
అందులో భాగమే దేశద్రోహ ఆరోపణలు
వాంగ్‌చుక్ దేశద్రోహి అయితే అవార్డులు ఎందుకిచ్చారు?
ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా?
సోనమ్ వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి ఆంగ్మో సవాల్
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోసం పోరాటం చేస్తున్న తన భర్తను కేంద్ర ప్రభుత్వం వేటాడుతోందని, అందులో భాగంగానే ఆయనపై దేశద్రోహ చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద తప్పుడు కేసులు పెట్టారని ఆయన సతీమణి గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు. సోనమ్ వాంగ్‌చుక్‌పై నమోదుచేసిన కేసులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రభుత్వ అధికారులకు సవాల్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
‘వాంగ్‌చుక్‌తో ఇప్పటివరకు నన్ను మాట్లాడనివ్వలేదు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించిన పత్రాలు కూడా అధికారులు నాకు ఇవ్వలేదు. నన్ను కూడా దాదాపు గృహనిర్బంధంలో పెట్టినట్లుగా పరిస్థితులు కల్పించారు. వాంగ్‌చుక్‌పై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగించాల్సిన అవసరం లేదు. అధికారులు ఒకేవైపు మాట్లాడుతున్నారు. ఒకరకంగా ఆయనను వేటాడుతున్నారు. ఆయన దేశద్రోహి అయితే భారత ప్రభుత్వం ఆయనకు ఎందుకు అనేక అవార్డులు ఇచ్చింది?
లడక్‌కు రాష్ట్రహోదా ఇవ్వాలని, దానిని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమాన్ని బలహీనపర్చేందుకే ఇదంతా చేస్తున్నారు’అని గీతాంజలి ఆరోపించారు. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కోసం ఈ నెల 24న లేహ్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారి నలుగురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఉద్యమకారులను వాంగ్‌చుక్ రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అరెస్టు చేసి రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్ జైల్లో నిర్బంధించారు.
వాంగ్‌చుక్ చుట్టూ కుట్ర
సోనమ్‌వాంగ్‌చుక్ కార్యకలాపాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా పనిగట్టుకొని కొందరు ప్రచారం చేస్తున్నారని గీతాంజలి ఆరోపించారు. ‘మా సంస్థ హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెరి్నంగ్ (హెచ్‌ఐఏఎల్)కు సంబంధించిన అన్ని పత్రాలను సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అందించాం. అయినా ఆయన కార్యకలాపాలపై అనుమానాలు రేకెత్తించేలా ప్రచారం జరుగుతోంది. వాంగ్‌చుక్‌కు మెగసెసె అవార్డు రావటంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఆ అవార్డును తీసుకోవటం తప్పు అన్నట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు? దాదాపు 60 మంది భారతీయులకు మెగసెసె వచ్చింది. వారిలో 20 మందికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులు కూడా ఇచ్చింది. అంటే భారత ప్రభుత్వం దేశద్రోహులకు పద్మ అవార్డులు ఇచ్చిందా?’అని నిలదీశారు. లద్దాఖ్‌లో పాకిస్తాన్ జాతీయులు ప్రవేశించటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంచేశారు.
‘లద్దాఖ్‌లో పాకిస్తానీలు ఉన్నట్లు వాళ్లు (అధికారులు) గుర్తిస్తే.. పొరుగు దేశం వాళ్లను మనదేశంలోకి అక్రమంగా ఎందుకు రానిచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది వాంగ్‌చుక్ కాదు. కేంద్ర హోంశాఖ. 24న హింస జరుగుతున్నప్పుడు వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. ఆ ఘటనకు లద్దాఖ్ అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి’అని స్పష్టంచేశారు.
గత ఏడేళ్లలో వాంగ్‌చుక్ పరిశోధనల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గీతాంజలి తెలిపారు. ‘హెచ్‌ఐఏఎల్ పరిశోధనల ద్వారా ఆవిష్కరించిన సౌరశక్తితో వెచ్చగా ఉండే భవనాలు, ఐస్ స్తూపం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది. గత ఏడేళ్లలో 1,80,000 చదరపు అడుగుల సోలార్ హీటెడ్ భవనాలు నిర్మించారు. వాటివల్ల నెలకు 4,000 టన్నుల కార్బన్ ఆదా అవుతోంది. ఈ సాంకేతికత ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాంటి పనులను మెచ్చుకోకపోతే దేశం విశ్వగురు ఎలా అవుతుంది?’అని ప్రశ్నించారు.