వాంగ్‌చుక్‌ నిర్బంధం అక్రమం | Wangchuk wife moves Supreme Court, seeks his immediate release | Sakshi
Sakshi News home page

వాంగ్‌చుక్‌ నిర్బంధం అక్రమం

Oct 4 2025 6:38 AM | Updated on Oct 4 2025 6:38 AM

Wangchuk wife moves Supreme Court, seeks his immediate release

సుప్రీంకోర్టులో వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి అంగ్మో పిటిషన్‌ 

న్యూఢిల్లీ: ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ)కింద నిర్బంధించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను నిర్బంధించడం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. 

లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్‌తో ఆయన దీక్షకు పూనుకోవడం, కేంద్ర పాలిత ప్రాంతంలో నిరసనలు హింసాత్మక రూపం దాల్చి నలుగురు చనిపోగా 90 మంది వరకు గాయపడటం తెల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు ఆయన్ను సెపె్టంబర్‌ 26న అదుపులోకి తీసుకుని, రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌ జైలుకు తరలించారు. అంగ్మో తరఫున సీనియర్‌ లాయర్‌ వివేక్‌ తన్‌ఖా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. 

వెంటనే విచారణ చేపట్టి, వాంగ్‌చుక్‌ను సుప్రీంకోర్టులో హాజరు పరచాలంటూ లద్దాఖ్‌ యంత్రాంగాన్ని ఆదేశించాలన్నారు. ఆయన్ను నేరుగా, ఫోన్‌ ద్వారా కలిసి మాట్లాడేందుకు తక్షణమే అవకాశం కల్పించాలన్నారు. కేంద్ర హోం శాఖ, లద్దాఖ్‌ యంత్రాంగం, లేహ్‌ డిప్యూటీ కమిషనర్, జోథ్‌పూర్‌ జైలు సూపరిటెండెంట్‌లను ఇందులో ప్రతివాదులుగా చేరారు. 

‘అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక సంస్కర్త అయిన వాంగ్‌చుక్, లద్దాఖ్‌లో పర్యావరణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధేయ విధానంలో, శాంతియుతంగా సాగే ఆందోళనలను మాత్రమే సమర్థించారు’అని అందులో పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష సాగించిన వాంగ్‌చుక్‌ తిరిగి కోలుకుంటున్న సమయంలో పోలీసులు అరెస్ట్‌ చేయడం, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. 

అత్యవసరమైన వస్తువులు, మందులు తీసుకోనివ్వకుండా కుటుంబసభ్యులతో మాట్లాడనీయకుండా హడావుడిగా ఆయన్ను జోథ్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారని అందులో ఆరోపించారు. ఇప్పటి వరకు ఆ నిర్బంధానికి గతల కారణాలను కుటుంబసభ్యులకు అధికారులు వెల్లడించలేదని పిటిషన్‌లో తెలిపారు. తనను దాదాపుగా గృహ నిర్బంధంలో ఉంచారని అంగ్మో తెలిపారు. 

వాంగ్‌చుక్‌ స్థాపించిన హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్స్, లద్దాఖ్‌ (హెచ్‌ఐఏఎల్‌) విద్యార్థులను, సిబ్బందిని అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. వాంగ్‌చుక్‌కు విదేశీ సంస్థలతో సంబంధాలను అంటగడుతూ దు్రష్పచారం సాగిస్తున్నారన్నారు. నిర్బంధానికి సంబంధించిన ఉత్తర్వులను బయటపెట్టాలని, అరెస్ట్‌కు కారణాలను తెలిపే అన్ని రికార్డులను బహిర్గతం చేయాలని కోరారు. వాంగ్‌చుక్‌కు వెంటనే డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేయించి, ఆరోగ్య నివేదికలను బయటపెట్టాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement