
భారత్‌కు చిరకాల మిత్ర దేశం, పొరుగు దేశమైన నేపాల్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. అవినీతితో పాటు సోషల్ మీడియాపై నిషేధాలతో మొదలైన ప్రజాగ్రహానికి ప్రధాని సహా ప్రభుత్వం మొత్తం దాసోహమైపోయింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రధాని , దేశాధ్యక్షుడు సహా రాజీనామా చేసేశారు. ఈ నేపధ్యంలో ఆ దేశ ప్రధానిగా బాలేంద్ర షా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖాట్మాండు మేయర్‌గా ఉన్న బాలేంద్ర కు యువతలో ఉన్న ఆదరణ, ఆయనను ప్రధానిగా కోరుకుంటున్న వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో తదుపరి ప్రధాని ఆయనే అనే ఆలోచన బలపడుతోంది.
ఈ నేపధ్యంలో కాబోయే ప్రధానిగా పేర్కొంటున్న బాలేంద్ర షా కు భారత్ తో ఉన్న వైరుధ్యాలు ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఆయన రెండేళ్ల క్రితం భారత సినిమాలపై చూపించిన అవసరానికి మించిన ఆగ్రహం ప్రస్తావనార్హంగా మారింది. రెండేళ్ల క్రితం ఖాట్మండు మేయర్ హోదాలో ఆయన ఖాట్మాండు నగరంలో భారతీయ సినిమాల ప్రదర్శనలను నిలిపేయాలని ఆదేశించారు. దాంతో ఖాట్మాండు మెట్రోపాలిస్‌తో పాటు, పోఖారా మెట్రోపాలిటన్ నగరం కూడా భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది.
ఈ విషయంలో పోఖారా మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా బాలేంద్ర షా మార్గాన్నే అనుసరిస్తూ బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని మధ్య నేపాల్‌లోని మెట్రోపాలిటన్ నగరంలోని సినిమా హాళ్లను ఆదేశించారు. రెండు మెట్రోపాలిటన్ నగరాల మేయర్ల ఆదేశాల తర్వాత, అక్కడ సినిమా హాళ్లు హిందీ లేదా బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను రద్దు చేసి, వాటి స్థానంలో హాలీవుడ్ నేపాలీ సినిమాలను అప్పటికప్పుడు ప్రవేశపెట్టాయి. ఇంతకీ ఇలా బాలీవుడ్ చిత్రాలపై నేపాల్ మేయర్ల ఆగ్రహానికి కారణమైంది టాలీవుడ్ రెబల్ స్టార్ నటించిన ఆదిపురుష్ సినిమా కావడం విశేషం.
దీనికి కారణాలను బాలేంద్ర షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘భారతీయ చిత్రం ఆదిపురుష్ చూశాను. ఆ సినిమాలో రాముని సతీమణి జానకి జన్మ స్థలంపై తప్పు సమాచారం ఉంది . అందులో ఆమెను భారతదేశపు కుమార్తె అని చెప్పే సంభాషణ ఉంది (నేపాలీయులు సీతమ్మ తమ నేలపైనే జన్మించినట్టు విశ్వసిస్తారు), ఇది సరికాదని, అభ్యంతరకరమైనదని మేం వారి దృష్టికి తీసుకెళ్లాం. తప్పును సరిదిద్దడానికి 3 రోజుల సమయంతో అల్టిమేటం ఇచ్చాము. అయినా వారు పట్టించుకోలేదు. నేపాల్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఆత్మగౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం ద్వారా జాతీయ ప్రయోజనాలను కాపాడటం ప్రతి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వేతర రంగం నేపాలీ పౌరుడి ప్రథమ కర్తవ్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు‘ అని ఖాట్మండు మేయర్ అప్పట్లో తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అయితే ఆ తర్వాత నేపాలీ రాజధానిలో ప్రదర్శనపై నిషేధం నేపధ్యంలో, ’ఆదిపురుష్’ నిర్మాణ సంస్థ ’టి–సిరీస్’ నేపాలీ మేయర్‌కు లేఖ రాసింది. అనంతరం సినిమాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశాలిస్తూ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్ధుమణిగింది.