బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా? ఇదిగో డాక్టర్ల క్లారిటీ..!

1 In 3 Indians Believe Beer Consumption Treat Kidney Stones Survey - Sakshi

కిడ్నీలో రాళ్లు ఏర్పడే కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. కిడ్నీ పనితీరు, కిడ్నీ రోగాల బారినపడితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం(మార్చి 9) సందర్భంగా ప్రిస్టిన్ హెల్త్ కేర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని ప్రతి ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అయితే ఇందులో అసలు వాస్తవం లేదని, కేవలం కల్పితమేనని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య చికిత్సను  50 శాతం మంది కావాలనే 6 నెలలు ఆలస్యం చేస్తున్నారు. దాన్ని కాస్తా రెండేళ్లకు పొడిగిస్తున్నారు.

కిడ్నీ రోగాలకు సంబంధించి అధికారికంగా జాతీయ గణాంకాలు లేకపోయినప్పటికీ కేసుల్లో గణనీయ పెరుగుదల కన్పిస్తున్నట్లు లైబ్రేట్ ఆన్‍లైన్ అపాయింట్‌మెంట్స్‌  డేటా స్పష్టం చేసింది. దీని ప్రకారం 2021తో పోల్చితే 2022 కిడ్నీ రోగాలకు సంబంధించి డాక్టర్ అపాయింట్‌మెంట్లు ఏకంగా 180 శాతం పెరిగాయి. వీరిలో ఎక్కువమందికి కిడ్నీలో రాళ్ల సమస్యే ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో మహిళలతో పోల్చితే పురుషులే మూడు రెట్లు అధికంగా ఉన్నారు.

కిడ్నీలో రాళ్ల సమస్య వల్ల ప్రధానంగా ఊబకాయం, హైపర్ టెన్షన్‌ వంటి సమస్యల బారినపడే ముప్పు ఉంటుంది. అయితే ఈ విషయం బాధితుల్లో 14 శాతం మందికే తెలుసు. యూరిన్ కిడ్నీ నుంచే ఉత్పత్తి అవుతుందన్న విషయం సర్వేలో పాల్గొన్న 50 శాతం మందికిపైగా తెలియదు.  కిడ్నీలు కూడా ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేస్తాయని 9 శాతం మందికి మాత్రమే తెలుసు. ఎముకల ఆరోగ్యానికి కిడ్నీనే కీలకమని 7 శాతం మందికే తెలుసు.

ఫిట్‌నెస్, బాడీ బిల్డింగ్‌కు పాపులారిటీ పెరుగుతున్న కారణంగా చాలా మంది తమ డైట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ప్రోటీన్ సప్లిమెంట్ల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయని 50 శాతం మంది విశ్వసిస్తున్నారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

కిడ్నీ ఆరోగ్యంపై చాలా మందికి కనీస అవగాహన లేదని సర్వే స్పష్టం చేసింది. కిడ్నీలో రాళ్లను తొలగించే సర్జరీ సేఫ్ ‍అని సర్వేలో పాల్గొన్న 68శాతం మంది నమ్ముతున్నారు. అయినా 50 శాతం మంది కావాలనే చికిత్సను 6 నెలల పాటు ఆలస్యం చేస్తున్నారు. కిడ్నీ సమస్యలను గుర్తించిన వెంటనే చికిత్స తీసుకుంటే అవి మరింత పాడవకుండా నివారించవచ్చని డాక్టర్ వైభవ్ కపూర్(ప్రిస్టిన్ కేర్‌ సహవ్యవస్థాపకులు) సూచిస్తున్నారు.
చదవండి: ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top