వెల్దుర్తి(తూప్రాన్): భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ (32)కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన పూజతో సుమారు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. వివాహం అయినప్పటినుంచి వేరుకాపురం పెట్టాలని భార్య, అత్తమామలు ఒత్తిడి తెచ్చారు.
ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు కావడంతో తరచూ కూతురును తీసుకొని పూజ తన పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలోనే ఈ నెల 2న పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా అందరి సమక్షంలోనే తన కుమారుడిని దుర్భాషలాడి, పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని రెచ్చగొట్టారని ఆరోపించారు. పంచాయితీ అనంతరం పూజ కూతురుతో వెల్దుర్తిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది.
ఈ క్రమంలో హరిప్రసాద్ ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తారింటిముందు పురుగులమందు తాగా డు. చుట్టుపక్కల వారి సాయంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. తన కుమారుడి మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్‌లతో పాటు బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కారణమంటూ మృతుడి తండ్రి మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ట్రెయినీ ఎస్‌ఐ తెలిపారు.


