పుట్టింది ఆడపిల్లగా.. పెరిగింది మగవాడిలా
కొడుకుగా పెంచి సంబురపడిన తల్లిదండ్రులు
ఎవరిదీ పాపం.. ఎందుకీ శాపం?
జీవన పోరాటంలో ఒంటరై..
మగ సంతానం కోసం పరితపిస్తూ... ఆరుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు ఆ తల్లిదండ్రులు. వారి ఆశలు ఆవిరి కాగా ఐదో అమ్మాయికి చిన్నప్పటి నుంచి పురుషుడి బట్టలు వేసి, కట్టింగ్ చేయించి, బాబులా పెంచి మురిసిపోయారు. కానీ పెరుగుతున్న కొద్దీ ఆమెలో అమ్మాయి లక్షణాలు కనుమరుగయ్యాయి. మగ పిల్లలతో సావాసం..ఆటపాటలు ఆమెను అబ్బాయిగా తీర్చిదిద్దాయి. చేసిన తప్పును గుర్తించిన తల్లిదండ్రులు ‘చేతులు కాలాక..ఆకులు పట్టుకున్నట్లు’ వయస్సు వచ్చాక దేవుని గుడిలోని ‘కత్తి’తో పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో తానేమిటో అర్థం కాక ఒంటరిగా.‘.ప్రేమ్’ పేరుతో నిర్జీవమైన బతుకు వెళ్లదీస్తోంది ‘ప్రమీల’. వైజ్ఞానిక ప్రపంచంలో కూడా ‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడు కొడుకే’ అనే భావన ఇంకా వీడటం లేదు అనడానికి సజీవ సాక్ష్యంపై ఈ వారం కథనం.
కొడుకు కోసం పరితపిస్తూ...
రాణీ శంకరమ్మ ఏలిన మెదక్ జిల్లాలోని పాపన్నపేట సంస్థానానికి మదిర గ్రామం మదిరె కొత్తపల్లి. గ్రామానికి చెందిన లచ్చమ్మ, పెంటయ్య దంపతులు తమకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసేవారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మొదట కూతురు జన్మించింది. రెండోసారి కొడుకు పుడుతాడన్న ఆశతో మరోసారి గర్భం దాల్చింది లచ్చమ్మ. కానీ ఈ సారి ఆడపిల్లే జన్మించింది. ఇలా కొడుకు మీద మమకారంతో వరుసగా ఆరు కాన్పులకు సిద్ధమయ్యారు ఆ దంపతులు. కానీ అందరూ ఆడపిల్లలే జన్మించారు. మగ పిల్లాడిపై ఇష్టంతో ఐదో కూతురు ప్రమీలను అబ్బాయి లాగ పెంచారు. చక్కగా క్రాప్ చేయించి, నెక్కర్..షర్ట్ తొడిగి మగ పిల్లాడిలా అలంకరించి, బడికి పంపి, అబ్బాయిల సరసనే కూర్చుండ బెట్టారు. అభం శుభం తెలియని ప్రమీలను ..తోటి వారు ప్రేమ్‌గా పిలవడం మొదలు పెట్టారు. ఇలా ప్రాథమిక విద్యాభ్యాసం మదిర కొత్తపల్లిలో, 4వ తరగతి నుంచి 5 వరకు పాపన్నపేటలో కొనసాగింది. ఉన్నత పాఠశాలకు రావాల్సిన ప్రమీల బడిలో ఎదురవుతున్న సమస్యలతో చదువుకు గుడ్‌బై చెప్పింది.
కత్తితో పెళ్లి
చిన్న చెల్లెలు సుమిత్ర పెళ్లిలో, తల్లిదండ్రులు ప్రమీలకు దేవుని గుడిలోని కత్తితో పెళ్లి చేశారు. ఇంట్లో 5 మంది తోబుట్టువుల పెళ్లి జరిగింది. పెద్దక్క దుర్గమ్మను ఇళ్లరికం తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రమీలకు 13గుంటల భూమి వచ్చింది. ఆ భూమిలో వచ్చే పంటతో జీవనం గడవని పరిస్థితి. దీంతో కూలీ పనులకు వెళ్తూ..ట్రాక్టర్ , పిండి మర నడుపుతూ, చేపలు పడుతూ, గేదెలు కాస్తూ బతుకు బండి లాగుతుంది. ఒక్కోసారి ఏ పని దొరకకపోతే పస్తులు ఉంటుంది.
ఆటలాడుతూ..
పదేళ్ల వయస్సు నుంచి ప్రమీల కాస్తా పూర్తిగా ప్రేమ్‌గా మారింది. మగ పిల్లలతో కలిసి కబడ్డీ, ఖోఖో, చిర్రగోనే, చెట్లు ఎక్కడం, ఈత కొట్టడం లాంటి ఆటలు ఆడేది. నాగలి దున్నడం, నాటు వేయడం, కలుపు తీయడం, పంటకోయడం, వరి కొట్టడం, పార పని చేయడం, లాంటి చెమటోడ్చే పనులు చేస్తూ, జీవనం కొనసాగిస్తూ వచి్చంది. స్నేహితులతో కలిసి బైక్, ట్రాక్టర్ నడపడం అలవాటు అయ్యింది.
ఆడపిల్లననే విషయమే మరిచిపోయా
అమ్మానాన్న మగ పిల్లాడి లాగా పెంచడంతో ఆడ పిల్లననే విషయాన్ని మరిచిపోయా. నాలో ఆడపిల్ల లక్షణాలు లేవు. నాకు ఉన్నదంతా మగ స్నేహితులే. ప్రాణ స్నేహితుడు మా పెద్దనాన్న కొడుకు లక్ష్మణ్ చనిపోవడం నన్ను కలచి వేసింది. మగ స్నేహితులు ఎప్పుడు నన్ను ఆడపిల్లగా చూడలేదు. వేధింపులకు గురి చేయలేదు. నన్ను ఇలా మార్చిన అమ్మానాన్నపై కోపం లేదు. నేను వస్తుంటే మా పటేల్ వస్తుండు అని అమ్మ గర్వంగా ఫీలయ్యేది. కానీ, తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరి జీవితం ఎలా... భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న బెంగ నన్ను కుంగదీస్తుంది. పని దొరకని నాడు పస్తులుండాల్సి ఉంటున్న. చేత కాని సమయంలో నాకు అండగా ఎవరు ఉంటారనే ఆందోళన వెంటాడుతుంది. పాఠశాలలో , అంగన్‌వాడీలో గాని ఏదైనా అటెండర్ పని ఇప్పించి ఆదుకోవాలి.
– ప్రమీల (అలియాస్ ప్రేమ్)
మానసిక ఆలోచనలు ప్రభావం చూపుతాయి
మధ్యలో లింగత్వ మార్పుపై మానసిక ఆలోచనలు 50 శాతం వరకు ప్రభావం చూపొచ్చు. కానీ పూర్తి మార్పుకు అదొక్కటే కారణం కాకపోవచ్చు. కచ్చితమైన కారణం తెలియాలంటే æకార్యో టైపింగ్ టెస్ట్ చేయించాలి. ట్రాన్స్ మారి్పడిని సామాజిక వాతావరణం, పెరిగిన నేపథ్యం, స్నేహ సమూహాలు ప్రభావితం చేస్తాయి. మగ పిల్లలు లేరన్న కారణంతో వారిని మగ పిల్లాడిలా పెంచడం సరికాదు. – డాక్టర్ దీక్ష, పీహెచ్‌సీ, పొడిచన్‌పల్లి


