మాయమవుతున్న పుర్రెలు, ఎముకలు
బూడిదను సైతం ఎత్తుకెళ్తున్న దుండగులు
చేగుంట వైకుంఠధామంలో వరుస ఘటనలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబీకులు
భయాందోళనలో జనం
శ్మశానవాటిక అంటేనే వెన్నులో వణుకుపుడుతోంది.. అటువైపు వెళ్లాలంటే జంకుతాం.. మరోవైపు శవాలను పీక్కుతినే రాబందుల గురించి విన్నాం.. కీచురాళ్లు.. శవాలను తింటాయని చదివాం.. కానీ శ్మశానంలో దొంగల బెడద ఉందంటే నమ్ముతారా? అక్కడ ఏముంటుంది కాలిపోయిన శవాల తాలూకు బూడిద తప్ప అని అంటారా? అదేనండి శవాల బూడిద, పుర్రెలు, ఎముకలను సైతం ఎత్తుకెళ్తున్నారు. ఇది ఎక్కడో కాదు.. చేగుంట మండల కేంద్రంలోని వైకుంఠధామంలో జరుగుతోంది. వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో మండలంలోనే కాదు.. జిల్లా అంతటా జనం భయాందోళనకు గురవుతున్నారు.
మెదక్‌జోన్: మెదక్ జిల్లా జాతీయ రహదారి పక్కనే చేగుంట మండల కేంద్రంలోని వైకుంఠధామంలో కాలుతున్న శవాల బూడిద, పుర్రెలు, ఎముకలను దుండగులు ఎత్తుకెళ్తున్నారు. గడిచిన 15 రోజుల్లో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. గ్రామానికి చెందిన కర్రె నాగమణి గత నెల 31న మృతి చెందగా అదేరోజున వైకుంఠధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆ మరుసటి రోజు ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు వెళ్లగా సగం కాలిన శవం ఉంది. నీళ్లతో మంటలను చల్లార్చి బూడిదను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అంతకు వారం రోజుల ముందే అదే గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మురాడి నర్సమ్మతో పాటు మరో వృద్ధుడు మల్లయ్య మూడు రోజుల వ్యవధిలో చనిపోగా అదే వైకుంఠదామంలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. వారిని దహనం చేసిన రోజు రాత్రి దుండగులు సగం కాలిన శవాలను పక్కకు లాగి అందులోని బూడిదతో పాటు తల(పుర్రె)ల ఎముకలను సైతం ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
భయ పడుతున్న జనం
శ్మశానం నుంచి సగం కాలిన శవాలను పక్కకు లాగేసి బూడిదతో పాటు పుర్రె ఎముకలను ఎత్తుకెళ్తుండటంతో ప్రజలు భయోందోళనకు గురవుతున్నారు. సహజంగా చనిపోయిన వ్యక్తి నోట్లో కాస్తబంగారం లేదా వెండిని పెట్టి దహనం చేయటం ఆచారం. దుండగులు ఆ బంగారం కోసం శవాలను చల్లార్చి బూడిదను ఎత్తుకెళ్తున్నారా? ఒకవేళ అదే అయితే శవాలు పూర్తిగా కాలిబూడిద అయ్యాక తీసుకెళ్లాలి. బూడిదతో పాటు పుర్రెలను ఎత్తు కెళ్లటంతో వాటితో క్షుద్రపూజలు చేస్తున్నారా? అంటూ ప్రజలు భయకంపితులవుతున్నారు. ఈ విషయాపై చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని, దుండగులను పట్టుకునే పనిలో ఉన్నామని చెప్పడం గమనార్హం.


