అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటనకు కొత్త తేదీలు ఫిక్స్ చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. వాస్తవానికి ట్రంప్ ఈ నెలలోనే ( మార్చి) చైనాలో పర్యటించాల్సి ఉండగా యుద్ధం నేపథ్యంలో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మేలో చైనా వెళ్లనున్నట్లు తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన నూతన తేదీలను వైట్‌హౌస్ ప్రకటించింది. మే 14, 15 తేదీల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ కానున్నట్లు తెలిపింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.."యుద్ధం మరో నాలుగు నుండి ఆరు వారాల్లో ముగియవచ్చు. ట్రంప్ చైనా వెళ్లే సమయానికి పరిస్థితులు చక్కబడతాయి". అని అన్నారు.
కాగా చైనా పర్యటనపై గతవారం ట్రంప్ స్పందించారు. "మేము చైనాతో కలిసి పనిచేస్తున్నాము. నేను చైనా అధ్యక్షున్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. ఆయన కూడా నన్ను కలవాలని ఎదురుచూస్తాడు అనుకుంటా "అని అన్నారు. ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో మూతపడింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కాగా ఈ మార్గాన్ని రక్షించడానికి సైనిక సహాయం అందించాలని ట్రంప్ చైనాను సహాయం కోరతున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు. అధిక పన్నుల ప్రకటన తర్వాత తొలిసారిగా ఇరు దేశాల అధినేతలు భేటీ అవతుండడంతో ఇరు దేశాల వాణిజ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


