ఎబోలా వైరస్‌ అవగాహన చాలు ఆందోళన వద్దు | Awareness of the Ebola virus | Sakshi
Sakshi News home page

ఎబోలా వైరస్‌ అవగాహన చాలు ఆందోళన వద్దు

Jun 4 2026 6:10 AM | Updated on Jun 4 2026 6:10 AM

Awareness of the Ebola virus

ఇటీవల ప్రపంచాన్ని భయపెడుతున్న వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌లో ఎబోలా వైరస్‌ కూడా ఒకటి. ఈ వ్యాధిగ్రస్తుల్లో మరణాల రేటు 25% నుంచి 90% వరకు ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఇది బెంబేలెత్తిస్తోంది. అదే ఇటీవల ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన కరోనా వైరస్‌ (కోవిడ్‌)లో మరణాల రేటు కేవలం 0.5% నుంచి 2% మాత్రమే. అయితే కోవిడ్‌లో మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రబలడంతో దాని మృతుల సంఖ్య ప్రపంచాన్ని నివ్వెరపరచింది. 

అలా కాకుండా ఎబోలా వైరస్‌  మాత్రం ఇప్పటికీ కేవలం ఆఫ్రికాలోని సబ్‌–సహారా దేశాల్లోనే వ్యాప్తిలో ఉంది. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఇటు తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌లోకి... చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశవిదేశాల ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో ఎబోలాపై ఆందోళన ముప్పిరిగొంటోంది. ఈ నేపథ్యంలో ‘ఎబోలా వైరస్‌ డిసీజ్‌’పై ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం.

ఇటీవలే ఎబోలా వైరస్‌ పీడిత దేశాల నుంచి 28 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆరోగ్య యంత్రాంగం విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించడమే కాకుండా... ఒకవేళ వారు ఎబోలా విస్తరిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చినట్టు గుర్తిస్తే... వెంటనే వారిని 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలించడానికి పూనుకుంటున్నారు. ఇది మినహా ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎబోలా తాలూకు ఎలాంటి కేసులూ లేవు. కాబట్టి దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అవగాహన పెంచుకోవడం అవసరమని గుర్తిస్తే చాలు. ఈ నేపథ్యంలో ఎబోలా అంటే ఏమిటి, అదెలా వ్యాపిస్తుంది, లక్షణాలేమిటి వంటి అంశాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం. 

ఏమిటీ ఎబోలా? 
ఎబోలా వైరల్‌ డిసీజ్‌ను మునుపు ‘ఎబోలా హీమరేజిక్‌ ఫీవర్‌’ అని పిలిచేవారు. ఒకరకంగా చూస్తే 25% నుంచి 90% ఫెటాలిటీ రేటుతో ఇది చాలాసార్లు ప్రాణాంతకంగా పరిణమించేదే. ఇందులో చాలా రకాల వైరల్‌ ప్రజాతులున్నాయి. ఇవి ఫైలోవిరిడే అనే కుటుంబానికి చెందిన వైరస్‌లు. ఈ రకం వైరస్‌లు ‘వైరల్‌ హీమరేజిక్‌ ఫీవర్‌’ అనే జ్వరాలకు కారణమవుతాయి. ఆ జ్వరాల్లో కలిగే తీవ్రమైన బాహ్య, అంతర్గత రక్తస్రావం వల్ల పరిస్థితి తీవ్రమవుతుంది. ఈ వైరస్‌ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. వ్యాధి తీవ్రమైనప్పుడు బాహ్య, అంతర్గత రక్తస్రావం, వ్యవస్థల వైఫల్యం (మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌)తో మరణం సంభవిస్తుంది. 

ప్రభుత్వాల ఆరోగ్య సంస్థల హెచ్చరికలు... 
ఎబోలా వైరస్‌ ఒక వ్యక్తి నుంచి మరొకరికి నేరుగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. భారతదేశంలో ఇప్పటివరకూ ఎబోలా వైరస్‌కు సంబంధించి ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. అయితే మన హైదరాబాద్, పొరుగున ఉన్న చెన్నై వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు, ఐసీఎమ్‌ఆర్‌ సంస్థలు... ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలు ఏర్పరచి ఆ మేరకు వాటిని అమలు చేస్తున్నాయి. 

ఎబోలా వైరస్‌ రకాలు... 
ఎబోలా వైరస్‌కు చెందిన ఆరు రకాల ప్రజాతులను గుర్తించారు.

వ్యాప్తి ఇలా... 
ఎబోలా వైరస్‌... కరోనా వైరస్‌లా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.  ఇది... బాధితుల రక్తంతో గానీ లేదా వారి శరీరద్రవాలను తాకడం వల్ల, వారికోసం ఉపయోగించిన (ఇన్ఫెక్టెడ్‌) వైద్యపరికరాలను తాకడం వల్ల, బాధితులతో లైంగికంగా కలవడం వల్ల వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి. 

ఇలా వ్యాప్తి చెందదు... 
బాధితుల పక్కనే కూర్చోవడం ∙వారు వదిలిన గాలిని పీల్చడం ∙వారితో కలిసి తినడం ∙దోమ కాటు వల్ల వ్యాప్తి చెందదు. బాధితుల ఫ్లుయిడ్స్‌తో కాంటాక్ట్‌లోకి రావడం మినహా మరే రకంగానూ ఇది వ్యాప్తి చెందే అవకాశం లేదు కాబట్టి దీని గురించి ఆందోళన పడనక్కర లేదు. 

నిర్ధారణ పరీక్షలు... 
ఎబోలా వ్యాధి తాలూకు మొదటి లక్షణాలు మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధి లక్షణాలతో పోలి ఉండటం వల్ల వెంటనే దీని నిర్ధారణ ఒకింత కష్టం. అయితే రెండో, మూడో దశల్లోని లక్షణాలతో పోల్చుకుని చూసుకోవడం వల్ల నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులకు పనికి వచ్చే అంశాలేమిటంటే... ∙గత 21 రోజుల వ్యవధిలో వ్యాప్తి చెందుతున్న ఆఫ్రికా దేశాల్లో ప్రయాణం చేసి ఉండటం, ఎబోలా వ్యాధి సోకినవారి అంత్యక్రియలకు హాజరు కావడం, వృత్తి సంబంధంగా ఏవైనా ప్రయోగశాలల సందర్శనతో పాటు... ∙ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ∙ఎలీజా పరీక్ష ∙వైరస్‌ కల్చర్‌ వంటి పరీక్షతో. ఇది వైరల్‌ జ్వరం కావడం వల్ల ప్రస్తుతానికి మందులేం అందుబాటులో లేవు. అయితే 2019లో ఆర్‌ వీఎస్‌వీ జెబోవ్‌ అనే వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇన్‌బాజెబ్, ఎబాంగా వంటి మందులతోనూ... అలాగే దేహం డీహైడ్రేట్‌ కాకుండా తగినన్ని ద్రవాలను ఇవ్వడం, సెలైన్‌ పెట్టడం, రక్తపోటు అదుపులో ఉండేలా చూడటం, అవసరమైతే ఆక్సిజన్‌ పెట్టడం, మంచి పోషకాహారాన్ని అందించడం. ఈ చికిత్సలతోపాటు వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల వచ్చే బ్యాక్టీరియల్, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించడం ద్వారా దీనివల్ల కలిగే అనర్థాలను తగ్గించడానికి తగిన చికిత్సలు అందిస్తూ బాధితులను కాపాడేందుకు చాలావరకు అవకాశాలున్నాయి. 

చివరిగా... 38 డిగ్రీల సెంటీగ్రేడ్‌ లేదా 100 ఫారెన్‌హీట్‌ కంటే ఎక్కువగా జ్వరం ఉండటంతోపాటు తలనొప్పి, వాంతులు లేదా విరేచనాలు, కళ్ల నుంచి పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలి. అయితే ఇప్పటివరకూ ఎబోలాకు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కానందున... ఈ ప్రాథమిక అవగాహనను పెంచుకోవడం మినహా ప్రస్తుతానికి దీని గురించి ఆందోళన అక్కర్లేదు.
 

లక్షణాలు... ఎబోలా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 2నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు కనిపించవచ్చు. లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే బాధితులను కాపాడుకోవడానికి అంతగా అవకాశముంటుంది. 
మొదటిది ప్రారంభ దశ... ఇందులో... 
∙ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం (హై ఫీవర్‌) ∙తీవ్రమైన అలసట (ఫెటీగ్‌) ∙తీవ్రమైన తలనొప్పి (సివియర్‌ హెడేక్‌) ∙కండరాల నొప్పులు (మజిల్‌ పెయిన్స్‌) ∙తీవ్రమైన గొంతు నొప్పి 

రెండో దశను మధ్యంతర దశగా చెప్పవచ్చు. ఇందులో... ∙వాంతులు ∙చాలా ఎక్కువగా విరేచనాలు కావడం ∙కడుపునొప్పి ∙కళ్లుఎర్రబడటం ∙చర్మంపై దద్దుర్లు ∙ఎక్కిళ్లు ∙ఛాతినొప్పి

మూడో దశలో లక్షణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో... ∙కళ్లు, ముక్కు చెవుల నుంచీ, దంతాల నుంచి రక్తస్రావం ∙కాలేయం, మూత్రపిండాల వైఫల్యం ∙తీవ్రమైన షాక్‌ ∙అయోమయం, ఫిట్స్‌ ∙తీవ్రమైన డీహైడ్రేషన్‌


డాక్టర్‌ బి. వెంకట్‌ నాని కుమార్‌
సీనియర్‌ కన్సల్టెంట్‌ఇంటర్నల్‌ మెడిసిన్‌ 


– యాసీన్‌

Advertisement
 
Advertisement
Advertisement