ఇది బాబు మార్క్‌ రాజకీయం.. భోగాపురంపై వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. | YS Jagan Key Comments On Bhogapuram International Airport | Sakshi
Sakshi News home page

ఇది బాబు మార్క్‌ రాజకీయం.. భోగాపురంపై వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

Jul 29 2026 11:53 AM | Updated on Jul 29 2026 12:27 PM

YS Jagan Key Comments On Bhogapuram International Airport

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్‌ చోరీపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పని వైఎస్సార్‌ది.. ప్రచారం చంద్రబాబుది!. ‘క్రెడిట్‌ వితౌట్‌ కంట్రిబ్యూషన్‌’.. అదే చంద్రబాబు మార్కు రాజకీయం అంటూ మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ ‌క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు అని అన్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ ఎక్స్‌ వేదికగా..‘ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది.

అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ ‌క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. చంద్రబాబు.. భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా, ఏమీ చేయకపోయినా, ఒక రాయి వేయడం తప్ప, భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది?

జూన్‌ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్‌ సంస్థతో కన్సెషన్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్‌ అక్విజషన్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌, సైట్‌ క్లియరెన్స్‌, ఎన్‌ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్‌, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్‌ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబుగారూ?. అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడంకోసం రూ.75కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కోసం రూ. 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్‌ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టింది మేం. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబుగారూ?

ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే, అన్ని అనుమతులు, అన్ని ఎన్‌వోసీలు, అన్ని సౌకర్యాలు పూర్తిచేశాం కాబట్టే, కోవిడ్‌ వంటి మహాసంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, పనులు ప్రారంభించి,  2024 ఎన్నికల నాటికే, విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్‌ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం. మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం.

కానీ చంద్రబాబు.. మీరు అప్పుడూ ఏమీ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ చేయడం లేదు. విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ‘ఎయిర్‌పోర్టు ఉంది.. కానీ సిటీ నుంచి వేగంగా, తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో, రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవేకోసం  కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడితీసుకురావడంతో, కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ గారు స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. ఆయన ఇప్పుడు కూడా అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. 

మరి చంద్రబాబుగారూ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు. ఇప్పడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మీ చిత్తశుద్ధి, గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి, దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి’ అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement