
లేహ్: లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు నిన్న(సెప్టెంబర్ 26 శుక్రవారం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. లద్దాఖ్ రాజధాని లేహ్‌లో జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడ్డారు. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద డీజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. సోనమ్ వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయంటూ లద్దాఖ్ డీజీపీ ఎస్‌డీ సింగ్ జామ్వాల్ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్న డీజీపీ.. పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను కూడా ఆయన సందర్శించినట్లు లద్దాఖ్ డీజీపీ వెల్లడించారు. ఓ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారితో వాంగ్‌చుక్‌కు సంబంధాలున్నాయని పేర్కొన్న డీజీపీ.. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ స్పష్టం చేశారు. పాక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వాంగ్‌చుక్ హాజరైనట్లు తేలిందన్నారు.
కాగా, లద్దాఖ్‌లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్‌చుక్ కారణమంటూ కేంద్ర హోంశాఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. అరబ్ వసంతం, నేపాల్ జెన్–జెడ్ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్‌చుక్ ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు.