PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌ | BCB Withdraws NOCs for Mustafizur Nahid Rana for Remainder PSL 2026 | Sakshi
Sakshi News home page

PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌

Apr 24 2026 12:04 PM | Updated on Apr 24 2026 12:15 PM

BCB Withdraws NOCs for Mustafizur Nahid Rana for Remainder PSL 2026

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో కొనసాగేందుకు తమ ఇద్దరు ప్రధాన ఆటగాళ్లకు ఇచ్చిన నిరంభ్యంతర పత్రాల్ని (NOC) రద్దు చేసింది. కాగా ఐపీఎల్‌-2026 నుంచి తొలగించిన తర్వాత బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ పీఎస్‌ఎల్‌లో చేరిన సంగతి తెలిసిందే.

జట్టు విజయాల్లో కీలక పాత్ర
లాహోర్‌ ఖలందర్స్‌తో జట్టుకట్టిన ముస్తాఫిజుర్‌.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోసం ముస్తాఫిజుర్‌ను బీసీబీ వెనక్కి పిలిపించింది. 

కానీ గాయం వల్ల అతడు మొదటి రెండు వన్డేలకు దూరం కాగా.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో బరిలోకి దిగాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టుకు విజయం అందించడంలో తోడ్పడ్డాడు.

పీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడడు
అయితే, ఈ మ్యాచ్‌ తర్వాత బీసీబీ కీలక ప్రకటన చేసింది. పీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ముస్తాఫిజుర్‌ రహమాన్‌ పంపబోమని తెలిపింది. ఫిట్‌నెస్‌ సమస్యల భయం దృష్ట్యా అతడికి ఇచ్చిన NOCని రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB)కి సమాచారం ఇచ్చింది.

కాగా తొలుత మార్చి 26- ఏప్రిల్‌ 12 వరకు... తర్వాత ఏప్రిల్‌ 24- మే 3 వరకు ముస్తాఫిజుర్‌కు బీసీబీ NOC జారీ చేసింది. ఇక ముస్తాఫిజుర్‌తో పాటు మరో పేసర్‌ నహీద్‌ రాణా NOCని కూడా బీసీబీ రద్దు చేయడం గమనార్హం. 

నహీద్‌ రాణా NOC కూడా రద్దు
కాగా నహీద్‌ రాణా పీఎస్‌ఎల్‌లో పెషావర్‌ జెల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరగా.. వన్డే సిరీస్‌ ఆడేందుకు నహీద్‌ స్వదేశానికి తిరిగి వచ్చాడు.

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు నహీద్‌. అయితే, అతడిని కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు బీసీబీ. దీంతో పీఎస్‌ఎల్‌లో ప్లే ఆఫ్స్‌ ఆడేందుకు నహీద్‌ వెళ్తాడని భావించగా.. బీసీబీ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. 

కారణం ఇదే
పీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు రాడని స్పష్టం చేసింది. కాగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు నహీద్‌ను సన్నద్ధం చేసేందుకే బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా పీఎస్‌ఎల్‌లో తమదైన ముద్రవేస్తూ లీగ్‌కు కాస్త ఊపు తెచ్చిన ఇద్దరు ప్లేయర్లను కీలక సమయంలో తప్పించడం ద్వారా బీసీబీ.. పీసీబీకి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో బంగ్లా కైవసం చేసుకుంది. అంతకుముందు వెస్టిండీస్‌, పాకిస్తాన్‌లపై కూడా వన్డే సిరీస్‌లు గెలిచి సత్తా చాటింది. 

చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement