‘ఐ లవ్ మహ్మ‌ద్‌’ ఎందుకు వివాదంగా మారింది? | What is I Love Muhammad row and why did it spark protests across India | Sakshi
Sakshi News home page

‘ఐ లవ్ మహ్మ‌ద్‌’ వివాదం ఎక్క‌డ మొద‌ల‌యింది?

Sep 23 2025 6:00 PM | Updated on Sep 23 2025 6:44 PM

What is I Love Muhammad row and why did it spark protests across India

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రారంభమైన ‘ఐ లవ్ మహ్మ‌ద్‌’ వివాదం ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు పాకింది. ఉన్నావ్, బరేలీ, కౌశాంబి, లక్నో, మహారాజ్‌గంజ్, కాశీపూర్ హైదరాబాద్ వంటి నగరాల్లో మైనార్టీలు సామూహిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, ర్యాలీలు జ‌రిపారు. కొన్నిచోట్ల పోలీసుల‌తో ఘర్షణలకు దారితీశాయి. అస‌లేంటి ఈ వివాదం? ఐ లవ్ మహ్మ‌ద్‌ (I Love Muhammad) నినాదం ఎందుకు వివాదాస్ప‌ద‌మైంది?

కాన్పూర్‌లో క‌ల‌క‌లం
ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ సంద‌ర్భంగా కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో సెప్టెంబర్ 4న జరిగిన ఊరేగింపులో ‘ఐ లవ్ మహ్మ‌ద్‌’ అనే బ్యాన‌ర్‌ను ముస్లింలు ప్ర‌ద‌ర్శించారు. దీనిపై స్థానిక హిందూ సంఘాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. మ‌త‌ప‌ర‌మైన వేడుక‌ల్లో కొత్త సంప్రదాయం ఎందుకు ప్రవేశపెడుతున్నారని ప్ర‌శ్నించాయి. సున్నితమైన‌ అంశం కావ‌డంతో పోలీసులు వెంట‌నే జోక్యం చేసుకున్నారు. వేడుక‌లు నిర్వ‌హించే ప్రాంతంలో ఎప్పుడూ వేసే టెంట్ స్థానంలో బ్యాన‌ర్‌తో పాటు వెలిసిన కొత్త గూడారాన్ని తొల‌గించారు. య‌థావిధిగా పాత టెంట్‌ను పోలీసులు పున‌రుద్ధించారు. బ్యాన‌ర్ పెట్టిన వారిపై కేసు న‌మోదు చేయ‌లేద‌ని స్థానిక‌ డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు. మతపరమైన ఊరేగింపుల్లో కొత్త ఆచారాలను ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వ నిబంధనలు నిషేధించాయని ఆయ‌న వెల్ల‌డించారు. 

24 మందిపై కేసులు
ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా మత సామరస్యాన్ని దెబ్బతీశారనే ఆరోప‌ణ‌ల‌తో సెప్టెంబర్ 9న కాన్పూర్ పోలీసులు (Kanpur Police) కేసులు పెట్టారు. సాంప్రదాయ గుడారాన్ని తొలగించి కొత్త స్థలంలో ‘ఐ లవ్ మహ్మ‌ద్‌’ బ్యానర్‌ను ప్ర‌ద‌ర్శించార‌నే నెపంతో 24 మందిపై కేసులు నమోదు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ బ్యానర్ పై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కాన్పూర్ పోలీసులు చెప్పారు. మ‌రో వ‌ర్గం పోస్ట‌ర్ల‌ను ధ్వంసం చేసినందుకు కేసులు పెట్టిన‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు.

ప‌లు న‌గ‌రాల్లో ర్యాలీలు
కాన్పూర్ తరువాత సెప్టెంబర్ 9న ఉన్నావ్‌, మ‌హ‌రాజ్ గంజ్‌, కౌశాంబి, ల‌క్నో న‌గ‌రాల్లో ముస్లింలు ర్యాలీలు చేప‌ట్టారు. ‘ఐ లవ్ మహ్మ‌ద్‌’ బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శిస్తూ మతపరమైన నినాదాలు చేస్తూ ఊరేగింపులు నిర్వహించారు. ఉన్నావ్‌లో పోలీసులపై రాళ్ల దాడి జ‌ర‌గ‌డంతో 8 మందిపై కేసులు న‌మోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. మ‌హ‌రాజ్ గంజ్‌లో ర్యాలీకి య‌త్నించిన వారిని పోలీసులు అడ్డుకుని 64 మందిపై కేసులు పెట్టారు. ప‌లు వాహ‌నాల‌ను సీజ్ చేశారు. కౌశాంబిలో నిర్వ‌హించిన ఊరేగింపులో యువ‌కులు అభ్యంత‌క‌ర నినాదాలు చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలు వైర‌ల్ కావ‌డంతో హిందూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. దీంతో పోలీసులు మైనర్లతో సహా డజన్ల కొద్దీ వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. లక్నోలో విధాన‌స‌భ వ‌ద్ద ముస్లిం మ‌హిళ‌లు శాంతియుత ధ‌ర్నా చేప‌ట్టారు. మహ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌కు మ‌ద్ద‌తుగా నినాదాలు చేశారు. సామాజిక కార్యకర్త సుమైయా రాణా ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టార‌ని విమ‌ర్శించారు.

ఇత‌ర రాష్ట్రాల్లోనూ నిర‌స‌న‌లు
కాన్పూర్‌లో మొదలైన మైనార్టీల నిర‌స‌న‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు వ్యాపించాయి. మ‌హారాష్ట్ర‌ నాగ్‌పూర్‌లోని మోమిన్‌పురాలో కాంగ్రెస్ నగర మైనారిటీ విభాగాధిపతి వసీం ఖాన్ నాయకత్వంలో నిరసనలు జరిగాయి. ప‌లు రాజ‌కీయ పార్టీల నేత‌లు, సామాజిక కార్య‌క‌ర్తలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్‌ కాశీపూర్‌లోని అలీఖాన్ ప్రాంతంలో నిర్వ‌హించిన అన‌ధికారిక ర్యాలీ ఉద్రిక్త‌త‌లకు దారి తీసింది. నిర‌స‌న‌కారులు రాళ్ల దాడి చేయ‌డంలో ప్రజల‌ ఆస్తులకు నష్టం కలిగింది. పోలీసులు చురుగ్గా స్పందించి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్ప‌డిన వారిని గుర్తించి, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని స్థానిక ఎస్పీ అభయ్ సింగ్ మీడియాకు తెలిపారు.

ఎస్పీ, బీజేపీ ఏమ‌న్నాయంటే..
ఈ వివాదంపై ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల నాయ‌కులు స్పందించారు. యూపీ పోలీసుల వైఫల్యమే నిరసనలకు కారణమ‌ని సమాజ్ వాదీ పార్టీ విమ‌ర్శించారు. "ఐ లవ్ రామ్" లేదా "ఐ లవ్ మ‌హ్మ‌ద్" అయినా వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడుతుందన్నారు. పోలీసులను లక్ష్యంగా చేసుకునే లేదా చట్టాన్ని ఉల్లంఘించే ఏ ప్రయత్నానైనా ఉపేక్షించ‌బోమ‌ని బీజేపీ నేత‌లు పేర్కొన్నారు.

నేరం కాద‌న్న ఒవైసీ 
ఎఐఎంఐఎం పార్టీ అధ్య‌క్షుడు, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించ‌డంతో ఈ వివాదం మ‌రింత ముదిరింది. కాన్పూర్ పోలీసుల చ‌ర్య‌ల‌ను ఆయ‌న విమ‌ర్శించారు. ‘ఐ లవ్ మహ్మ‌ద్‌’ అన‌డం నేరం కాద‌ని అంటూ సెప్టెంబర్ 15న ఎక్స్‌లో పోస్ట్ చేసి, కాన్పూర్ పోలీసుల‌కు ట్యాగ్ చేశారు. దీంతో ఈ వివాదం విస్తృత చర్చకు దారితీసింది. 

హింస వ‌ద్ద‌న్న మ‌త పెద్ద‌లు
మౌలానా సుఫియాన్ నిజామి, జమాత్ రజా-ఎ-ముస్తఫా, ప్రపంచ సూఫీ ఫోరం వంటి మత నాయకులు హింసను ఖండించారు. శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత సామరస్యాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగ హక్కులను గౌరవించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

చ‌ద‌వండి: డ‌బుల్ పీజీ ప్రొఫెస‌ర్‌తో మంత్రి రెండో పెళ్లి

దేశవ్యాప్తంగా చర్చ
కాన్పూర్‌లో ఒక బ్యానర్‌పై స్థానికంగా మొదలైన వివాదం చినికి చినికి గాలివాన‌గా మారింది. భావ ప్రకటనా స్వేచ్ఛ, మతపరమైన భావోద్వేగం, మత సామరస్యం గురించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు శాంతియుతంగా జరిగినప్పటికీ.. కొన్నిచోట్ల‌ పోలీసులతో ఘర్షణలు, ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టులకు దారితీశాయి. ఈ నిర‌స‌నలు మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి అధికారులు సోషల్ మీడియా, స్థానిక కార్యక్రమాలను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement