స్కిన్‌కు సన్‌స్ట్రోక్‌..! | Beauty Tips: Heat stroke on skin: Symptoms, Treatment And Recovery | Sakshi
Sakshi News home page

స్కిన్‌కు సన్‌స్ట్రోక్‌..! సంరక్షించుకుందాం ఇలా..

Apr 28 2026 3:05 PM | Updated on Apr 28 2026 3:09 PM

Beauty Tips: Heat stroke on skin: Symptoms, Treatment And Recovery

నడివేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అలా ఎండలోకి వెళ్లామో లేదో ఒళ్లంతా మండుతున్న ఫీలింగ్‌. టూ వీలర్‌ నడుపుతూ ఉంటే... దుస్తులతో కప్పిలేనిచోట చర్మం చిమచిలాడిపోతోంది.వేడిమి తీవ్రతా, స్పర్శజ్ఞానం... వీటిని తెలిసేదీ, తెలిపేదీ చర్మమే. ఆ కారణంగా ఎండవేడిమితో మొట్టమొదట ప్రభావితమయ్యేది కూడా చర్మమే. అందుకే వేసవిలో తమ వృత్తుల కారణంగానో లేదా ఇతరత్రానో తప్పనిసరిగా ఎండలోకి వెళ్లేవారిపై ఆ వేడిమీ, ఆ వడగాడ్పుల తీవ్రత ప్రభావాలేమిటో, వాటిని అధిగమిస్తూ చర్మాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.

తీక్షణమైన ఎండవల్ల కలిగే హాని ఏమిటంటే...
ఎండకు ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు సూర్యుడి రేడియేషన్‌ ప్రభావాలేమిటి, వాటి వల్ల చర్మంపై పడే రకరకాల ప్రభావాలూ, వాటి కారణంగా వాటిల్లే నష్టాలూ, వాటిని అధిగమించే మార్గాలేమిటో తెలుసుకుందాం...

సూర్యుడి నుంచి భూమికి చేరే రేడియేషన్‌లో మనం చూడగలిగేదీ... చూపు అనే విజువల్‌ సెన్స్‌ కలిగించడానికి ఉపయోగపడేది చాలా తక్కువ. ఇందులో రేడియో తరంగాలూ, ఎక్స్‌–కిరణాలూ, మైక్రోవేవ్‌ తరంగాలూ ఇలా రకరకాల రేడియేషన్స్‌ అనేక వేవ్‌లెంత్స్‌లో ఉంటుంది. దీన్నింతా కలిపి ‘ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌’ అంటారు. అయితే ఇందులో మనకు దృష్టిజ్ఞానాన్ని ఇచ్చేందుకు అవసరమయ్యే ‘కాంతి’ చాలా తక్కువ. అయితే మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్‌ రేడియేషన్‌లోని వివిధ రకాల కిరణాలు వేవ్‌లెంత్స్‌ కలిగి ఉంటాయి. 

ఒక కిరణం లేదా తరంగంలోన పక్కపక్కనే ఉండే అలలోని...  ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరాన్ని  వేవ్‌లెంత్‌గా చెప్పుకుంటే మన కళ్లకు కనిపించే కాంతి తాలూకు వేవ్‌లెంత్‌ చాలా పరిమితంగా మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా  చెప్పాలంటే 400 – 700 నానో మీటర్ల రేంజ్‌లో ఉండే దాన్ని మాత్రమే మనం కాంతిగా పేర్కొంటాం. అంతకంటే తక్కువ వేవ్‌లెంత్‌తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్‌ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంత్‌తో ఉండేవాటిని ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలుగా చెబుతారు.

అల్ట్రా వయొలెట్‌ ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలతోనే హాని...
మనకు చేరే కాంతితోపాటు మన వాతావరణంలోకి వచ్చే ఈ అల్ట్రా వయొలెట్‌ (యూవీ), ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలతో మన చర్మానికీ, కంటికి కూడా హాని కలిగే  ప్రమాదం ఉంది. పైగా వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల అమితమైన శక్తితో ఉండే ఈ కిరణాలు కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ.

అల్ట్రా వయొలెట్‌ కారణాలు..చర్మంపై ప్రభావం..
సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్‌లోని హానికారకమైన చాలా రకాల రేడియేషన్‌ను మన భూమిపైన ఉండే ఓజోన్‌ పొర వడపోస్తుంది. మొత్తం రేడియేషన్‌లో కేవలం 3 శాతం అల్ట్రా వయొలెట్‌ కిరణాలు మాత్రమే భూమి ఉపరితలం వరకు చేరతాయి. ఇలా భూమిని చేరిన ఈ మూడు శాతం అల్ట్రా వయొలెట్‌ కిరణాల వల్ల  చర్మంపై అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. 

వీటిల్లోనూ యూవీ–సీ అని పిలిచే ఒక రకం అల్ట్రా వయొలెట్‌ కిరణాలు చాలా చాలా ప్రమాదకరమైనవి. కొన్నిసార్లు వాటి ప్రభావంతో స్కిన్‌–క్యాన్సర్‌ వచ్చే ముప్పు కూడా ఉంటుంది. అదృష్టవశాత్తు యూవీ–సీ కిరణాలను ఓజోన్‌ పొర అడ్డుకొని మనతోపాటు సకల జీవరాశినీ కాపాడుతుంటుంది. 

నిజానికి 400 – 700 న్యానోమీటర్ల మేరకు కాంతిపటలం తప్ప... అంతకు మించిన వేవ్‌లెంత్‌ వల్ల... అలాగే అంతకంటే తక్కువ వేవ్‌లెంత్‌ వల్ల... ఇంకా చెప్పాలంటే... అల్ట్రావయొలెట్, ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలతో మన చర్మానికి ఎంతో ప్రమాదం. అంతటి ప్రమాదకరమైన వేవ్‌లెంట్‌ ఉన్న తీక్షణమైన రేడియేషన్‌ను మానవ చర్మం తట్టుకోలేదు.

మన చర్మం రంగును బట్టి... మనం తట్టుకునే శక్తి...
సాధారణంగా 308 న్యానోమీటర్ల వేవ్‌లెంట్‌ వరకు మనం తట్టుకోగలమని ఓ రఫ్‌ అంచనా. ఒకవేళ రేడియేషన్‌ తాలూకు వేవ్‌లెంత్‌ ఫ్రీక్వెన్సీ 308 న్యానోమీటర్లు ఉన్నప్పుడు మనుషుల చర్మం ప్రభావితమవుతుంది. అయితే  ఈ రేడియేషన్‌ను తట్టుకునే శక్తి కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నల్లటి చర్మం (డార్క్‌ స్కిన్‌) ఉన్నవారు ఎండ తీవ్రత తీక్షణంగా ఉన్నా తట్టుకోగలరు. 

కానీ చర్మం తాలూకు రంగులో డార్క్‌నెస్‌ తగ్గుతున్నకొద్దీ అంటే చర్మం ఫెయిర్‌గా అవుతున్న కొద్దీ ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి కూడా తగ్గుతూ పోతుంది. అందుకే తెల్లటి చర్మం (ఫెయిర్‌ స్కిన్‌) ఉన్నవారు ఎండ తీవ్రతకు చాలా త్వరగా ప్రభావితమవుతారు. ఎండ తీవ్రత ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. మొదట తీవ్రమైన ఎండకు ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు చర్మం నల్లబారుతుంది. మొదటి దశల్లో ఇది కేవలం తాత్కాలికం. ఎండకు వెళ్లడం తగ్గిస్తే ఇలా నల్లబారడమూ తగ్గుతుంది. ఇలా చర్మం నల్లబారడాన్ని పిగ్మెంటేషన్‌ అంటారు.

తొలి దుష్ప్రభావాలు/తాత్కాలిక దుష్ప్రభావాలు

చర్మంపై అల్ట్రావయొలెట్‌ కిరణాల దుష్ప్రభావాలు ఈ కింద పేర్కొన్న రీతిలో ఉంటాయి.

ఎరిథిమా (సన్‌బర్న్స్‌)... 
సాధారణంగా సూర్యుడి తీక్షణత ప్రభావం వల్ల ఎండలోకి వెళ్లగానే మొదట చర్మం ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత మాడినట్లుగా నల్లబడుతుంది. ఇలా జరగడాన్ని సన్‌బర్న్స్‌గా చెప్పవచ్చు. దీన్నే వైద్యపరిభాషలో ఎరిథిమా అని చెబుతారు.

కొన్ని సందర్భాల్లో ఈ సమస్య చర్మంపైన ఎర్రగా పొక్కుల (బ్లిస్టర్స్‌) రూపంలోనూ కనిపించవచ్చు. ఎండ తీవ్రతను తట్టుకోగలిగే శక్తిలాగే... చర్మం రంగును బట్టి సన్‌బర్న్స్‌ తాలూకు తీవ్రత తగ్గడమూ, పెరగడం జరుగుతూ  ఉంటుంది. అంటే... ఫెయిర్‌ చర్మం వారిలో సన్‌బర్న్‌ తీవ్రత ఎక్కువగానూ, నల్లటి చర్మం వారిలో తక్కువగానూ ఉంటుంది. 

బ్లిస్టర్స్‌ ఏర్పడితే ఎండ తీవ్రత అన్నది ఆ వ్యక్తి చర్మంపై చాలా ఎక్కువగా ఉందనడానికి ఈ సన్‌బర్న్స్‌ ఒక  సూచన. కొందరిలో జ్వరం, వికారం, వాంతుల వంటివి కనిపించవచ్చు. అలాగే బాగా నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తూ బాగా బలహీనంగా ఫీల్‌ అవ్వడం కూడా జరగవచ్చు. కొందరిలో రక్త΄ోటు తగ్గడం, స్పృహతప్పడం వంటి పరిణామాలూ చోటుచేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తే బాధితులను తక్షణం   హాస్పిటల్‌కు తరలించాలి.

పరిష్కారం / చికిత్స : సన్‌బర్న్‌కు గురై చర్మం ఎర్రబారిన వారిని తక్షణం నీడపట్టునకు తీసుకెళ్లాలి. దాదాపు 12 – 24 గంటల పాటు బాగా చల్లటి ప్రదేశంలో ఉన్నా లేదా ఎయిర్‌కండిషన్‌ గదిలో బాధితుడిని ఉంచినా... ఆ లక్షణాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి.  చర్మంపై చల్లటి నీటిలో తడిపిన టవల్‌తో తుడవటం లాంటి ఉపశమన ప్రక్రియలను చేయవచ్చు. 

అయితే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డర్మటాలజిస్టుల సూచన మేరకు నాన్‌స్టెరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ (ఎన్‌ఎస్‌ఏఐడీస్‌), చర్మపు మంట తగ్గడానికి హైడ్రోకార్టికోసోన్‌ క్రీములు వాడాల్సిరావచ్చు. పొక్కులను పగలగొట్టకూడదు. మాయిష్చరైజింగ్‌ క్రీములతో ఈ సమస్య తగ్గుతుంది.

పిగ్మెంటేషన్‌
ఎండకు ఎక్స్‌పోజ్‌ అయ్యేవారి చర్మం రంగు నల్లబారడాన్ని ‘పిగ్మెంటేషన్‌’గా చెప్పవచ్చు. ఎండ తీవ్రత కారణంగా చర్మంలోని మెలనిన్‌ కణాల్లో ఫొటోపిగ్మెంటేషన్‌ చర్య జరగడం వల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. అయితే దీని తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు అంటే... ‘ఇమ్మిడియట్‌ పిగ్మెంటేషన్‌ డార్క్‌నెస్‌’ (ఐపీడీ)లో నీడలోకి వచ్చి చల్లటి ప్రదేశంలో ఉంటే... కేవలం రెండు గంటల్లోనే పిగ్మెంటేషన్‌ తాలూకు ప్రభావం తగ్గుతుంది. 

కానీ... వారి వృత్తి రీత్యాగానీ లేదా ఇతరత్రా ఎండకు తప్పనిసరిగా తిరిగే వ్యక్తుల్లో... ‘తాత్కాలిక ఐపీడీ’కి బదులుగా ‘పెర్‌సిస్టెంట్‌ పిగ్మెంట్‌ డార్కెనింగ్‌’ (పీపీడీ) అనే కండిషన్‌ వృద్ధిచెందుతుంది. దీని ప్రభావం కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాల వరకు ఉండవచ్చు. కంటిన్యువస్‌గా నీడపట్టున ఉండటమే దీనికి నివారణ. ‘పెర్‌సిస్టెంట్‌ పిగ్మెంట్‌ డార్కెనింగ్‌’ (పీపీడీ) కండిషన్‌ మొదలయ్యాక... ఇక  ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా అదేపనిగా ఎండలో తిరగడం చర్మం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 

పరిష్కారం / చికిత్స : వీలైనంత మేరకు తీక్షణమైన ఎండకు అదేపనిగా  ఎక్స్‌పోజ్‌ కాకుండా ఉండటం వల్ల ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చు. అయితే చర్మం నల్లబారాక (డార్క్‌గా అయ్యాక) డర్మటాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకుంటే చాలావరకు చర్మం మునపటి రంగు సంతరించుకునే అవకాశముంటుంది.

చెమట కాయలు (మిలీరియా)
చెమటకాయలు అని మనమంతా చెప్పుకునే ఈ సాధారణ సమస్యలను వైద్యపరిభాషలో మిలీరియా అంటారు. చర్మంపై ఉండే చెమట గ్రంథుల్లో (స్వేదగ్రంధుల్లో) ఏదైనా అడ్డంకి ఏర్పడినప్పుడు అవి ఉబ్బినట్లుగా అవుతాయి. బాగా చెమట పట్టి... అది ఆవిరైపోయే పరిస్థితి లేనప్పుడు స్వేదగ్రంధుల చివర్లో చెక్కరతో కూడిన పదార్థం (పాలీశాకరైడ్‌ సబ్‌స్టాన్స్‌) రూపొందింది, అది చర్మగ్రంధి చివరన అడ్డుగా ఉండిపోతుంది. 

ఫలితంగా లోపల ఉన్న చెమట (స్వేదం) బయటికి రాలేక లోపలే ఉండిపోయి, స్వేదగ్రంథిలో ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా స్వేదం పక్క కణజాలాల్లోకి స్రవించి చెమటకాయలు రూపంలో కనిపిస్తూ అవి విస్తరించినట్లుగా అవుతాయి. 

ఇక ఏవైనా ఆరోగ్య సమస్యలతో పడకకే పరిమితమైన (బెడ్‌ రిడెన్‌) పేషెంట్స్‌లో  చెమట ఎక్కువగా పట్టడం, వారు తమ దేహాన్ని అటు ఇటు  కదిలించలేకపోవడంతో ఇవి ఎక్కువగా వస్తుంటాయి.

ఈ చెమటకాయల్లోనూ మిలీరియా క్రిస్టలైన్‌ (సుడామినా), మిలీరియా రుబ్రా (ప్రిక్లి హీట్‌) ఉంటాయి.  అవి మెడ, ఛాతీ, వీపు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మిలీరియా క్రిస్టలైన్‌ (సుడామినా) కండిషన్‌లో చెమటకాయల తీవ్రత అంతగా ఉండకపోవడంతో చర్మంపై మంట ఉండదు. కానీ మిలీరియా రుబ్రా (ప్రీక్లీ హీట్‌)లో చెమటకాయలు ఎర్రగా కనిపిస్తుంటాయి. చేతికి తగులుతూ ముళ్లతో గుచ్చిన ఫీలింగ్‌ ఉంటుంది.  

ఇవి మంటనూ, తిమ్మిర్ల వంటి భావనను కలిగిస్తాయి. ఇక ‘మిలీరియా పుస్టులోజా’ అనే కండిషన్‌ మరింత తీవ్రమైనది. ఇందులో స్వేదగ్రంధిలోని స్వేదనాళానికి అడ్డంకి ఏర్పడటంతో పాటు అది దెబ్బతినడం కూడా జరగవచ్చు. ఇవి చర్మంలోని ఛాతీ, వీపు ప్రాంతాలలో తోపాటు ప్రైవేట్‌ పార్ట్స్‌లో కూడా విస్తరించవచ్చు. ఇది కొన్ని వారాల పాటు ఉంటుంది.

పరిష్కారం / చికిత్స : చల్లటి ప్రదేశాల్లో ఉండటం, రోజూ క్రమం తప్పకుండా స్నానం చేయడం, ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలతో దీన్ని నివారించవచ్చు. అయితే చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుతాయి. పిల్లలకు లేదా పెద్దలకు వాడే సాధారణ పౌడర్, తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్నవారికి ప్రీక్లీ హీట్‌ ΄పౌడర్లతో ఉపశమనం ఉంటుంది. 

అయితే ‘మిలీరియా పుస్టులోజా’ అనే రకపు చమటకాయల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నవారూ, ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర కూడా చెమటకాయలు కనిపిస్తున్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టును సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.  

ఫొటో ఏజింగ్‌ : అదేపనిగా చాలాకాలం పాటు ఎండలో తిరగడం వల్ల కొన్ని అవాంఛనీయ దీర్ఘకాలిక పరిణామాలు ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనది ఫొటోఏజింగ్‌. ఈ కండిషన్‌లో (ఫొటోఏజింగ్‌లో) చర్మంపై అవాంఛితమైన ముడతలు, వెడల్పుగా ప్యాచ్‌ వచ్చిన రీతిలో మచ్చలు (సోలార్‌ లెంటిజిన్స్‌) రావచ్చు. ఇక చర్మం తన సాగే గుణాన్ని  (ఎలాస్టిసిటీని) కోల్పోవడం; చర్మంపైన రక్తనాళాలు దారపు పోచల్లా కనిపించడం (టెలాంజిక్టాసియాస్‌ – అవే తర్వాత సాలెగూళ్లలా అల్లుకుని కనిపిస్తాయి. 

వాటినే స్పైడర్‌ వెయిన్స్‌ అని  అంటారు); చర్మం ఎండిపోయినట్టుగా కనిపించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. అటు తర్వాత చర్మం చాలా ముదురుగా (రఫ్‌గా) నిపిస్తుంటుంది. ఎవరిలోనైనా ఇలాంటి దశ వస్తే... ఇకపై ఈ దశ తర్వాతైనా  చాలాసేపు ఎండకు వెళ్లకుండా చర్మాన్ని కాపాడుకోవాలి. తద్వారా ఫొటో ఏజింగ్‌ను నివారించవచ్చు.

చివరగా... ఇక్కడ తెలిపిన సూచనలు పాటిస్తూ ఉండటం వల్ల వీలైనంత మేరకు చర్మానికి వచ్చే సమస్యలను నివారించుకోవడం, ఎండ తీక్షణత నుంచి తమను తాము కాపాడుకోవడం అన్నది చాలావరకు సాధ్యమవుతుంది.

ఎండ నుంచి చర్మానికి రక్షణ ఇలా...

వేసవిలో ప్రతి రోజు రెండుపూటలా స్నానం చేయడం. (చల్లటి నీటి కంటే  గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది). 

ఎండలోకి వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లడం. 

లైట్‌ కలర్‌ దుస్తులు వాడటం, (బాగా గాలి ఆడే కాటన్‌ దుస్తులు, ఎండ తగలనివ్వని లాంగ్‌స్లీవ్స్‌ దుస్తులు వాడటం మంచిది. అలాగే బాగా బిగుతుగా ఉన్న వస్తువులు ధరించడం వల్ల చెమట వల్ల ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ లేదా మెటల్స్‌ వల్ల కలిగే అలర్జిక్‌ రియాక్షన్స్‌ వచ్చి... ఆ కారణంగా  దురద వచ్చే అవకాశం ఉంటుంది. మరికొందరిలో వేలికి ఉంగరం ఉన్న చోట రెగ్యులర్‌గా సబ్బు నురగ ఇరుక్కుపోయి... ఆ డిటర్జెంట్‌ కారణంగా అలర్జీ రావచ్చు. ఇలాంటివారు తమ ఆభరణాలు మరీ బిగుతుగా లేకుండా చూసుకోవడం లేదా ఈ సీజన్‌లోవాటిని ధరించకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మేలు). 

యాంటీ ట్యానింగ్‌ సన్‌స్క్రీన్స్, ఇన్‌ఫ్రారెడ్, అల్ట్రావాయొలెట్‌ నుంచి రక్షణ దొరికేలా మంచి సన్‌స్క్రీన్స్‌ వాడటం. (వేసవిలో డాక్టర్లు / డర్మటాలజిస్టులు సూచించిన... ఎస్‌పీఎఫ్‌ ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌లను వాడాలి). 

అవసరమైనవారు డాక్టర్‌ సలహా మేరకు రాత్రి వేళల్లో డీ–పిగ్మెంటేషన్‌ క్రీమ్స్‌ వాడటం. 

ఈత వంటి ఆటల్లో పాల్గొనే క్రీడాకారులు వాటర్‌ప్రూట్‌ సన్‌స్క్రీన్స్‌ వాడటం. 

చర్మం తన సాగేగుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోకుండా ఉండటం కోసం నీళ్లు ఎక్కువగా తాగడం, ద్రవహారాలు ఎక్కువగా తీసుకోవడం. (ప్రతిరోజూ కనీసం 12 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఈ సీజన్‌లో నీళ్లతో పాటు మజ్జిగ (బటర్‌మిల్క్‌), కొబ్బరినీళ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం మేలు. కోలా డ్రింక్స్‌ వంటివి చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం అవసరం). 

ఈ సీజన్‌లో తలకు రంగు వేసుకునే వారు చల్లటి వేళల్లో వేసుకోవడం మేలు.

డియోడరెంట్స్‌ వాడేవారి కోసం కొన్ని సూచనలు... 
డియోడరెంట్స్‌ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా డియోడరెంట్స్‌లో బర్‌గ్యాప్టెన్‌ అనే సోరోలెన్స్‌ పదార్థం ఉంటుంది. దాంతోపాటు దీనికి మంచి సువాసన (ఫ్రాగ్రెన్స్‌) రావడానికి కొన్ని రసాయనాలు వాడతారు. ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల ఇవన్నీ చర్మంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. 

కాబట్టి నేరుగా డియోడరెంట్స్‌ చర్మంపై రాసుకోవడం కంటే ఫ్రాగ్రెన్స్‌ను కోరుకునేవారు వాటిని బట్టలపై వేసుకునేలా (స్ప్రే చేసుకునేలా) వేసుకుంటే మంచిది. అందునా బట్టలు ధరించకముందే వాటిపై స్ప్రే చేసి... ఒక అరగంట తర్వాత దుస్తులు  ధరించాలి. అలా ఉపయోగిస్తే చర్మానికి కలిగే హానిని తగ్గించినట్లు అవుతుంది.  
డా. స్వప్నప్రియ, సీనియర్‌ డర్మటాలజిస్ట్‌ 

నిర్వహణ: యాసీన్‌

(చదవండి: Dementia: వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..? దెబ్బకు మతిమరుపు..)

Advertisement
 
Advertisement
Advertisement