మైనార్టీలను విస్మరించిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

మైనార్టీలను విస్మరించిన ప్రభుత్వం

Mar 11 2026 8:39 AM | Updated on Mar 11 2026 8:39 AM

● మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శ ● యుద్ధంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన

● మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శ ● యుద్ధంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మైనార్టీల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డిలో జరిగిన ఇఫ్తార్‌విందులో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ హాయాంలో మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. రంజాన్‌తోఫా, షాదీముబారక్‌ వంటి పథకాలతోపాటు, మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించారన్నారు.

యుద్ధం బాధ కలిగిస్తోంది

పవిత్ర రంజాన్‌ మాసంలో ఇరాన్‌, ఇజ్రాయెల్‌–అమెరికా యుద్ధం కారణంగా సామాన్యులు అనేకమంది చనిపోతుండటం కలచివేస్తోందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్‌ దేశాల్లోని ప్రజలతోపాటు, అక్కడున్న భారతీయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యుద్ధ ప్రభావం అన్ని దేశాలపై పడుతోందని, భారత్‌లో పెట్రో ఉత్పత్తులు, వంటగ్యాస్‌ కొరత ఏర్పడుతోందని చెప్పారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అల్లా దయతో యుద్ధం త్వరగా ఆగిపోవాలని కోరుకుందామన్నారు. కార్యక్రమంలో డీసీఎంస్‌ మాజీ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్‌ శ్రీహరి, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement