పూసింది పూత.. నిలబడేనా కాత!
వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోతున్న రైతులు
● యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు ● ఉద్యానశాఖ డీడీ సోమేశ్వర్‌రావు
జహీరాబాద్ టౌన్: మామిడి రైతులు తరచూ నష్టాలు చవిచూస్తున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడులపై ప్రభావం చూపుతోంది. మామిడితోటలో వాతావరణ పరిస్థితులు కీలకపాత్ర పోషిస్తాయి. పూత ఆలస్యంగా రావడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆలస్యంగా పూత పూసింది. మామిడికాయలు చేతికి వచ్చే సమయానికి పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల పూత రావడంతోపాటు అధిక దిగుబడులు పొందవచ్చని ఉద్యానశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్‌రావు చెబుతున్నారు.
యాజమాన్య పద్ధతులు
ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మామిడిలో యాజమాన్య చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులు వస్తాయి. మూడు నెలల పాటు యూరియా, పొటాష్, బోరాన్ ఎరువులు వినియోగించాలి. మందులు ఒకేసారి కాకుండా పలు దఫాలుగా వేయాలి. పదేళ్లు పైబడిన చెట్లకు 700 గ్రాముల డీఏపీ, 400 గ్రాముల యూరియా, 600 గ్రాముల ఎంవోపీ మందును కలిపి వేసి క్రమం తప్పకుండా నీటి తడులు పెట్టాలి.
పిందె దశలో జాగ్రత్తలు తీసుకోవాలి
పిందె దశలో ఎక్కువగా రాలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మామిడి పిందెలు బఠాణి నుంచి నిమ్మకాయ సైజుల మధ్య ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. ఫలదీకరణ చెందని పుష్పాలు రాలిపోతాయి. నీటి ఎద్దడి అధిక తేమ, హార్మోన్ల లోపం తదితర కారణాల వల్ల పిందె దశలో తెగుళ్లు అధిక నష్టం కలిగిస్తాయి. తేనెమంచు పురుగు, మసి మంగు, పక్షికన్ను, మచ్చతెగులు, బూడిద తెగులు ఆశిస్తాయి.
జహీరాబాద్, పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో...
జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరువు తదితర ప్రాంతాల్లో అధికశాతం మామిడి తోటలున్నాయి. మామిడిలో సాధారణంగా డిసెంబర్ నుంచి జనవరి నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో పూత రావడానికి సమయం పడుతుంది. నవంబర్‌లో పూత వస్తే కాత నిలబడుతుంది. పూత రావడానికి పొటా షియం నైట్రేట్ 10 గ్రాములు, 5 గ్రాముల యూరియా లీటరు నీటిలో కలిపి చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. పొటాషియం నైట్రేట్ ఆకులపై నేరుగా పిచికారీ చేయడం వల్ల త్వరగా ఆహార పదార్థాలుగా మార్చుకుని పూ మొగ్గలకు తొందరగా చేర వేసి పూత రావడానికి దోహదపడుతుంది. పూత రావడం మొదలైన వెంటనే ఫ్లానోఫిక్స్ 2.6 మి.లీ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కొమ్మకు వేల సంఖ్యలో పుష్పాలు వచ్చినా చివరకు ఐదారే పిందెలు కడతాయి. 5 నుంచి 6 వరకు పిందెలలో ఆఖరున ఒకటి నుంచి రెండు పిందెలు మాత్రమే ఎదిగి కాయలుగా మారుతాయి.


