
యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడని ఆరోపణలు
జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్న పోలీసులు
లద్దాఖ్ నుంచి బయటకు తరలింపు
లేహ్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
భద్రత కట్టుదిట్టం.. రంగంలోకి అదనపు బలగాలు
లేహ్/శ్రీనగర్: లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్(59)ను పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అరెస్టు చేశారు. లద్దాఖ్ రాజధాని లేహ్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడిన సంగతి తెలిసిందే. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద డీజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.
లేహ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. వాంగ్‌చుక్‌ను లద్దాఖ్ నుంచి రాజస్థాన్‌లోని జో«థ్‌పూర్‌కు తరలించారు. ఆయనపై ఏయే అభియోగాలు మోపారన్న దానిపై పోలీసుల ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా ఉన్న లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన కొన్నేళ్లుగా పోరాటం కొనసాగిస్తున్నారు.
ఈ నెల 10న నిరాహార దీక్ష ప్రారంభించారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమకారులు బుధవారం ఇచి్చన బంద్ పిలుపు హింసాత్మకంగా మారింది. లేహ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ విధించారు. హింస నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించారు. లద్దాఖ్‌లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్‌చుక్ కారణమని కేంద్ర హోంశాఖ గురువారం ఆరోపించింది. అరబ్ వసంతం, నేపాల్ జెన్–జెడ్ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది.
నన్ను బలిపశువును చేయడానికి కుట్ర: వాంగ్‌చుక్
కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్‌చుక్ గురువారం ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చకుండా వారి దృష్టిని మళ్లించడానికే తనపై నిందలు వేస్తోందని ఆరోపించారు. తనను బలిపశువుగా మార్చడం పక్కనపెట్టి జనం ఆకాంక్షలు నెరవేర్చాలని హితవు పలికారు. మరోవైపు వాంగుచుక్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు.
ఆరోపణలు నిరూపించగలరా?: గీతాంజలి
సోనమ్ వాంగ్‌చుక్‌ను నేరçస్తుడిలా పరిగణిస్తున్నారని ఆయన భార్య గీతాంజలి అంగ్మో మండిపడ్డారు. వాంగ్‌చుక్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కేంద్రం తప్పుడు ప్రచారానికి తెరతీసిందని విమర్శించారు. పోలీసులు తమ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. తన భర్తను జాతివ్యతిరేక శక్తిగా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించారు. ఎలాంటి విచారణ గానీ, కారణంగా గానీ లేకుండా ఆయనను బలవంతంగా లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా జరడం దారుణమని అన్నారు. తన భర్త ఐదేళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నారని, ఏనాడూ హింసను ప్రేరేపించలేదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, విద్యావ్యాప్తి కోసం కృషి చేస్తూ ఎన్నో పురస్కారాలు పొందారని గుర్తుచేశారు. మేధావులకు, విద్యావేత్తలకు ఇచ్చే మర్యాద అదేనా? అని ప్రశ్నించారు. తన భర్తపై చేస్తున్న ఆరోపణలు నిరూపించగలరా? టీవీలో చర్చకు సిద్ధమా? అని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గీతాంజలి అంగ్మో సవాలు విసిరారు.
అరెస్టు దురదృష్టకరం
సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేయడం దురదృష్టకరమని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. లద్దాఖ్ ప్రజలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, అందుకే ప్రజలు పోరుబాట పట్టారని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం హామీ ఇచి్చందని, ఇప్పటికీ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.