హోర్డింగ్‌ల దందా!
ఎక్కడ చూసినా అవే దర్శనం
● ప్రమాదాలకు ఆస్కారం ● ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం ● పట్టించుకోని అధికారులు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): జీహెచ్‌ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలలో అక్రమ హోర్డింగ్‌ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నగర శివారు ప్రాంతాలైన తెల్లాపూర్, ముత్తంగి, అమీన్‌పూర్ డివిజన్‌లలో పురోగతి దిశగా సాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాలలో రియల్ వ్యాపారంతో పాటు అనేక వాణిజ్య సంస్థల హోర్డింగ్‌లకు మంచి డిమాండ్ వచ్చింది. రోడ్లు, ఇళ్లపై ఇష్టానుసారంగా హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై గతంలో కొందరు మంత్రులకు సైతం ఫిర్యాదు చేశారు. రోడ్డ మధ్యలో చిన్నపాటి ప్రకటన బోర్డులను దర్జాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వందల సంఖ్యలో ఉన్నాయని అధికారులే చెబుతున్నా.. వీటిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ హోర్డింగ్‌ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతోంది. ప్రతి ఏటా లక్షలాది రూపాయల ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది.
అధికారుల అండదండలు
అక్రమ హోర్డ్‌ంగ్‌ల ఏర్పాటు దారులకు స్థానిక అధికారుల అండదండాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం రేడియల్ రోడ్డు డివైడర్‌పై అనేక ప్రకటన బోర్డులను ఏర్పాటు చేశారు. వాటిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు నామమాత్రం తొలగించి చేతులు దులుపుకొన్నారు. మిగిలిన వాటి జోలికి వెళ్లకపోవడంతో అనేక అనుమానాలకు దారితీస్తుంది. వీటిపై విజిలైన్స్ అధికారులతో విచారణ చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమాలే కాని చర్యలేవి..?
గత ప్రభుత్వం హోర్డింగ్‌లకు సంబంధించిన అనుమతులను పునరుద్ధరణ చేయవద్దని ఆదేశించింది. కానీ చూస్తుండగానే అనేక కొత్త హోర్డింగ్‌లు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ అక్రమాలే అని అధికారులే చెబుతున్నా..చర్యలు మాత్రం తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. కాగా, రోడ్డు మధ్యలో, పక్కలో ఏర్పాటు చేసే హోర్డింగ్‌లపై ఉండే ప్లేక్స్‌లు ప్రమాదకారంగా మారుతున్నాయి. ఈదురుగాలులు వీచినప్పుడు అవి చినిగి విద్యుత్ తీగలపై పడుతున్నాయి. పలు సందర్భాలలో రోడ్లపై పడిన దాఖలాలు ఉన్నాయి.
హోర్డింగ్‌ల దందా!


