
నేను ఐదు నెలల గర్భవతిని, వయసు ముప్పైఏడు. డాక్టర్ రక్తాన్ని పలుచగా చేసే మందులు ఆస్పిరిన్ టాబ్లెట్లు వాడమన్నారు. ఇవి బిడ్డకు సురక్షితమేనా? అలాగే ఈ వయస్సులో గర్భధారణలో సమస్యలు రాకుండా ఉండేందుకు నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
– సుజాత, విజయవాడ
మీ ఆందోళన సహజమే. ముప్పై ఐదు ఏళ్లకు పైబడిన గర్భిణులను మేము అధిక ప్రమాద గర్భిణులుగా పరిగణిస్తాం. ఎందుకంటే వయస్సు పెరిగేకొద్దీ తల్లి, శిశువుకు కొన్ని ప్రత్యేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు అడిగిన మందుల విషయం మొదట చెబుతాను. తక్కువ మోతాదులో ఇచ్చే ఆస్పిరిన్ టాబ్లెట్ చాలా సురక్షితం. ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది.
అలాగే గర్భధారణలో వచ్చే కొన్ని సమస్యలను తగ్గిస్తుంది. డాక్టర్ సూచించిన విధంగా తీసుకుంటే ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ మేలు చేస్తుంది. ఈ వయస్సులో గర్భధారణలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మొదటి మూడు నెలల్లో గర్భస్రావం వచ్చే అవకాశం పెరుగుతుంది. శిశువులో జన్యు సంబంధిత లోపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
గర్భధారణ సమయంలో రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు తల్లికి రావచ్చు. కొన్నిసార్లు సిజేరియన్ డెలివరీ అవసరం అవుతుంది. తల్లిలో ఉన్న ఆరోగ్య సమస్యల వలన శిశువు పెరుగుదలలో లోపం రావచ్చు, ముందుగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అలా పుడితే ప్రత్యేక శిశు సంరక్షణ అవసరం అవుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. క్రమం తప్పకుండా గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అప్ తప్పనిసరిగా చేయాలి.
అల్ట్రాసౌండ్ స్కాన్‌లు చేయించుకోవడం ద్వారా శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. అవసరమైతే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ సూచించే ఔషధాలను సమయానికి తీసుకోవాలి. ఈ వయస్సులో గర్భధారణ కొంత రిస్క్ ఉన్నప్పటికీ, భయపడాల్సిన పనిలేదు.
నా వయసు ఇరవైనాలుగు. ఇది నా రెండవ ప్రెగ్నెన్సీ, ప్రస్తుతం నాలుగో నెలలో ఉన్నాను. నా మొదటి కాన్పు, ముప్పై వారాల సమయంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగింది. ఈ గర్భధారణలో మళ్లీ అలాంటి సమస్య రాకుండా సర్జరీ చేయాలని డాక్టర్ సూచించారు. గర్భధారణ సమయంలో శస్త్రచికిత్స చేయించుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఇది నిజంగా అవసరమా? ఈసారి కూడా నాకు ముందుగా పుట్టిన బిడ్డ అవుతాడా? ఈ ప్రక్రియ తర్వాత నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
– వనజ, నర్సాపురం
మీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. గతంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగిన మహిళల్లో, మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము ముందుగానే జాగ్రత్తలు సూచిస్తాం. గర్భాశయానికి దిగువ భాగాన్ని ‘సర్విక్స్’ అంటారు. సాధారణంగా ఇది పొడవుగా, బిగుతుగా మూసి ఉండాలి. ప్రసవ సమయం దగ్గర పడే సరికి మాత్రమే ఇది చిన్నదవుతూ తెరుచుకోవాలి. కాని, కొంతమంది మహిళల్లో, ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా నెలలు నిండక ముందే బిడ్డ పుట్టిన అనుభవం ఉన్నవారిలో, ఇది గర్భధారణ పూర్తయ్యే లోపే చిన్నదై తెరుచుకోవడం ప్రారంభమవుతుంది.
దీనిని సర్వికల్ ఇన్సఫిషియెన్సీ అంటారు. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే, మళ్లీ ప్రీటర్మ్ డెలివరీ జరగవచ్చు. ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి సర్వికల్ లెంగ్త్ స్కాన్ అనే ఒక సాధారణ వజైనల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తాం. ఇందులో సర్విక్స్ పొడవు, బిగుతు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది తక్కువగా ఉంటే లేదా బలహీనంగా కనిపిస్తే, రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రొజెస్టెరోన్ మందులు ఇవ్వడం, రెండోది సర్విక్స్‌ను బిగుతుగా కట్టే చిన్న శస్త్రచికిత్స చేయడం.
ఇందులో సర్విక్స్‌ను ప్రత్యేకమైన దారంతో కట్టి, గర్భధారణ పూర్తయ్యేంత వరకు బిగుతుగా ఉంచుతాం. ఇది సురక్షితమైన పద్ధతి, అనేకమందికి మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ చికిత్స చేసిన తర్వాత మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వీలైనంత వరకు బెడ్‌రెస్ట్ తీసుకోవాలి, భారమైన పనులు చేయకూడదు, బరువులు అస్సలు ఎత్తకూడదు. లైంగిక చర్యలు నివారించాలి.
డాక్టర్ చెప్పినట్లుగా రెగ్యులర్‌గా ఫాలోఅప్ చేయాలి. తరచు స్కాన్‌లు చేయించుకోవాలి, బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నదీ లేనిదీ చూడాలి. ఈ విధంగా ముందుగానే చర్యలు తీసుకుంటే, గర్భధారణను సురక్షితంగా కొనసాగించే అవకాశం చాలా పెరుగుతుంది. నిజానికి ఈ శస్త్ర చికిత్స లేదా ప్రొజెస్టెరోన్ వాడకం తర్వాత చాలామంది మహిళలు ముప్పై ఏడు వారాలు లేదా అంతకన్నా ఎక్కువ వరకు గర్భధారణ కొనసాగించి, ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తున్నారు.
డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే..!)