పుర పోరుకు కసరత్తు
షెడ్యూల్ ఇలా..
ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్
మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు
మెదక్ 32 37,045
నర్సాపూర్ 15 16,531
తూప్రాన్ 16 19,222
రామాయంపేట 12 13,112
రామాయంపేట(మెదక్): పుర పోరుకు ప్రభుత్వం సమాయత్తమైంది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి గాను ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో అధికారులు సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎపుడొచ్చినా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు మంగళవారం ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వారీగా ఒటరు జాబితా తయారీ ప్రక్రియ చేపట్టాలని ఉత్వర్వులు జారీ అయ్యాయి. జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 75 వార్డులకు గాను మొత్తం 85,910 ఓటర్లు ఉన్నారు. ఈమేరకు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
దృష్టి సారించిన పార్టీలు
ఫిబ్రవరిలో పుర ఎన్నికలు జరుగుతాయనే సమాచారంతో ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తరఫున పోటీ చేయడానికి గాను చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అధికార కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి చాలా మంది ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సహకారంతో ఈసారి ఎలాగైనా పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన వారు అధిక సంఖ్యలో గెలుపొందడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్నారు.
11 నెలలుగా ప్రత్యేక పాలన
మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు జనవరి 25తో ముగిసింది. దీంతో గత 11 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. 2020 జనవరి 22న మన్సిపల్ ఎన్నికలు జరగగా, 25న ఫలితాలు వెల్లడయ్యాయి. 28న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 27న ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయి.
డిసెంబర్ 30న పోలింగ్ కేంద్రాల పునర్‌వ్యవస్ధీకరణ
31న వార్డుల వారీగా విభజన
జనవరి 1న వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా జాబితా తయారీ
అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం నోటీస్ బోర్డులో ప్రదర్శన
5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం.
6న జిల్లా స్థాయిలో సమావేశం
10న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రకటన
జనవరి 10న తుది జాబితా ప్రకటన
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!


