పెరుగుతున్న పసిడి ధరలే
కారణమా?
జోగిపేట(అందోల్): మహిళల అలంకరణల్లోనూ, వివాహ కట్నకానుకల్లోనూ బంగారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వివాహ వేడుకంటే వధూవరులకు స్వర్ణాభరణాలు కానుకగా ఇవ్వడం ఆయా కుటుంబాల బాధ్యతగా భావించేవారు. అయితే ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆ సంప్రదాయం క్రమంగా కనుమరుగవుతోంది. ఇప్పుడు కట్నకానుకల్లో బంగారం స్థానంలో భూమి వచ్చి చేరింది. వివాహాల్లో కట్నకానుకగా బంగారం బదులు భూమిని ఇస్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది.
కొన్నేళ్లుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మధ్యతరగతి ప్రజానీకం ఆభరణాలు చేయించుకోవడం కష్టంగా మారింది. దీంతో పెళ్లిళ్లలో ఎక్కువగా భూమిని కట్నంగా ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా పట్టణాల పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసి కట్నకానుకలుగా ఇవ్వడం సాధారణమవుతోంది. ముందుగా కట్న కానుకలు కుదిరిన తర్వాతే పెళ్లి సంబంధాలు ఓకే అయిన సందర్భాలున్నాయి. పెళ్లికి ఎంత నగదు కట్నంగా ఇస్తున్నారు? బంగారం ఎన్ని తులాలు? వరుడికి బైకు, కారుతోపాటు ఆడపడుచు కట్నం కింద ఇంత అన్నట్లు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. ఆడపడుచు కట్నం కింద 10 గుంటలు, 20 గుంటలు, ఎకరా భూమి, 200 గజాల ప్లాట్, పుస్తెలతాడు, మెట్టెలు ఇస్తామని కట్న కానుకలు మాట్లాడుకుంటున్నారే తప్ప బంగారు ఆభరణాల జోలికి మాత్రం వెళ్లడంలేదు.
వివాహ కట్నకానుకల్లో
మారుతున్న ట్రెండ్


