పొంతన లేని ఓట్ల జాబితా
ఎన్నికల ఖర్చు భరించలేని పరిస్ధితి అన్ని వార్డుల్లో ఓట్ల సమానంగా ఉండాలి వార్డుల సంఖ్యను పెంచాలని డిమాండ్
హుస్నాబాద్: మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో పొంతలేని అధిక ఓటర్ల సంఖ్యతో బెంబేలెత్తుతున్నారు. వార్డు వార్డుకు వందలాది ఓటర్లు తేడా ఉండటాన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్న వార్డుల్లో ఎన్నికల ఖర్చును భరించలేని పరిస్ధితి. హుస్నాబాద్ మున్సిపాలిటిలో 20 వార్డులకు గాను 19,227 ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ నెల 10న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేయకుండా, కొన్ని వార్డుల్లో ఎక్కువ, మరికొన్ని వార్డుల్లో తక్కువ ఓటర్లతో జాబితాను తయారు చేశారు. పట్టణంలోని 16వ వార్డులో 608 ఓట్లు, 4వ వార్డులో 1304 ఓట్లు ఉన్నాయి. దాదాపు 700 ఓట్లు తేడా ఉంది. ఇలా చాలా వార్డుల్లో హెచ్చు, తగ్గులతో ఓటరు జాబితాను తయారు చేశారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో ఓటరు జాబితా పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొన్ని వార్డుల్లో ఎక్కువ , మరి కొన్ని వార్డుల్లో తక్కువ ఓట్లు కాకుండా అన్ని వార్డుల్లో ఓటర్లు సమానంగా ఉండేలా జాబితాను తయారు చేయాలని సూచనలు చేశారు. ఒక వార్డులో కనీసం 800 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీలుకాని పరిస్ధితితుల్లో అదనంగా మరో రెండు వార్డులు పెంచాలని కోరారు.
మోయలేని ఆర్ధిక భారం
అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న వార్డుల్లో పోటీ చేసే అభ్యర్దులకు ఎన్నికల ఖర్చు మోయలేని భారం పడుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 50 నుంచి 100 వరకు తేడా ఉన్నా ఎలాగోలా నెట్టుకురావొచ్చు. వందల కొద్ది ఓట్ల తేడాతో అభ్యర్ధులకు తలకు మించిన భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చి ఎక్కువ ఓట్లు ఉన్న వార్డులో పోటీ చేసే వారికి ఎన్నికల ఖర్చుతో పాటు ఓటర్లను కలుసుకునేందుకు సమయం ఎక్కువ పడుతుంది. ప్రస్తుతం ఎక్కువ ఓటర్లు ఉన్న వార్డులో ఇల్లు ఒక వార్డులో, ఓటు మరో వార్డులో ఉన్నాయి. దీంతో ఓటర్ల అడ్రస్‌ను తెలుసుకోవాలంటే శక్తికి మించిన భారం అవుతుంది. మున్సిపల్ అధికారులు అన్ని వార్డుల్లో ఓటర్లు సమానంగా ఉండేలా జాబితాను తయారు చేయాలని రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు. అలాగే 20 వార్డులకు గాను 18 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్ని వార్డులు ఉంటే అన్ని పోలింగ్ స్టేషన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకొని జాబితాను తయారు చేస్తారా లేదా అనేది వేచిచూడాల్సిందే.
వార్డు, వార్డుకు వందలాది ఓటర్ల తేడా


