భార్యకు సర్‌ప్రైజ్‌.. భర్తకేమో బిగ్‌ షాక్‌! | Guwahati Man Lands In Trouble After Wife’s Birthday Celebration On Flyover Goes Viral, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

భార్యకు సర్‌ప్రైజ్‌.. భర్తకేమో బిగ్‌ షాక్‌!

Jun 24 2026 7:26 AM | Updated on Jun 24 2026 10:52 AM

Man Celebrates Wifes Birthday on Flyover Internet Has Other Plans

ఆయనకు భార్య అంటే ఎంతో ఇష్టమట!. అందుకే ఈసారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా జరపాలని డిసైడ్‌ అయ్యాడు. అర్థరాత్రి వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. రాజసంగా కనిపించే వేదికను సిద్ధం చేశాడు. ఆపైనే.. ఏదైతే చేయకూడదో ఆ పనే చేసి చిక్కుల్లో పడ్డాడు!. ప్రేమతో ప్లాన్‌ చేసిన వేడుక చివరకు ఆ కుటుంబానికే పెద్ద తలనొప్పిగా మారింది.

అస్సాంలోని గువాహటికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ బరువా తన భార్య పుట్టినరోజు సందర్భంగా జూన్‌ 22 అర్థరాత్రి ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేశాడు. అయితే ఈ వేడుకను ఇంట్లో గానీ, ఫంక్షన్‌ హాల్‌లో గానీ కాకుండా నగరంలోని కుమార్‌ భాస్కర్‌ వర్మ ఫ్లైఓవర్‌పై నిర్వహించడం వివాదానికి దారి తీసింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఫ్లైఓవర్‌పై బెలూన్లతో అలంకరణలు చేశారు. రోడ్డుపై రెడ్‌కార్పెట్‌ పరిచారు. పలువురు స్నేహితులు, బంధువులు అక్కడికి చేరుకుని పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. కొన్ని కార్లను ఫ్లైఓవర్‌పైనే నిలిపివేసి వేడుక నిర్వహించారు. ఇక్కడే అసలు చేయకూడని పని చేశాడాయన.

భార్యను ఇంప్రెస్‌ చేయాలన్న ఆలోచన బాగానే ఉన్నా.. ఫ్లైఓవర్‌ను పార్టీ హాల్‌గా మార్చేయడం మాత్రం పోలీసులను ఇంప్రెస్‌ చేయలేదు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రజల కోసం నిర్మించిన ఫ్లైఓవర్‌ను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడం ఏంటని ప్రశ్నించారు. ట్రాఫిక్‌, ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. దీంతో గువాహటి పోలీసులు రంగంలోకి దిగారు.

14 మంది అదుపులోకి
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గౌతమ్‌ బరువాను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడితో పాటు వేడుకలో పాల్గొన్న భార్య సహా మొత్తం 14 మందిని ప్రశ్నల కోసం అదుపులోకి తీసుకున్నారు. వేడుకలో ఉపయోగించిన నాలుగు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసులు నమోదు
గౌతమ్‌ బరువాపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, పబ్లిక్‌ న్యూసెన్స్‌కు సంబంధించిన నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు.

పోలీసులు ప్రస్తుతం మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. సోషల్‌ మీడియాలో ఇదంతా చూసిన వాళ్లు.. ఇంత ప్రేమ చూపించాలా బాస్‌!" అని కొందరు, ఇలాంటి ఐడియాలు మాకెందుకు రావు? అని కొందరు భర్తలు లోలోపల కుళ్లుకుని ఉండొచ్చనే జోకులు పేలుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement