
లేహ్: లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమించిన ఒక గ్రూపును విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోనమ్ వాంగ్‌చుక్ స్థాపించిన ఒక సంస్థపై నిఘా సారించింది. ఈ సంస్థ విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టాన్ని ఉల్లంఘించిందనే అనుమానం వ్యక్తం చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దర్యాప్తు సంస్థ రెండు నెలల క్రితం హిమాలయన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ (హెచ్‌ఐఏఎల్) సేకరించిన నిధులపై విచారణను ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న వాంగ్‌చుక్ పాకిస్తాన్ పర్యటనపై కూడా సమీక్షిస్తున్నదని సమాచారం.
వాంగ్‌చుక్ నిరాహార దీక్ష అనంతరం..
కాగా లడఖ్ జిల్లాలో కర్ఫ్యూ పరిస్థితుల్లో భద్రతా దళాలు, లడఖ్ ఉద్యమ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు మృతిచెందారు. 40 మంది పోలీసు సిబ్బందితో సహా 80 మంది గాయపడ్డారు. వాంగ్‌చుక్ తన పక్షం రోజుల నిరాహార దీక్షను ఉపసంహరించుకున్న తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఘర్షణల్లో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలించిన తర్వాత లేహ్ అపెక్స్ బాడీ యువజన విభాగం నిరసనలకు పిలుపునిచ్చింది.
రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే..
దీంతో కొందరు యువకులు యువకులు గ్రూపులుగా బయలుదేరి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, హిల్ కౌన్సిల్‌ను లక్ష్యంగా చేసుకుని విధ్వంసకాండకు పాల్పడ్డారు. లడఖ్ పట్టణం అంతటా మోహరించిన పోలీసులు, పారామిలిటరీ దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి. సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే హింస చెలరేగిందని కేంద్రం ఆరోపించింది. లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి.ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఉద్దేశపూర్వక కాల్పులంటూ ఆరోపణలు
సీఆర్‌పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు.