PC: BCCI Twitter
తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే పర్యటనలో ఇరగదీశాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో సహా మొత్తంగా 151 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ వైభవ్ సత్తాచాటాడు.
49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. దీంతో సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రెండు అవార్డులను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ నేపథ్యంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన టీమ్ మేనెజ్మెంట్కు వైభవ్ ధన్యవాదాలు తెలిపాడు.
"నా కల నెరవేరింది. మొదటిసారిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ కోసం తీవ్రంగా శ్రమించాను. హరారే వచ్చిన తర్వాత మేము మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేశాం.
ఇంతకుముందు ఇదే వేదికపై అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాను. ఈ గ్రౌండ్‌లో ఆడడం నాకు చాలా ఇష్టం. అదేవిధంగా కెప్టెన్, కోచ్‌లు, సహచర ఆటగాళ్లందరూ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. వారి వల్లే నేను ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేయగలిగాను. టీ20 క్రికెట్‌లో మొదట నుంచి ఎలా ఆడుతున్నానో.. ఇక్కడ కూడా అదే కొనసాగించాను.
జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం. ఒకసారి కుదురుకున్నాక, ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుగా మలచడానికి ప్రయత్నించాను. సిరీస్ అంతటా ఇదే ప్లాన్‌తో ముందడుగు వేశాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో వైభవ్ పేర్కొన్నాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు మళ్లీ జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో భారత్ తరపున బరిలోకి దిగనున్నాడు.


