‘స్వచ్ఛ’ పాఠశాలలు!
● ఎస్‌హెచ్‌వీఆర్ కింద 8 స్కూళ్లు ఎంపిక ● త్వరలో రాష్ట్ర స్థాయి బృందం రాక ● రూ.లక్ష గ్రాంట్ ఇవ్వనున్న కేంద్ర సర్కార్
న్యాల్‌కల్(జహీరాబాద్): పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత కలిగిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించడానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎస్‌హెచ్‌వీఆర్ (స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్) పేరుతో ప్రతియేటా జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాలు అందిస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాదికి గాను జిల్లాలో ఎనిమిది పాఠశాలలు ఎంపికయ్యాయి.
ఎనిమిది పాఠశాలల ఎంపిక
జిల్లాలో 864 ప్రాథమిక, 187 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలలు, 22 కేజీబీవీలు, 10 మోడల్ పాఠశాలలు ఉన్నాయి. అలాగే 109 గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, 500 వరకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వాటిలో తాగునీరు, మరుదొడ్ల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా అమలు చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం రేటింగ్ ఇచ్చింది. పాఠశాలల పరిస్థితుల వివరాలను హెచ్‌ఎంలు యూడైస్ లాగిన్‌తో ఎస్‌హెచ్‌వీఆర్‌లో సెప్టెంబర్‌లోనే నమోదు చేశారు.


