మధుమేహంతో బాధపడేవాళ్లు పాదాల సంరక్షణ కోసం..! | Health Tips: Diabetes Foot Care: Tips for Healthy Feet & Preventing ... | Sakshi
Sakshi News home page

Diabetes Foot Care: మధుమేహంతో బాధపడేవాళ్లు పాదాల సంరక్షణ కోసం..!

Sep 14 2025 11:25 AM | Updated on Sep 14 2025 11:38 AM

Health Tips: Diabetes Foot Care: Tips for Healthy Feet & Preventing ...

డయాబెటిస్‌ పేషెంట్లలో కాలికి దెబ్బతగిలి, అది సెప్టిక్‌ కావడంతో కాలు తొలగించాల్సి వచ్చిందని వింటుండటం మామూలే. ఇలా కాలు సెప్టిక్‌ కావడాన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్‌ అంటారు. డయాబెటిస్‌ ఉన్నవారికి కాళ్లకూ, వేళ్లకూ చివర్లలో ఉన్న నరాలు మొద్దుబారుతుండటం సాధారణం. దాంతో వాళ్లకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా నొప్పి తెలియదు. కొందరిలోనైతే చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకున్నా కాలికి గ్యాంగ్రీన్‌ వచ్చే వరకు విషయం తెలియదు. తీరా పరిస్థితి విషమించాక వారు తమ ఫిజీషియన్‌ దగ్గరకు రావడం, వాళ్లు వ్యాస్క్యులార్‌ సర్జన్‌ దగ్గరికి పంపితే కాలు తొలగించాల్సిన పరిస్థితి అని చెప్పడం చాలామందికి ఎదురయ్యే పరిస్థితే! ఈ పరిస్థితి నివారించడానికి ఏం చేయాలో తెలిపే కథనమిది.

డయాబెటిస్‌తో బాధపడే వ్యక్తుల్లో కాలికి ఏదైనా దెబ్బతగిలి అది గ్యాంగ్రీన్‌గా మారిన దాదాపు 80% మందిలో కాలు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇలా కాలు తొలగించడాన్ని వైద్యపరిభాషలో ‘నాన్‌ట్రామాటిక్‌ లోయర్‌ లింబ్‌ యాంపుటేషన్‌’గా చెబుతారు.  

పల్లె వాసుల్లో కాలు తొలగింపు ముప్పు... 
నిజానికి పట్టణవాసులతో పోలిస్తే డయాబెటిస్‌ కారణంగా కాలు తొలగింపు ముప్పు పల్లెప్రజల్లోనే ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... పల్లెల్లోని రక్కిస పొదలతో నిండి ఉండే డొంకదారుల్లో నడుస్తున్నప్పుడు కాలికి ముళ్లు గుచ్చుకోవడం లేదా ముళ్ల కంచెకు కాలు తగిలి చీరుకుపోవడంతో గాయాలు కావడం 

పట్టణ ప్రజలతో పోలిస్తే చెప్పుల్లేకుండా ఖాళీ పాదాలతో నడిచేవారు పల్లెల్లోనే ఎక్కువగా ఉండటం. దాంతో పాదం కింద చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకోవడం లేదా కాలివేళ్లకు తాకుడు రాయి తలగడం ఎక్కువ 

పశువులను మేతకు విడుస్తున్నప్పుడు అవి పొరబాటున కాలు తొక్కడంతో గాయం కావడం 

వ్యవసాయ పనుల్లో కొడవలి వంటి పదునైన పనిముట్లు తగిలి గాయం కావడం ∙డొంకదారులను పశువులు నడవడానికి వీలుగా కంప కొడుతున్నప్పుడు... అది గీరుకుపోవడం... 

పత్తి పంట కోశాక... ఎండిన మొదళ్లపైన పొరబాటున కాలు పడ్డప్పుడు... అవి పాదాల్లో గుచ్చుకుపోవడం.

ఇప్పుడు పట్టణ / నగరా ప్రాంతాల్లోనూ... 
ఇలాంటి ప్రమాదాలకు పల్లెల్లో అవకాశాలు ఎక్కువ. అయితే ఇటీవల పట్టణ ప్రాంతాల్లోనూ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. డిజైనర్‌ వేర్‌ పాదరక్షలు ధరించేవారిలో, ఎప్పుడూ కదలకుండా పనిచేస్తూ ఉండే ఐటీ రంగాలకు చెందిన ఉద్యోగుల్లో, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆరుబయట నిర్వహించే ప్రత్యేక పూజలూ /  ప్రార్థనల్లో భాగంగా చెప్పులు లేకుండా నడవటం వంటి సందర్భాల్లో పాదాలకు గాయాలు కావడంతో ఇప్పుడు పట్టణ, నగరవాసుల్లో కూడా ఈ తరహా గాయాలు అవుతున్నాయి. 

అవి పల్లెవాసులకైనా లేదా పట్టణ ప్రాంతాలవారికైనా వాళ్ల కాళ్లకు అయ్యే గాయాలు ‘ఫుట్‌ అల్సర్‌’ అని పిలిచే పుండ్లుగా మారి కాలు దాదాపుగా గ్యాంగ్రీన్‌గా మారినప్పుడు కొందరిలో కాలిని తొలగించాల్సి వచ్చే ‘యాంపుటేషన్‌’ తప్పకపోవచ్చు. 

కాలు తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే..? 
సాధారణంగా కాలికి గానీ ఇతరత్రా ఏ అవయవానికైనా గాయమైతే వెంటనే నొప్పి వస్తుంది. గాయమైనప్పుడు ఆ భాగం పూర్తిగా కోలుకోవడానికి వీలుగా మనలోని రక్షణ వ్యవస్థ ఆ భాగంలో ‘నొప్పి’ని కలిగిస్తుంది. దాంతో మనం కాలిని కదిలించకుండా దానికి తగినంత విశ్రాంతినిస్తాం. అయితే డయాబెటిస్‌తో బాధపడే వ్యక్తుల్లో నొప్పిని తెలిపే ‘నరాలు’ మొద్దుబారి ఉండటంతో నొప్పి పెద్దగా తెలియదు. దాంతో అదే కాలిని ఉపయోగిస్తున్నప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బ తగులుతూ గాయం మాటిమాటికీ రేగుతుంది. అప్పుడా ఇన్ఫెక్షన్‌ దెబ్బతగిలిన చోటి నుంచి పైపైకి ΄ాకవచ్చు. ఇలా జరగడాన్ని వాడుక భాషలో మనం సెప్టిక్‌ కావడం అంటుంటాం.

గాయం ఒక ముప్పు అయితే గ్యాంగ్రీన్‌ మరో ముప్పు... 
మన దేహంలోని ప్రతి అవయవానికీ, అందులోని ప్రతి కణానికీ నిత్యం రక్తసరఫరా జరుగుతూ ఉంటుంది. అలాగే దేహంలోని ప్రతి భాగానికీ స్పర్శ తెలిపే నరాలూ ఆవరించుకుని ఉంటాయి. వాటి వల్ల మనకు స్పర్శజ్ఞానంతో ΄ాటు దెబ్బతగిలినప్పుడు నొప్పి, బాధ తెలుస్తుంటాయి. కాలక్రమంలో డయాబెటిస్‌ వ్యాధి నరాల చివరలను మొద్దుబారేలా చేయడం వల్ల దేహంలోని కొన్ని భాగాలు... మరీ ముఖ్యంగా కాలివేలి చివర్లలో స్పర్శజ్ఞానం అంతగా తెలియదు. పైగా దేహంలోని చివరి భాగాలకు రక్తం సరఫరా చేసే అతి సన్నటి రక్తనాళాల్లో (క్యాపిల్లరీస్‌) అడ్డంకులు ఏర్పడటం వల్ల అక్కడికి అందాల్సిన షకాలు, ఆక్సిజన్‌ అందక΄ోవడంతో ఆ భాగం కుళ్లి΄ోవడం మొదలవుతుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్‌’గా చెబుతారు.  స్పర్శజ్ఞానం, నొప్పి తెలియక΄ోవడంతో గ్యాంగ్రీన్‌ మొదలైనప్పటికీ ఆ విషయమే డయాబెటిస్‌ బాధితులకు వెంటనే తెలియదు. అలా ఇన్ఫెక్షన్‌ పైపైకి పాకుతూ పోతుంటే మొత్తం ప్రాణానికే ప్రాణాపాయం జరిగే అవకాశముంటుంది కాబట్టి గ్యాంగ్రీన్‌ ఎంతవరకు పాకిందో అక్కడి వరకు ఆ కుళ్లిన భాగాన్ని తొలగించాలంటూ (యాంపూట్‌ చేయాలంటూ) డాక్టర్లు చె΄్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రమాదం కేవలం కాళ్లకేనా..? 
ఇలా యాంపూటేషన్‌ చేయాల్సిన పరిస్థితి కేవలం కాళ్లకు మాత్రమే కాకుండా చేతులకూ వచ్చే ప్రమాదముంది అయితే కాళ్లతో ΄ోలిస్తే చేతులూ, చేతి వేళ్లతో మనం ప్రతినిత్యం పనిచేస్తుంటాం కాబట్టి... చేతులకు అలాంటి కండిషన్‌ వస్తే కాళ్లతో ΄ోలిస్తే త్వరగా తెలిసి΄ోతుంది. అందుకే చేతులతో ΄ోలిస్తే  కాళ్లు, కాలివేళ్లకే గ్యాంగ్రీన్‌ ముప్పు మరింత ఎక్కువ.

మరో జాగ్రత్త ‘యాంకిల్‌ బ్రేకిల్‌ ఇండెక్స్‌’ పరీక్ష...
ఏడాదికోసారి లేదా డాక్టర్లు చెప్పిన విధంగా పాదాల విషయంలో వైద్యులను కలిసి పాదాలకు పల్స్‌ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. చేతుల మణికట్టు దగ్గర చూసినట్టే... డాక్టర్లు కాలి దగ్గర కూడా పల్స్‌ చెక్‌ చేసి చూస్తారు. అక్కడ నాడీస్పందనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. అలాగే యాంకిల్‌ బ్రేకిల్‌ ఇండెక్స్‌ అని మరో పరీక్ష ఉంటుంది. 

ఇందులో బీపీ పరిశీలించేటప్పుడు చేతికి చుట్టినట్టే కాలి దగ్గర కూడా బీపీ పరిశీలించేప్పుడు చుట్టే పట్టాచుట్టి ఈ పరీక్ష చేసి, కాలిలో బీపీ కొలత చూస్తారు.  కొలత విలువ ‘ఒకటి (1)’ ఉంటే అంతగా ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. కానీ ఈ కొలత 0.5 కంటే తగ్గుతూ ΄ోతూ ఉంటే (అంటే ఆ విలువలో సగానికంటే తక్కువగా ఉంటే... చేతితో ΄ోలిస్తే అందులో సగం కంటే తక్కువగా ఉంటే) కాలిలో రక్త ప్రసరణ తగ్గుతూ ఉందని అర్థం. ఇలాంటప్పుడు ‘సూపర్‌వైజ్‌డ్‌ ఎక్సర్‌సైజ్‌ థెరపీ’లాంటి వ్యాయామాల చికిత్స తప్పక అవసరమని గుర్తించాలి. 

చివరగా... డయాబెటిక్‌ ఫుట్‌ సమస్యలో సాదానికి పుండ్లు పడ్డప్పుడు అది కేవలం వాస్క్యులార్‌ సర్జన్‌ మాత్రమే కాకుండా ఒక సమగ్రమైన కార్యాచరణతో పలువురు నిపుణులు ఓ బృందంగా ఏర్పడి చికిత్స అందించాల్సి అవసరం ఉంటుంది. ఇందులో వాస్క్యులార్‌ సర్జన్‌లు, ΄ప్లాస్టిక్‌ సర్జన్‌లు, డయాబెటాలజిస్టులు, ఫుట్‌ యాంకిల్‌ సర్జన్లు,  పాడియాట్రిక్‌ నిపుణులు, ఇంటర్నల్‌ మెడిసిన్‌ చికిత్సకులు, ఫిజియోథెరపిస్టులు ఇలా టీమ్‌వర్క్‌తో డయాబెటిక్‌ లింబ్‌ సాల్వేజ్‌ టీమ్‌గా ఏర్పడి పాదాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆహారంలో చక్కెర మోతాదులను తగ్గించే విధంగా న్యూట్రిషనిస్టులు, రక్తంలో చక్కెరను అదుపు చేయడానికీ, రక్తంలో కొవ్వులు తగ్గించే మందులిచ్చే జనరల్‌ ఫిజీషియన్లు... ఇలా డాక్టర్ల బృందమంతా సమగ్రంగా పనిచేయాల్సి ఉంటుంది.

ఎవరికి వారు కాళ్లను స్వయంగా పరీక్షించుకుంటూ ఉండాలి. ఇందుకోసం పాదాల కింద అద్దంపెట్టుకుని, పాదాల అడుగుభాగం ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి.  అలాగే కాలి పైభాగాన్ని కూడా శ్రద్ధగా పరిశీంచుకోవాలి. కాలి వేళ్ల మధ్య భాగాలనూ  జాగ్రత్తగా చూస్తూ... అక్కడ చిన్న పోక్కుల్లాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. అలాంటివి ఉంటే వెంటనే డాక్టర్‌కు తెల΄ాలి. లేదంటే అవి పుండ్లుగా మారే ప్రమాదం ఉండవచ్చు.

కాలిగోళ్లను ప్రతివారమూ కట్‌ చేసుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్‌ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్‌ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. డయాబెటిస్‌ బాధితుల్లో ఇది చాలా ప్రమాదకరం.

వేడి వస్తువులనుంచి కాళ్లను దూరంగా ఉంచుకోవాలి.

పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్‌ రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత  పొడిగా మారేంతవరకు తుడుచుకోవాలి.

పాదాలను ప్రతినిత్యం పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే అవి పొడిబారే వరకు తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య పొడిగా ఉండటం కోసం పౌడర్‌ రాసుకోవాలి.

కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లు  కాలికి సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా అలాంటివి తొడగడం  సరికాదు.

కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, వారి  పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవాలి. లేదంటే అవే భవిష్యత్తులో పుండ్లుగా మారే అవకాశం లేకపోలేదు.

ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు (పురుషులు కూడా) స్లిప్పర్స్‌ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి.

మానని పుండ్లకు చికిత్స ఇలా... 
కాలిపైన పుండుగానీ లేదా చాలాకాలం వరకు మానని గాయం గానీ ఉంటే వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. ఇలా ఎంత త్వరగా డాక్టర్‌కు చూపిస్తే కాలిని కాపాడుకునే అవకాశాలు అంత ఎక్కువని గుర్తుంచుకోవాలి. యాంకిల్‌ బ్రేకిల్‌ ఇండెక్స్‌ పరీక్షలో కాలి నాడీ స్పందనల కొలత 0.5 కు లేదా అంతకంటే తగ్గుతున్నప్పుడు ‘సూపర్‌వైజ్‌డ్‌ ఎక్సర్‌సైజ్‌ థెరపీ’ కింది రోజుకు అరగంటకు తగ్గకుండా, అది కూడా వారంలో ఐదు రోజులకు తగ్గకుండా బ్రిస్క్‌వాకింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. 

దీనివల్ల యాంజియోగ్రామ్‌కు మించిన ఫలితం ఉంటుందని చాలా పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది ఇలా యాంకిల్‌ బ్రేకిల్‌ ఇండెక్స్‌ పరీక్షలో కొలత 0.5 కంటే తగ్గుతున్నవారిలో ప్రోటీన్‌తో కూడిన ఆహారాలూ, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్తప్రసరణ వేగం పెరగడం వల్ల కాలికి జరగాల్సిన నష్టం నివారితమవుతుంది 

కాలిలో రక్తప్రసరణ వేగాలు తగ్గుతున్నాయని గుర్తించిన తొలి దశల్లో రక్తాన్ని పలచబార్చేవీ, కాలిలో రక్తప్రసరణవేగాన్ని మెరుగుపరిచేవి కొన్ని రకాల మందులతో మున్ముందు రాబోయే కాలి తొలగింపు ముప్పును నివారించవచ్చు 

అత్యాధునిక టీసీపీఓటూ (క్యూటేనియస్‌ ఆక్సిజన్‌ మెజర్‌మెంట్‌) పరీక్షతో అతి సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్‌) ద్వారా కాలి కొనగోరు చివరల వరకూ ఆక్సిజన్‌ అందుతున్న తీరును పరిశీలించి ఒకవేళ అందక΄ోతే ఇవ్వాల్సిన చికిత్సను డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో రక్తం అందడం లేదు / పుండు పడి మానడం లేదని తెలిస్తే మొదట ‘యాంజియోగ్రామ్‌’ ప్రక్రియ ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచవచ్చు. 

అప్పటికీ రక్తప్రసరణ మెరుగుపడటక΄ోతే ‘బైపాస్‌’ వంటి కొన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అదీ కుదరకపోతే ‘వీనస్‌ ఆర్టీరియలైజేషన్‌’ ప్రక్రియ అనే మరో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది. అంటే  ఇందులో సిరలూ, ధమనులను కలిపి... కొనగోరు చివరి వరకూ రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తారు ∙గాయానికి చికిత్సను ఎంత త్వరగా అందిస్తే అది అంత త్వరగా మానుతుంది. పుండు మానకుండా మరింత ఆలస్యమయ్యేకొద్దీ అది గ్యాంగ్రీన్‌గా మారే అవకాశాలెక్కువ. ఇలా డాక్టరుకు గాయాన్ని చూపించడం ఆలస్యమైనవాళ్లలో డాక్టర్లు ‘స్టెమ్‌ సెల్‌ థెరపీ’ వంటి అత్యాధునిక ప్రక్రియలతో కాలిని కాపాడే అవకాశం ఉంది.
డాక్టర్‌ కార్తీక్‌ మిక్కినేని, సీనియర్‌ వాస్క్యులార్‌ సర్జన్‌ 

(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరన్‌ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement