గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
అగ్నికి ఆహుతైన పరుపుల తయారీ సామగ్రి సురక్షితంగా బయటపడిన నలుగురు కార్మికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది అనుమతి లేకుండా నిర్మించిన గోదాం
పటాన్‌చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో పరుపులు తయారు చేస్తున్న గోదాంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక జిల్లా అధికారి నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్నాపూర్‌లోని తేజ కాలనీ సమీపంలో అనుమతులు లేకుండా పరుపుల తయారీ గోదాం నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న పరుపులు, తయారీ సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న పటాన్‌చెరు అగ్ని మాపక శాఖ సిబ్బంది, పాశమైలారం పారిశ్రామిక వాడకు చెందిన రెండు అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు కార్మికులు ఉండగా.. ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించవద్దని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు హెచ్చరించారు. అయితే ఈ తయారీ కేంద్రానికి ఎటువంటి అనుమతి లేదని ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్ రావు తెలిపారు.


