● రూ.14 కోట్ల సూక్ష్మసేద్య నిధులు వెనక్కి! ● నిధులను పూర్తిగా వాడలేకపోయిన జిల్లా ఉద్యానవనశాఖ ● డ్రిప్ యూనిట్ల మంజూరుకు నిన్నటితో ముగిసిన గడువు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: బిందుసేద్య పథకం (డ్రిప్ ఇరిగేషన్) అమలు కోసం జిల్లాకు వచ్చిన సబ్సిడీ నిధులను ఉద్యానవనశాఖ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతోంది. సుమారు వెయ్యి ఎకరాలకు సంబంధించిన నిధులు సుమారు రూ.14 కోట్లు వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. తక్కువ సాగునీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులకు డ్రిప్ (బిందుసేద్యం) పరికరాలను భారీ సబ్సిడీపై అందిస్తోంది. ఈ ఆర్థిక ఏడాది (2025–26)లో జిల్లాలో 9,665 ఎకరాల్లో డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన యూనిట్లను మంజూరు చేసింది. అయితే ఇప్పటివరకు (మంగళవారం నాటికి) 8,276 ఎకరాలకు సంబంధించిన డ్రిప్ పరికరాలు మాత్రమే రైతులకు సరఫరా అయ్యాయి. మిగిలిన సుమారు 1,388 ఎకరాలకు సంబంధించిన డ్రిప్ పరికరాలను సరఫరా చేయలేకపోయింది. ఈ పథకం యూనిట్ల మంజూరుకు గడువు మంగళవారం రాత్రి 12 గంటలతో ముగిసింది. దీంతో సుమారు 1,200 వందల ఎకరాల డ్రిప్ పరికరాలకు సంబంధించి సుమారు రూ.14.40 కోట్ల సబ్సిడీ నిధులు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీ
ఈ పథకం కింద రైతులకు ఎకరాకు రూ.1.20 లక్షలు యూనిట్ వ్యయంగా ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 100% సబ్సిడీ ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు 90% సబ్సిడీ ఉంటే..పదిశాతం రైతు భరించాల్సి ఉంటుంది. అలాగే ఇతర రైతులకు 80% సబ్సిడీ ఇస్తుంది. 20% రైతులు భరించాలి. గరిష్టంగా 12 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలు మంజూరు చేస్తారు. ఈ డ్రిప్ పరికరాలను జిల్లాలో అత్యధికంగా చెరుకు రైతులు వినియోగించుకుంటున్నారు. సుమారు 60 శాతం మంది చెరుకు రైతులే వీటికోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. కూరగాయలు సాగు చేసే రైతులు, పండ్లతోటలు పండించే రైతులు కూడా ఈ డ్రిప్ పరికరాలను తీసుకుంటారు. కాగా, ఈ పరికరాలపై జీఎస్టీ పన్ను రైతులకు భారంగా ఉండేది. గతంలో 12% జీఎస్టీ వసూలు చేసేవారు. అయితే జీఎస్టీ పన్ను రేటును 5% తగ్గించారు. దీంతో జీఎస్టీ నుంచి రైతులకు కొంత ఉపశమనం లభించినట్లయింది.
మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు
ఈ పథకం కింద డ్రిప్ పరికరాలు పొందాలంటే రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న రైతులు యూనిట్ వ్యయంలో రైతు భరించాల్సిన మొత్తాన్ని డీడీలతో ఉద్యానవనశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును పరిశీలించి అధికారులు ఈ డ్రిప్ యూనిట్లను మంజూరు చేస్తారు. ఈ సూక్ష్మసేద్య పరికరాల పథకం అమలులో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో ఉందని జిల్లా ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఈ యూనిట్లు వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయన్నారు.


