నిరుద్యోగులను నిరాశ పరిచిన పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్
ఖాళీలు ఎక్కువగా ఉన్నా.. సగం పోస్టులకు మాత్రమే జారీ
చాలా జిల్లాలు, జోన్లలో సింగిల్ డిజిట్ పోస్టులే
‘క్యూర్’పరిధిలో భర్తీకి కానిస్టేబుల్ పోస్టులే లేవు
26 జిల్లాల్లో మాత్రమే సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు
జోన్–3, 5, 6, 7 పరిధిలో ఆర్‌ఎస్‌ఐ–ఏఆర్ పోస్టులు సున్నా
జిల్లాలు, జోన్ల వారీగా బ్యాలెన్స్ తప్పిందంటున్న ఆశావహులు
తదుపరి నోటిఫికేషన్‌కు వయసు గండం...అనర్హులు కానున్న అభ్యర్థులు
పోస్టులే కేటాయించలేదు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన గుడ్ల శ్రీకాంత్. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రెండున్నర ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే ఒక దఫా కోచింగ్ పూర్తి చేసిన శ్రీకాంత్ మరో ఆరు నెలలు రెండో విడత కోచింగ్‌కు కూడా వెళ్లాడు. తాజాగా వెలువడిన నోటిఫికేషన్‌లో రంగారెడ్డి జిల్లాకు కానిస్టేబుల్ పోస్టులే కేటాయించలేదు. దాదాపు మూడేళ్లుగా చేసిన సన్నద్ధత వృథా కావడంతో శ్రీకాంత్ తీవ్ర గందరగోళంలో పడిపోయాడు. పరిమిత సంఖ్యలో పోస్టులు ఉన్నా కష్టపడి ఉద్యోగం కొట్టేందుకు ప్రయతి్నస్తుండేవాడినంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
సాక్షి, హైదరాబాద్: వేల సంఖ్యలో నిరుద్యోగులున్నా అందుకు తగ్గ ఖాళీలే లేవు..మరోవైపు ఖాళీలు ఎక్కువగా ఉన్నా ..సగం పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు..తెలంగాణ పోలీసు నియామకాల బోర్డు(టీజీపీఆర్‌బీ) తీరుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ మెజార్టీ జిల్లాల నిరుద్యోగులను నిరుత్సాహపరిచింది. తాజా నోటిఫికేషన్‌లో కేవలం 26 జిల్లాలకు మాత్రమే పోస్టులను నిర్దేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఒక్క పోస్టును కూడా ప్రకటించలేదు. ‘క్యూర్’పరిధిలో కానిస్టేబుల్ పోస్టులు లేనేలేవు. మరోవైపు పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల తదితర జిల్లాల్లోనూ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అసలే లేవు.
జిల్లాలు, జోన్ల వారీగా సమన్యాయం పాటించలేదని, దీంతో చాలా జిల్లాలు, జోన్ల పరిధిలోని అభ్యర్థులకు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే పరిస్థితే లేకుండా పోయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఆధారంగా నిర్దేశించిన క్యూర్ ప్రాంతంలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి లేకపోవడం గమనార్హం. అత్యధిక జనసాంద్రత ఉన్న ఈ ప్రాంతంలో కనీసం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా నోటిఫికేషన్‌లో చూపకపోవడంతో ఇక్కడ్నుంచి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు పోలీసు నియామకాల బోర్డు ఈసారి రిక్తహస్తమే చూపడంతో వారంతా లబోదిబోమంటున్నారు. మరోవైపు సరైన తిండి, నిద్రలేకుండా తాము ఎన్నో కష్టాలు ఎదుర్కున్నామని, ప్రభుత్వం అందించే ఐదు రూపాయాల భోజనం చేశామని, పలు దేవాలయాల వద్ద చేసే అన్నదానంతో కడుపునింపుకున్నామని, పస్తులుండి నీళ్లుతాగుతూ సరిపెట్టుకున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
20 వేల పోస్టులున్నా.. పరిమితంగానే నియామకం.
రాష్ట్ర పోలీసు విభాగంలో పోలీస్, స్పెషల్ పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖలోని వివిధ కేటగిరీల్లో 7,437 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గతనెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచి్చంది. మొత్తంగా ఈ పోస్టుల సంఖ్య పెద్దమొత్తంలో కనిపించినప్పటికీ జిల్లాలు, జోన్ల వారీగా ఉద్యోగాల విభజన పరంగా చూస్తే చాలా జిల్లాలు, జోన్లలో సింగిల్ డిజిట్ పోస్టులే ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం గతేడాది ఫిబ్రవరి గణాంకాల ప్రకారం 13,333 పోలీసు కానిస్టేబుల్ ఖాళీలున్నట్లు సమాచార హక్కు చట్టం కింద వెల్లడించింది. ఇందులో 9,875 సివిల్, 3,548 ఐఆర్ కానిస్టేబుల్ పోస్టులున్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మరో 6 వేల మంది పదవీ విరమణ చేసినట్లు అంచనా. దీంతో పోస్టుల సంఖ్య 20 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పరిధిలోకి వస్తాయి. అయితే వీటిలో సగం పోస్టులకు మాత్రమే బోర్డు నోటిఫికేషన్ ఇచి్చంది.
నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళన
కానిస్టేబుల్ పోస్టులు జిల్లా కేడర్ కాగా తాజా నోటిఫికేషన్‌లో కేవలం 26 జిల్లాలకు మాత్రమే ఈ పోస్టులను నిర్దేశించారు. ఏడు జిల్లాల్లో సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ కోలువులే లేవు. ప్రధానంగా అత్యధిక జనసాంద్రత ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఒక్క పోస్టును కూడా బోర్డు ప్రకటించలేదు. ఔటర్‌రింగురోడ్డు(ఓఆర్‌ఆర్) పరిధిని క్యూర్ ప్రాంతంగా పేర్కొన్న ప్రభుత్వం ఈ పరిధిలోకి వచ్చే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ పోస్టులు ప్రకటించకపోవడంతో ఇక్కడ పోలీసు కొలువుల కోసం ప్రయతి్నస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల తదితర జిల్లాల్లోనూ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు లేవు.
సబ్ ఇన్‌స్పెక్టర్ ఖాళీల్లో 14 శాతమే...
పోలీసు శాఖలో జోనల్ కేటగిరీ పరిధిలోకి వచ్చే సబ్ ఇన్‌స్పెక్టర్ కొలువు కేటాయింపులోనూ అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు మండిపడుతున్నారు. గతేడాది ఫిబ్రవరి నాటికి పోలీసు శాఖలో 717 సివిల్, ఏఆర్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది. అప్పట్నుంచి ఈ ఏడాది జూలై నాటికి దాదాపు 350 మంది పదవీ విరమణ పొందినట్లు అంచనా. కానీ తాజా ప్రకటనలో కేవలం 162 పోస్టులను మాత్రమే భర్తీకి చూపారు. అత్యంత పెద్ద ప్రాంతంగా ఉన్న జోగుళాంబ గద్వాల జోన్‌లో కేవలం 4 పోస్టులు మాత్రమే చూపించారు.
అదేవిధంగా క్యూర్ పరిధిలో కేవలం 13 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు మాత్రమే ప్రకటించారు. దీంతో అక్కడి నిరుద్యోగులు తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రిజర్వ్‌డ్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఆర్) పోస్టులు జోన్–3, జోన్–5, 6, 7 పరిధిలో ఒక్కటి కూడా లేకపోవడం తీవ్ర నిరాశ కల్పించే అంశం. నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అత్యంత పరిమితంగా పోస్టులు చూపడం, మరోవైపు కొత్త నోటిఫికేషన్ వచ్చేందుకు మరో నాలుగేళ్లు పడుతుందనే అంచనా నిరుద్యోగులను తీవ్రంగా కలవర పెడుతోంది. అప్పటికల్లా వయోపరిమితి ముగియడంతో అనర్హులమవుతామనే ఆందోళన నిరుద్యోగ అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అంతా అయోమయం
ప్రస్తుతం విడుదల చేసిన ఎస్‌ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాలకు పోస్టులు అసలే ఇవ్వలేదు. ఈ జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. క్యూర్ పరిధిలోని జిల్లాలకు కొత్తగా పోస్టులు నోటిఫికేషన్‌లో చూపిస్తారా? అనే సందేహం అభ్యర్థుల్లో ఉంది. ఈ రెండు జిల్లాల అభ్యర్థుల్లో అయోమయం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నోటిఫికేషన్ గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
– శంకర్ నాయక్ నిరుద్యోగ జేఏసీ నేత
నాలుగు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా!
గత 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా. కానీ ఈ నోటిఫికేషన్‌లో మా జిల్లాలో పోస్టులు కేటాయించకుండా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? కొత్త కమిషనరేట్ ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆమోదానికి ఫైల్ పంపించామని అంటున్నారు. ఆమోదం వచ్చాక ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు.ఆమోదం అయ్యేది ఎప్పుడు? నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడు? అంతా గందరగోళంగా ఉంది. – నరేష్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థి


