
ఐ లవ్ మహ్మద్ వివాదంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ప్రజలు తాము ఆరాధించే దైవం పట్ల ప్రేమను వ్యక్తపరచడం తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఐ లవ్ మహ్మద్ అనే మూడు సాధారణ పదాలను చట్టవిరుద్ధమని ఎలా అంటారని నిలదీశారు. ఐ లవ్ మహ్మద్ బ్యానర్ ప్రదర్శించిన వారిపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. మతిస్థిమితం తప్పినవారే ఇలాంటికేసులు పెడతారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో వెంటనే కోర్టులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.
కాన్పూర్‌లో మొదలైన వివాదం
ఐ లవ్ మహ్మద్ వివాదం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మొదలై దేశమంతా పాకింది. ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సెప్టెంబర్ 4న కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో జరిగిన ఊరేగింపులో ‘ఐ లవ్ మహ్మద్’ (I Love Muhammad) అనే బ్యానర్‌ను ముస్లింలు ప్రదర్శించారు. దీనిపై స్థానిక హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మతపరమైన వేడుకల్లో కొత్త ట్రెండ్‌తో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని ఆరోపించాయి. దీంతో పోలీసులు సెప్టెంబర్ 9న 24 మంది ముస్లింలపై కేసులు నమోదు చేశారు.
కాన్పూర్ పోలీసుల చర్యకు నిరసనగా ఉన్నావ్, మహరాజ్ గంజ్, కౌశాంబి, లక్నో నగరాల్లో ముస్లింలు ర్యాలీలు చేపట్టారు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తెలంగాణలోనూ నిరసనలు తెలిపారు. ‘ఐ లవ్ మహ్మద్’ అనడం నేరం కాదని ఎఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. తాజాగా ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) స్పందించారు.
ఎలా చట్టవిరుద్ధం?
"ఈ వాక్యంపై ఎవరికైనా అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఈ మూడు పదాలతో ఎవరికి సమస్య ఉంటుంది? ఈ మూడు పదాలు రాయడం వల్ల అరెస్టు ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఈ మూడు పదాలపై కేసు పెట్టారంటే వాళ్లు మానసిన అనారోగ్యంతో ఉన్నారని అర్థం. ఈ వివాదాన్నికోర్టులు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ ముహమ్మద్ అని రాయడం ఎలా చట్టవిరుద్ధం?" అని సీఎం ఒమర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు.

చదవండి: 'ఐ లవ్ మహ్మద్' ఎందుకు వివాదంగా మారింది?
ఇది ఒక మతానికి సంబంధించింది మాత్రమే కాదని మిగతా మతాల వారు కూడా తమ ఇష్ట దైవాలు, గురువులపై ప్రేమను ఏదోక రూపంలో వ్యక్తపరుస్తూనే ఉంటారని చెప్పారు. ''సిక్కులు, హిందువులు సహా అన్ని మతాల వారు తమ దైవాలపై ప్రేమను వ్యక్తం చేయడం లేదా? జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) వెలుపల ఎక్కడికైనా వెళ్లండి. దేవుడు ఫొటోలు లేని వాహనాలు మీకు కనిపించవు. అది చట్టవిరుద్ధం కాకపోతే, ఇది ఎలా అవుతుంది?" అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.