
రోగుల సంరక్షణకే పెద్దపీట , ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం ముఖ్యం
సేఫ్‌ప్లాస్ట్-2025 సదస్సులో సీనియర్ వైద్యుల సూచనలు
టి-హబ్‌లో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల సదస్సు
హైదరాబాద్: సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, వైద్యశాస్త్రంలో సరికొత్త మార్పులు వస్తున్నా ఇప్పటికీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, లేజర్ చికిత్సలు, ముఖానికి సంబంధించిన మార్పుల కోసం చేయించుకునే శస్త్రచికిత్సల విషయంలో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దానికి ప్రధాన కారణం.. చేయించుకుంటే ఏమైనా అవుతుందేమోనన్న భయం. రోగుల్లో ఈ భయం రావడానికి కూడా కారణాలు లేకపోలేవు. కొన్నిసార్లు ఈ తరహా చికిత్సల వల్ల కొంతమందికి ఇన్ఫెక్షన్లు రావడం, రకరకాల సమస్యలు తలెత్తడం లాంటివి ఉంటున్నాయి. కుప్పలు తెప్పలుగా నకిలీ వైద్యులు పుట్టుకురావడం, ఉన్నవారిలో కొందరికి నైపుణ్యాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలని వక్తలు పేర్కొన్నారు.
రోగులకు ఈస్థటిక్ చికిత్సలు, కాస్మొటిక్ శస్త్రచికిత్సలు, ప్లాస్టిక్ సర్జరీలు అత్యంత సురక్షితంగా చేయడం ఎలాగన్న విషయాన్ని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా నగరంలోని టి-హబ్ వేదికగా రెండురోజుల పాటు నిర్వహించే సేఫ్ ప్లాస్ట్-2025 సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన 120 మందికి పైగా ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులతో పాటు విదేశాల నుంచి ఆన్‌లైన్‌లో కూడా కొందరు పాల్గొన్న ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 25 మంది సీనియర్ ప్లాస్టిక్ సర్జన్లు వివిధ అంశాలపై మాట్లాడి అవగాహన కల్పించారు.
ఈ సదస్సులో దుబాయ్‌కి చెందిన ప్రముఖ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంజయ్ పరాశర్ మాట్లాడుతూ, ‘‘ప్లాస్టిక్, ఈస్థటిక్ సర్జరీలు చాలా సంక్లిష్టమైనవి. కొన్ని సందర్భాల్లో మనం నూటికి నూరుశాతం కృషిచేసినా, ఫలితాలు మాత్రం అలా ఉండకపోవచ్చు. మరికొన్నిసార్లు అనుకోని అవాంతరాలు ఎదురవు తుంటాయి. అలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించు కోవాలో తెలియడం ముఖ్యం. అలాగే అసలు సమస్యకు కారణం ఏంటన్నది కూడా గుర్తించాలి. అసలు ప్రక్రియ ఎలా చేయాలన్నది తగినంత శిక్షణ లేకుండా కేవలం పుస్తకాలు చూసి చేసేయడం కూడా సరికాదు. పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తర్వాత చేస్తే మాత్రమే రోగులకు అత్యంత సురక్షితంగా చికిత్స చేయగలం. మిగిలిన విభాగాలలో చేసే చికిత్సలు వేరు, ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు చేసే చికిత్సలు వేరు.
కాస్త అందంగా కనపడాలని, ఉన్న లోపాన్ని సరిచేయించుకోవాలని వచ్చేవాళ్లకు మనం పూర్తి సంతృప్తి ఇవ్వగలగాలి. అంతే తప్ప ఉన్నదాన్ని కూడా మరికొంత చెడగొడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. చికిత్స చేసిన తర్వాత ఏదో ఒక కారణంతో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అవి రాకుండా చూసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా లైపోసక్షన్, కాస్మొటిక్ శస్త్రచికిత్సలు, ముఖం మీద వివిధ భాగాలు అంటే ముక్కు, గడ్డం, బుగ్గలు.. ఇలాంటివి సరిచేయించుకునే చికిత్సలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ లాంటివి చాలా సున్నితమైనవి. వీటి విషయంలో ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించుకుని రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని చెప్పారు.
పెర్సానిక్స్ కాస్మొటిక్స్, ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురుకర్ణ వేముల మాట్లాడుతూ, ‘‘అసలు ఈ చికిత్సలు చేయించుకోవడానికి ఎవరి వద్దకు వెళ్లాలనేది రోగులు ముందుగా నిర్ణయించుకోవాలి. అందుకోసం వాళ్ల ప్రొఫైల్, వెబ్‌సైట్లు, రాష్ట్ర స్థాయిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లాంటివాటిలో రిజిస్ట్రేషన్లు అన్నీ చూసుకోవాలి. వైద్యుల డిగ్రీల గురించి తెలుసుకోవాలి. ఎంబీబీఎస్, ఎండీ, ఎంసీహెచ్ లాంటివి అన్నీ మంచి డిగ్రీలు. అవికాకుండా ఎఫ్ఐఎస్ఎస్, ఇలాంటి ఏవేవో పేర్లతో ఉండే ఫెలోషిప్‌లు ఉన్నాయంటే మాత్రం కొంత అనుమానించాలి. తగిన శిక్షణ లేని వాళ్లు ఇలాంటి చికిత్సలు చేయడం వల్ల పలురకాల సమస్యలు వస్తున్నాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నప్పుడు కొంతమందికి తలమీద ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అలాగే బొటాక్స్, ఫిల్లర్లు, లేజర్ చికిత్సల వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి.
ఇవన్నీ లేకుండా ఉండాలంటే.. రోగులు ముందుగా తగిన వైద్యుడిని ఎంచుకోవడం ముఖ్యం. అలాగే, ఈస్థటిక్ సర్జరీల గురించి మన దేశంలో ఇంకా శిక్షణ మెరుగుపడాలి. శిక్షణ కార్యక్రమాలు పెంచాలి. బొటాక్స్, ఫిల్లర్స్, లేజర్స్, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ లాంటి చికిత్సలను అత్యంత సురక్షితంగా చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు అనుక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం అందాన్ని మెరుగుపరిచేది మాత్రమే కాదు.. అనేక సందర్భాలలో ప్రాణాలను సైతం రక్షిస్తుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి, అలాగే విదేశాల నుంచి వచ్చిన సీనియర్లు చెబుతున్న విషయాలేవీ వైద్య పుస్తకాల్లో ఉండవు. వీటిని కేవలం వారి అనుభవాల ద్వారానే తెలుసుకోవాలి. ఈ రంగంలో ఉన్న అత్యుత్తమ వైద్య నిపుణులు తమ అనుభవాలను పాఠాలుగా చెబుతున్నందున వీటినుంచి నేర్చుకుంటే ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు తమ వృత్తి జీవితంలో రాణించగలరు’’ అని తెలిపారు.