ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి వంశీ
తనను కొట్టి గొంతు నులిపాడని ఆరోపించిన భార్య
రామాయంపేట(మెదక్): అమ్మో..నేను డాడీ దగ్గరకు వెళ్లను.. కొడతాడు అని ఆ చిన్నారి హడలిపోతున్నాడు. మారు తండ్రి చేతిలో చావు దెబ్బలు తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి వంశీ (3) మాటలు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించాయి. మండలంలోని అక్కన్నపేట గ్రామంలో మద్యం మత్తులో చిన్నారిని విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చిన ముత్యం సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కాగా మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాబు తన తండ్రి పేరు ఎత్తితేనే భయకంపితుడవుతున్నాడు. నేను మళ్లీ డాడి దగ్గరికి పోనని, వైరుతో కొడతాడని, కాళ్లతో తంతాడని చెబుతున్నాడు. పోలీసులు, పలు శాఖల అధికారులు శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరామర్శించారు. కాగా అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సత్యనారాయణ భార్యను ఇంట్లో ఉండగా, బాబును టాయిలెట్‌కు తీసుకెళ్తున్నానని చెప్పి బయటినుంచి తలుపుల గొళ్లెం పెట్టాడు.
అనంతరం బాబును వైరుతో గంటపాటు ఆగకుండా తీవ్రంగా కొట్టాడు. కాగా, అలిసిపోయి తలుపులు తీసి విలపిస్తున్న తనను కొట్టి గొంతు పిసికాడని భార్య శ్వేత తెలిపింది. ప్రస్తుతం ఆమె కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వంశీ కంటే చిన్నదైన తన కూతురును సైతం భర్త చంపాడని ఆమె ఆరోపించింది. ఏడాది క్రితం ఆమెకు జ్వరం రాగా, ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి గంట తరువాత ఆమె మృతదేహంతో వచ్చాడని చెప్పింది. అప్పుడు భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని శ్వేత విలపించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సత్యనారాయణను కఠినంగా శిక్షించాలని అక్కన్నపేట గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.


