
సీటీ స్కాన్‌తో కచ్చితమైన కొలతలు
టైటానియంతో కృత్రిమంగా తయారీ
అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు
మేక్ ఇన్ ఇండియాతో దిగివస్తున్న ధరలు
సాక్షి, హైదరాబాద్: కింద పడి కాలో, చెయ్యో విరిగిందని ఆసుపత్రికి వెళితే పిండి కట్టు వేయడం చూశాం. దెబ్బవాపు తగ్గిన తరువాత పిండి కట్టు సరిగా సెట్ కాకపోతే ఎముక అటు ఇటుగా వంకరయ్యే సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విరిగిన ఎముకకు రాడ్లు పెట్టి స్క్రూలు బిగిస్తుంటారు. ఇవన్నీ పాత పద్ధతులు. ప్రస్తుతం 3డీ ఎముకలు (3D printing bones) అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడైనా ఎముక, కీళ్లు దెబ్బతింటే వాటిని తొలగించి కొత్త అవయవాన్ని రీప్లేస్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మోకీళ్లు, చీలమండ, తుంటి, వెన్నెముక, భుజం ఇలా ఏ స్థానంలోని ఎముక దెబ్బతిన్నా దాన్ని మార్చివేస్తున్నారు. ఫలితంగా చికిత్స అనంతరం రోగి అన్ని కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు.
35 ఏళ్ల నుంచే మొదలు
సాధారణంగా 35 ఏళ్ల నుంచే మహిళలలో కీళ్ల నొప్పులు మొదలైపోతున్నాయి. వాతావరణ పరిస్థితులు, జీవన విధానాలు దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ మందిలో కీళ్ల వాతం కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. చేతి వేళ్లు వంగకపోవడం, మోచేయి, మణికట్టు తిప్పినప్పుడు నొప్పి అనిపించడం, తుంటి, మోకాలు, పాదం, భుజం ఇలాంటి భాగాల్లో భరించలేని నొప్పులు వేధిస్తున్నాయి. వీటిని అధిగమిచేందుకు తాజాగా ఏ భాగమైనా డిస్క్ రీప్లేస్‌మెంట్ (disc replacement) ఆప్షన్ వచ్చేసింది.
గతంలో వైద్య పరికరాలు, కృత్రిమ అవయవాలు అమెరికా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దీంతో రవాణా, పన్నులు, ఇతరాలు కలిపి వైద్యం భారంగా మారేది. ప్రస్తుతం దేశీయంగా తయారు చేస్తుండటంతో తక్కువ ఖర్చులోనే మెరుగైన వైద్యం సాధ్యమైంది. చికిత్సల అనంతరం సాధారణ జీవితం కొనసాగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గతంలో రూ.2 లక్షలు అయ్యే చికిత్స ప్రస్తుతం సుమారుగా రూ.50 వేల నుంచి రూ.లక్షలో పూర్తవుతుంది.
సీటీస్కాన్ సాయంతో..
సహజసిద్ధమైన ఎముక స్థానంలో కృత్రిమంగా తయారు చేసిన అవయవాన్ని నిక్షిప్తం చేయాలంటే ఎంతో కచ్చితత్వం అవసరం. అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ముందుగా బాధితుడి ఎముక, కీళ్లు దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సిటీ స్కాన్ సాయంతో ఎంత మేరకు ఎముకను తొలగించాల్సి ఉంటుందనేది లెక్కిస్తారు. దీని ఆధారంగా 3డీ ప్రింటెడ్ టైటానియంతో తయారు చేసిన కృత్రిమ అవయవాన్ని ఆ స్థానంలో అమరుస్తారు. ఈ పరికరం వల్ల ఎంఆర్‌ఐ వంటి స్కానింగ్‌ల సందర్భంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యులు చెబుతున్నారు.
చదవండి: స్కూళ్లలో షుగర్ బోర్డులు.. ఎందుకో తెలుసా?
సాధారణ ప్రజలకు అందుబాటులో..
చికిత్స విధానాల్లో టెక్నాలజీ మారుతోంది. బోన్ ఫ్యాక్చర్ అయితే కట్టు కట్టేవాళ్లు. ఎముక అతుక్కోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా శరీరం వాపు తగ్గిపోవడంతో కట్టిన కట్టు లూజ్ అవుతుంది. కొన్ని దఫాలు ఎముకలు వంకర్లు తిరిగే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం విరిగిపోయిన, దెబ్బతిన్న, కుల్లిన ఎముకలు, కీళ్లను అవసరాల మేరకు ప్లేట్స్ స్క్రూ బిగించడం, 3డి ప్రింటెడ్ అవయవాలను మారుస్తున్నాం. డిస్క్ రీ ప్లేస్‌మెంట్ ఆప్సన్ వచ్చేసింది. టైటానియం వినియోగిస్తున్నాం. దీంతో సిటీస్కాన్, ఎమ్మారై చేసినా ఇబ్బంది ఉండదు. సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో ఉండే ధరల్లోనే చికిత్సలు పూర్తవుతున్నాయి.
– డా.సునీల్ దాచేపల్లి, ఆర్థోపెడిక్, రోబోటిక్ సర్జన్