
ప్రతీకాత్మక చిత్రం
‘నొప్పి’ని తగ్గించేందుకు వైద్య శాస్త్రంలో నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా నొప్పికి విరుగుడు కనిపెట్టడంలో ఇంకా పూర్తి విజయాన్ని సాధించలేకపోయారు. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్, గాయాలు... ఇవన్నీ మనిషికి నొప్పి కలిగిస్తాయి. శరీరంలో నొప్పి, సందేశాలను అణచివేసే రసాయనాలు ప్రవేశపెడితే ఈ నొప్పికి విరుగుడుగా ఉంటుంది. శరీరంలో నొప్పికి విరుగుడుగా ‘విద్యుత్ చికిత్స’ ఉత్తమమని పరిశోధకులు గుర్తించారు. శరీరంలోకి బలహీనమైన విద్యుత్‌ను ప్రసారం చేస్తే అది మత్తు మందులా పనిచేసి రోగికి నొప్పి తెలియకుండా చేస్తుంది.
నొప్పిని కల్గించే ప్రేరణలను మందగింపచేయడమే గాక మెదడుకు సమచారం వెళ్లకుండా ఈ విద్యుత్ నిరోధిస్తుంది. దీనినే ‘ఎలక్ట్రిక్ స్టిములేషన్’ పద్ధతి అంటారు. మన భారతీయ పరిశోధకుడు ఒకాయన ‘అయాన్ వైద్య చికిత్స’ రూపొందించారు. ఈ చికిత్స వలన అనేక మంది రోగులు నొప్పి నుండి విముక్తి పొందినట్లు ఆయన ప్రకటించారు. అమెరికాలోని వైద్య పరిశోధకులు ఈ ‘అయాన్ వైద్య చికిత్స’ బాగా పనిచేస్తోందని చెప్పారు.
మూడవ డిగ్రీ స్థాయి వరకు శరీరం కాలిన రోగులకు విద్యుదావేశం కాబడిన గాలిని తగిలేటట్లు చేస్తే కొంతమేర స్వస్థత చేకూరిందని తెలియ జేశారు. అంటే నొప్పికి విద్యుత్ ఒక ‘బామ్’గా పనికి వస్తుందన్నమాట. విద్యుత్ పరికరాల సహాయంతో ఋణవిద్యుదావేశం గల గాలిని తయారు చేశారు. ఈ గాలిని బాగా పోగుచేసి నొప్పిగల ప్రదేశం మీదకు పంపారు. ఫలితంగా నొప్పి తగ్గినట్లు వారు గుర్తించారు.
ఈ అయాన్‌లు గల గాలి వైద్యంతో కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు వంటి వాటిని నయం చేయడానికి ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. శరీరానికి గాయం అయితే ఆ ప్రాంతంలో నొప్పి ఉంటుంది. ఎందుకంటే అక్కడి జీవకణాలకు విద్యుత్ నిరోధం తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా ఆ ప్రాంతంలో ఏర్పడే ద్రవపదార్థాలకు విద్యుత్ వాహకత్వం ఉంటుంది. రష్యాలోని పరిశోధకులు ఈ నిజాలు తెలుసుకుని తక్కువ విద్యుత్ నిరోధం గల జీవకణం పైకి విద్యుత్‌ను ప్రవహింప చేశారు. ఫలితంగా అది తిరిగి విద్యుత్ నిరోధక శక్తిని పుంజుకుంది. ‘ఇదే నొప్పి నివారణకు విద్యుత్ ఉపయోగపడుతున్న తీరు’ అని వివరించారు.
చదవండి: డయాబెటిస్ రోగుల కాళ్లకు దెబ్బ తగిలితే ఏం చేయాలి?
ఈ చికిత్స వలన నొప్పి తగ్గిన వారిలో మళ్ళీ నొప్పి పునరావృతం కాలేదు. రోగి విద్యుత్ చికిత్స సమయంలో గాని ఆ తరువాత నాలుగు గంటల వరకు గానీ ఎటువంటి లోహపు వస్తువులనూ తాకకూడదు. నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోకూడదు. రబ్బరు తొడుగులు ధరించి రోగి చికిత్స చేయించుకోవాలి. లేకపోతే రోగికి సరఫరా చేసిన విద్యుత్ ఎర్త్ అయిపోతుంది.
– డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ, పాపులర్ సైన్స్ రచయిత