చందంపేట : ఓ వ్యక్తితో ఘర్షణలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వివరాలు.. నేరెడుగొమ్ము మండలం జోడుబాయితండాకు చెందిన కేతావత్ లచ్చు(30) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కూలీ పనితో పాటు ఊళ్లో చిన్న కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం అదే గ్రామానికి చెందిన కేతావత్ శ్రీకాంత్‌తో లచ్చుకు ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కర్రతో దాడి చేయగా లచ్చు, అతడి భార్య అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం లచ్చును నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపారు. ఈ ఘటనతో జోడుబాయితండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ బీసన్న ఆధ్వర్యంలో చందంపేట ఎస్‌ఐ లోకేష్, డిండి ఎస్‌ఐ బాలకృష్ణ, నేరెడుగొమ్ము ఎస్‌ఐ నాగేంద్రబాబు, నాంపల్లి, మర్రిగూడ ఎస్‌ఐలు, దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి బందోబస్తు చేపట్టారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో
ఒకరికి జైలుశిక్ష
● మరో నలుగురికి జరిమానా
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని సోమవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం తెలిపారు. వారిలో ఒకరికి రెండు రోజుల జైలుశిక్ష,, రూ.2300 జరిమానా, మరో నలుగురికి కలిపి రూ.4 వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం అర్చకులు చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబందనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని జరిపారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా, క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు.


