పట్లో మృతులు ముస్లింలా, ఇతరులా అని తాము చూడలేదంటూ ఆయన పేర్కొన్నారు.
న్యూయార్క్‌లో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1996 నవంబర్ 12న దాద్రి మీదుగా వెళ్తున్న రెండు ప్రయాణికుల విమానాలు గాల్లోనే ఢీకొన్నాయని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది ముస్లింలేనని గుర్తుచేశారు. ఆ సమయంలో వారు ముస్లింలా? అని మేం ఎప్పుడూ ఆలోచించలేదని.. ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారని భగవత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయకపోవడం వల్లే ఆర్‌ఎస్‌ఎస్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతిఫలం ఆశించకపోవడంతో తమ సేవా కార్యక్రమాలను ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారం చేసుకోదని తెలిపారు.
1996 నవంబర్ 12న హరియాణాలోని చార్ఖీ దాద్రి గ్రామం మీదుగా వెళ్తున్న సమయంలో సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 747, కజకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఇల్యూషిన్ IL-76 విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. ఢిల్లీకి సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన ఈ ప్రమాదం జరిగింది. రెండు విమానాల్లో ఉన్న మొత్తం 349 మంది మరణించారు. సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ విమానం జెడ్డా నుంచి ఢిల్లీకి వస్తోంది. అందులో 312 మంది ఉన్నారు.
మరోవైపు కజకిస్థాన్ ఎయిర్‌లైన్స్ విమానం ఢిల్లీ నుంచి కజకిస్థాన్‌లోని చిమ్‌కెంట్‌కు బయలుదేరింది. అందులో 37 మంది ఉన్నారు. కజక్ విమానం 15,000 అడుగుల ఎత్తులో కొనసాగాల్సి ఉండగా.. నిర్దేశించిన దానికంటే దిగువకు వచ్చింది. సుమారు 14,000 అడుగుల ఎత్తులో రెండు విమానాలు ఒకే మార్గంలోకి రావడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులోని వారెవరూ ప్రాణాలతో బయటపడలేదు.
ప్రమాదానికి దారితీసిన ప్రధాన సమస్యల్లో కమ్యూనికేషన్ లోపం ఒకటని దర్యాప్తులో తేలింది. కజకిస్థాన్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ఇంగ్లిష్ భాషపై పరిమిత పరిజ్ఞానం ఉండటంతో పాటు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి వచ్చిన కొన్ని సమాచారాన్ని రేడియో ఆపరేటర్ ద్వారా అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇచ్చిన ఎత్తుకు సంబంధించిన ఆదేశాలపై గందరగోళం ఏర్పడింది. కజక్ విమానానికి ఎక్కువ ఎత్తులో ప్రయాణించాల్సిందిగా సూచించినప్పటికీ.. అది మరింత దిగువకు వచ్చింది. అదే సమయంలో సౌదీ విమానం కూడా అదే గగనతలంలో దిగుతుండటంతో రెండు విమానాలు ఢీకొన్నాయి.


