వైభవ్‌ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్‌ చేయండి! | People Standing In Line: Ashwin On Vaibhav Sooryavanshi India Debut | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్‌ చేయండి!

Apr 25 2026 12:58 PM | Updated on Apr 25 2026 1:13 PM

People Standing In Line: Ashwin On Vaibhav Sooryavanshi India Debut

భారత క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడచూసినా వైభవ్‌ సూర్యవంశీ గురించే చర్చ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న ఈ బిహారీ పిల్లాడిని.. త్వరలోనే టీమిండియాకు ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పదిహేనేళ్ల వయసులోనే ఎంతో పరిణతి సాధించిన క్రికెటర్‌లా అతడు షాట్లు బాదడం చూసి ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ సైతం ముచ్చటపడ్డాడు.

ఇక ఇర్ఫాన్‌ పఠాన్‌, క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ వంటి భారత మాజీ క్రికెటర్లు అయితే వీలైనంత త్వరగా వైభవ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు.

తొందరపాటు చర్యే అవుతుంది
రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో అతడు ఏడాదికి కావాల్సినంత ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఎమర్జింగ్‌ టూర్‌, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌, ఇండియా-‘ఏ’ టూర్లకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.

వైభవ్‌ (Vaibhav Suryavanshi)కు ఇది రెండో ఐపీఎల్‌ సీజన్‌. గతేడాది అదరగొట్టిన అతడు.. ఈ ఏడాది కూడా శుభారంభం అందుకుని దానిని కొనసాగిస్తున్నాడు. ఈ పిల్లాడంటే నాకూ ఇష్టమే. అతడు విజయవంతం కావాలని నాలాగే ఎంతో మంది కోరుకుంటున్నారు.

అయితే, వైభవ్‌ విషయంలో తొందరపాటు వద్దనేది నా అభిప్రాయం. ఇప్పటికే యశస్వి జైస్వాల్‌ భారత టీ20 జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కుతుందని అతడు చూశాడు. కానీ అలా జరుగలేదు. జైస్వాల్‌తో పాటు ఎంతోమంది లైన్లో ఉన్నారు.

ప్రియాన్ష్‌ ఆర్య కూడా టీమిండియా తలుపులు బాదుతున్నాడు. ప్రియాన్ష్‌, వైభవ్‌ సూర్యవంశీ.. ఈ ఇద్దరూ ఆసియా ఎమర్జింగ్‌ స్టార్స్‌ టోర్నీలో ఆడారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేస్తే బాగుంటుంది.

సులువుగా క్యాప్‌ దక్కిందే అనే భావన రాకూడదు
వైభవ్‌ విషయంలో ఆలోచించినట్లే అందరి విషయంలోనూ ఆలోచించాలి. వైభవ్‌ను ఐర్లాండ్‌ లేదంటే జింబాబ్వే టూర్‌కు పంపితే మంచిదే. అక్కడ కూడా అతడు రాణిస్తాడనే అనుకుంటున్నా. భిన్నమైన పిచ్‌ పరిస్థితులు అతడికి అలవడతాయి.

ముందుగా చెప్పినట్లు వైభవ్‌ ఒక్కడే కాదు.. మిగతా వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. టీమిండియా క్యాప్‌నకు ఒక విలువ ఉంది. దానిని అందించే తీరు విస్మయంగా మాత్రం ఉండకూడదు. అంటే.. అందరితో పోలిస్తే.. ఆ ఆటగాడికి సులువుగా క్యాప్‌ దక్కిందే అనే భావన రాకూడదు.

వైభవ్‌ టీమిండియాకు ఆడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అతడు ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తేనే బాగుంటుంది. అలా అయితేనే అతడి కెరీర్‌ సుదీర్ఘకాలం కొనసాగుతుంది’’ అని అశ్విన్‌ అన్నాడు.

వైభవ్‌ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్‌ చేయండి!
వైభవ్‌ విషయంలో తొందరపాటు వద్దని.. యశస్వి జైస్వాల్‌, ప్రియాన్ష్‌ ఆర్య వంటి సీనియర్లకు ముందుగా అవకాశం ఇస్తే బాగుంటుందని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా గడ్డపై భారత అండర్‌-19 జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో రాణించిన వైభవ్‌.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో 175 పరుగులతో సత్తా చాటి జట్టును విజేతగా నిలిపాడు.

ఇక ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఇప్పటికి ఏడు ఇన్నింగ్స్‌ పూర్తి చేసుకున్న వైభవ్‌ సూర్యవంశీ.. 254 పరుగులు రాబట్టాడు. టాప్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో టాప్‌-6లో కొనసాగుతున్నాడు. రాయల్స్‌కే చెందిన యశస్వి జైస్వాల్‌ 245 పరుగులు చేయగా.. పంజాబ్‌ స్టార్‌ ప్రియాన్ష్‌ ఆర్య ఐదు మ్యాచ్‌లలో 211 పరుగులు చేశాడు.

చదవండి: అందుకే శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకున్నాం: కేకేఆర్‌ మాజీ కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement