కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, అధికారులతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎం సేతు ప్రాజెక్టుపై, వివిధ శాఖల అధికారులతో విద్యారంగ అభివృద్ధిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఐటీఐ కేంద్రాలను బలోపేతం చేసి ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు కింద ఐదు ఐటీఐలను హబ్ అండ్ స్పోక్స్ విధానంలో అభివృద్ధి చేసి పరిశ్రమల సహకారంతో ఐదేళ్లపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధునిక యంత్రాలు, మౌలిక వసతులు, శిక్షణ సామగ్రి ఏర్పాటు చేసి ఐటీఐలను ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు.
మౌలిక వసతులకు ప్రణాళికలు చేయాలి
జిల్లాలోని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మహిళా డిగ్రీ కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ రాజా, ఐటీఐ ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి, కన్సల్టెంట్ శ్రీనివాస్ రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీపీఓ బాలశౌరి, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత తదితరులు పాల్గొన్నారు.


