ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు? | Akash Ambani Walks Out Signals Fans To Leave CSK Beat MI By 103 Runs | Sakshi
Sakshi News home page

ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?

Apr 24 2026 1:14 PM | Updated on Apr 24 2026 2:48 PM

Akash Ambani Walks Out Signals Fans To Leave CSK Beat MI By 103 Runs

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. గత మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై 99 పరుగుల తేడాతో గెలిచిన హార్దిక్‌ సేన.. అదే జోరు కొనసాగించలేకపోయింది. సొంత మైదానం వాంఖడే వేదికగా గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా సీజన్‌లో ఏడింట ఐదో పరాజయాన్ని నమోదు చేసింది.

సంజూ సెంచరీతో గెలిపించాడు
టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అడపాదడపా వికెట్లు తీసినా.. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆచితూచి ఆడుతూనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. తిలక్‌ వర్మ (29 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యకుమార్‌ (30 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించారు. అకీల్‌ హొసీన్‌కు 4 వికెట్లు దక్కాయి.

ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ
ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆది నుంచే తడబడటం తీవ్ర ప్రభావం చూపింది. ఓపెనర్లు డానిష్‌ మలేవార్‌ (0), క్వింటన్‌ డికాక్‌ (7).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నమన్‌ ధిర్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. సూర్య, తిలక్‌ కాసేపు పోరాడిన ఫలితం లేకుండా పోయింది. మిగిలిన వారిలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా 1, రూథర్‌ఫర్డ్‌ 0, శార్దూల్‌ ఠాకూర్‌ 6, క్రిష్‌ భగత్‌ 7, జస్‌ప్రీత్‌ బుమ్రా 2 పరుగులు చేశారు.

ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం
ఈ క్రమంలో వరుసగా వికెట్లు పడుతూ.. ఓటమి దిశగా ముంబై వెళ్తున్న వేళ.. ఆ జట్టు యజమాని ఆకాశ్‌ అంబానీ తీవ్రంగా స్పందించారు. బ్లూ సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చేస్తూ స్టేడియాన్ని వీడారు. 

ఆ సమయంలో మైదానంలోని ఆటగాళ్ల వైపు ఆకాశ్‌ అంబానీ కోపంగా చూసినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఐపీఎల్‌ చరిత్రలో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి. అందుకే ఆకాశ్‌ అంబానీ ఎన్నడూ లేని విధంగా అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.

చదవండి: PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌

Advertisement
 
Advertisement
Advertisement