‘అందుకే శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకున్నాం’ | Felt bad: KKR Coach Who Let Shreyas Iyer Leave Breaks Silence On Decision | Sakshi
Sakshi News home page

అందుకే శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకున్నాం: కేకేఆర్‌ మాజీ కోచ్‌

Apr 24 2026 3:57 PM | Updated on Apr 24 2026 4:17 PM

Felt bad: KKR Coach Who Let Shreyas Iyer Leave Breaks Silence On Decision

శ్రేయస్‌ అయ్యర్‌ (PC: BCCI)

భారత దేశీ క్రికెట్‌లో కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌కు మంచి పేరుంది.   అతడి మార్గదర్శనంలోనే మధ్యప్రదేశ్‌ తొలి రంజీ టైటిల్‌ అందుకుంది. రంజీ 2021-22 సీజన్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ బాధ్యతలు చేపట్టాడు.

చంద్రకాంత్‌ మార్గ నిర్దేశనం, శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) కెప్టెన్సీలో కేకేఆర్‌ 2024లో చాంపియన్‌గా అవతరించింది. అయితే, వీరి కంటే నాటి మెంటార్‌ గౌతం గంభీర్‌కే క్రెడిట్‌ ఎక్కువగా వచ్చింది. ఇక 2024 తర్వాత కేకేఆర్‌ శ్రేయస్‌ను వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.

ఏకంగా ఫైనల్‌కు
అందుకు తగినట్లుగానే శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి పంజాబ్‌ను గతేడాది ఫైనల్‌కు చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు.. శ్రేయస్‌ను వదులుకున్న కేకేఆర్‌ వరుస పరాజయాలతో డీలా పడి.. విమర్శలు మూటగట్టుకుంటోంది.

ఈ నేపథ్యంలో కేకేఆర్‌ మాజీ హెడ్‌కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకోవడంపై తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ ఆరోజు మేము అతడి సేవలు కోల్పోయాము. శ్రేయస్‌ అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్‌గా కేకేఆర్‌కు ట్రోఫీ అందించాడు.

అతడు జట్టును నడిపించే విధానానికి నేను అభిమానిని. అయితే, కొన్నిసార్లు దీర్ఘకాల ప్రయోజనాలు, వ్యూహాల దృష్ట్యా కొంతమంది ప్లేయర్లను వదులుకోవాల్సి వస్తుంది. నిజానికి ఆరోజు కేకేఆర్‌ కోచ్‌గా నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను.

అందుకే అతడిని వదులుకున్నాము
అయితే, కావాలని మేము అతడిని వదులుకోలేదు. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. శ్రేయస్‌ ఒక్కడినే కాదు.. ఫిల్‌ సాల్ట్‌ వంటి ఆటగాళ్లను కూడా మేము వదిలేశాము. 

ఏదేమైనా కోచ్‌గా ఉన్న సమయంలో కేకేఆర్‌ యజమానులు షారుఖ్‌ ఖాన్‌, జూహీ చావ్లా, జై మెహతా, సీఈఓ వెంకీ మైసూర్‌ నాకు అండగా ఉన్నారు’’ అని చంద్రకాంత్‌ పండిట్‌ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.

కాగా 2025 సీజన్‌ తర్వాత చంద్రకాంత్‌ పండిట్‌కు ఉద్వాసన పలికిన కేకేఆర్‌.. 2026కు గానూ అభిషేక్‌ నాయర్‌ను హెడ్‌కోచ్‌గా ప్రకటించింది. గతేడాది అజింక్య రహానే కెప్టెన్సీలో పద్నాలుగింట కేవలం ఐదు గెలిచిన కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. 

చదవండి: ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?

Advertisement
 
Advertisement
Advertisement