
డబుల్ మాస్టర్ డిగ్రీ చేసిన ప్రొఫెసర్ అమ్రీన్ సెఖోన్‌ను ద్వితీయ వివాహం చేసుకున్నారు మినిస్టర్ విక్రమాదిత్య సింగ్. సెప్టెంబర్ 22న చండీగఢ్‌లో సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ప్రజా పనులు, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు. ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజా వీరభద్ర సింగ్ కుమారుడే ఈయన.
వధువు అమ్రీన్ సెఖోన్ (Amreen Sekhon) పంజాబ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇంగ్లీష్, సైకాలజీలో డబుల్ మాస్టర్స్ డిగ్రీలతో పాటు సైకాలజీలో పీహెచ్‌డీ చేశారు. విక్రమాదిత్యకు పాత స్నేహితురాలైన ఆమె.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకున్నారు. సర్దార్ జోతిందర్ సింగ్ సెఖోన్, ఓపిందర్ కౌర్ ఆమె తల్లిదండ్రులు.
యువరాణితో ఫస్ట్ మ్యారేజ్
విక్రమాదిత్య సింగ్ 1989, అక్టోబర్ 17న జన్మించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిషప్ స్కూల్‌లో చదువుకున్న సింగ్, 2011లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్ కళాశాల నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 2016లో చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన మంచి క్రీడాకారుడు కూడా. జాతీయ స్థాయి ట్రాప్ షూటర్‌గా 2007లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. రాజస్థాన్‌లోని అమేత్‌కు చెందిన యువరాణి సుదర్శన చుండావత్‌ను (Sudarshana Chundawat) 2019లో వివాహం చేసుకున్నారు. విభేదాల కారణంగా 2024, నవంబర్‌లో వీరు విడిపోయారు.
కాంగ్రెస్ పార్టీలో కీలక నేత
36 ఏళ్ల విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో సిమ్లా గ్రామీణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మండీ నియోజకవర్గంలో పోటీ చేసి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
చదవండి: నా రీల్స్ చూడడం తగ్గించండి సారూ.. ఢిల్లీ సీఎం ఇంట్రస్టింగ్ కామెంట్స్