
రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ అమలు కోరుతూ గత కొంతకాలంగా కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్‌లో జరుగుతున్న ఆందోళనలు.. ఒక్కసారిగా హింసాత్మక మలుపు తిరిగాయి. సోమవారం లేహ్‌లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో నలుగురు మృతి చెందగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ హింసకు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను బాధ్యుడిగా చేస్తూ కేంద్రం సంచలన ఆరోపణలకు దిగింది.
ఎంతో మంది నేతలు సోనమ్ వాంగ్‌చుక్‌ను(Sonam Wangchuk) కలిసి నిరాహార దీక్షను విరమించమని కోరారు. అయినా ఆయన మొండిగా ముందుకు వెళ్లారు. అరబ్ స్ప్రింగ్ ఉద్యమం, నేపాల్‌లో తాజాగా జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావిస్తూ అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. ఆయన ప్రసంగాల వల్లే రెచ్చిపోయిన కొందరు యువకులు బీజేపీ కార్యాలయంపై దాడి సహా పలు విధ్వంసాలకు పాల్పడ్డారు. లడాఖ్ యువతను ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారని, సంకుచిత రాజకీయాలకు.. వ్యక్తిగత లబ్ధికి వాళ్లు బలయ్యారని, కేంద్రం మాత్రం అక్కడి యువత సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొంది.

అంతేకాదు.. ఈ హింస సహజంగా జరగలేదని.. కావాలని ప్రేరేపించారని, ఒక వ్యూహం ప్రకారం పక్కా ప్రణాళికాబద్ధంగానే జరిగిందని సంచలన ఆరోపణలు చేసింది కేంద్రం. ఈ ఘటనలపై ఇప్పటికే కొన్ని కీలక వర్గాలు సేకరించినట్లు చెబుతున్న కేంద్ర హోం శాఖ వర్గాలు.. అత్యున్నత దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశాయి.
👉బుధవారం సాయంత్రం కల్లా లేహ్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని.. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. లడాఖ్‌లో ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే..
.. ‘ఇది లడాఖ్‌కు, నాకు వ్యక్తిగతంగా అత్యంత దుఃఖదాయకమైన రోజు. గత ఐదేళ్లుగా మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాం. కానీ ఈ రోజు హింస జరిగింది, ఇది మా శాంతి సందేశాన్ని విఫలమయ్యేలా చేసింది. మా యువత ప్రాణాలు కోల్పోతే దీక్షకు అర్థం ఉండదు. అందుకే దీక్షను వెంటనే విరమిస్తున్నాను’ అని సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు. అదే సమయంలో.. కేంద్రం చేసిన ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

👉తన ఈ ఉద్యమం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, లడాఖ్ ప్రజల హక్కుల కోసం మాత్రమేనని సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. నేపాల్ Gen Z ఉద్యమాన్ని ప్రస్తావించడం.. కేవలం ఇక్కడి జనాల్లో చైతన్యాన్ని పెంచేందుకు మాత్రమేనని, అది హింసకు ప్రేరణ ఇవ్వడం ఏమాత్రం కాదని అన్నారాయన. ఇప్పటిదాకా ఈ ఉద్యమం పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగానే సాగిందని గుర్తు చేశారు. లడాఖ్ హక్కుల విషయంలో కేంద్రంలోని బీజేపీ యూటర్న్, నిరుద్యోగ సమస్య.. ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. ‘‘ప్రభుత్వం ఇకనైనా మా శాంతి సందేశాన్ని వినాలి. పోలీసులు నిరసకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం ఆపాలి. శాంతి నిరసనలే మా మార్గం. హింస వల్ల మా లక్ష్యం దూరమవుతుంది. యువత కూడా కవ్వింపు చర్యలను మానాలి. ఇది మన ఉద్యమానికి హాని చేస్తుంది’’ అని పిలుపు ఇచ్చారాయన.
సోనం వాంగ్‌చుక్ ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త & పర్యావరణ పరిరక్షకుడు. ఆయన సెక్‌మోల్ (Students' Educational and Cultural Movement of Ladakh) అనే సంస్థను స్థాపించి సంప్రదాయ విద్యా విధానాలకు భిన్నంగా పిల్లలకు అనుభవాధారిత(ప్రాక్టికల్స్) విద్యను బోధించేవారాయన. తద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. సోనం వాంగ్‌చుక్ విధానాల నుంచి ఇన్‌స్పిరేషన్‌తో.. 2009లో దర్శకుడు రాజ్‌కుమార్ హీరాణీ ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ ‘రాంచో’ పాత్రను రూపొందించారు. అంతేకాదు.. వినూత్న విద్యా విధానాలు, పర్యావరణ పరిరక్షణ, లడాఖ్ ప్రజల అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆసియా ప్రతిష్టాత్మక అవార్డు రామన్ మెగసెసే ఆయనకు దక్కింది కూడా.

👉అయితే.. లడాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, అలాగే ఆరవ షెడ్యూల్ (Sixth Schedule) అమలు చేయాలని సోనమ్ వాంగ్‌చ్‌క్ తన దీక్షను సెప్టెంబర్ 10, 2025న ప్రారంభించారు. పదిహేను రోజుల తర్వాత.. లడాఖ్‌లోని లేహ్ జిల్లా కేంద్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో దీక్షను మధ్యలోనే విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఆరవ షెడ్యూల్.. అనేది త్రిపుర, మేఘాలయ, మిజోరం మరియు అస్సాం రాష్ట్రాల్లోని గిరిజనుల పాలనకు ప్రత్యేకంగా రూపొందించబడిన రాజ్యాంగ అధికార పరిమితులు(Provision). ఆరవ షెడ్యూల్ అమలుతో గిరిజన ప్రాంతాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భారత రాజ్యాంగంలోని Article 244 ప్రకారం.. స్థానిక స్వయం పాలన, భాష.. సంస్కృతి.. సంప్రదాయల రక్షణ, ప్రత్యేక న్యాయవ్యవస్థ, ఆర్థిక స్వాతంత్రం, విద్యా..ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభిస్తాయి. దీంతో లడాఖ్‌లోనూ దీనిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎపెక్స్ బాడీ లేహ్(LAB.. రాజకీయ సంఘాల సమ్మేళనం), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్(KDA) గత నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్నాయి.
సోమవారం లేహ్‌లో చోటు చేసుసున్న హింసాత్మక ఘటనల్లో 50 మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. కేంద్రం ఇప్పటికే అక్టోబర్ 6న లాబ్, కేడీఏ ప్రతినిధులతో హై పవర్డ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. గతంలో కూడా చర్చలకు ప్రయత్నించినప్పటికీ, సానుకూల స్పందన రాలేదని బుధవారం రాత్రి వెలువరించిన ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చదవండి: 'ఐ లవ్ మహ్మద్'పై కశ్మీర్ సీఎం స్పందన