న్యూఢిల్లీ: నేపాల్‌తో తలెత్తిన సరిహద్దు వివాదం పరిష్కారంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం పరిష్కారానికి యూకే, చైనాల జోక్యం కోరామంటూ నేపాల్ ప్రధాని బాలేన్ షా చేసిన ప్రకటనపై ఈ మేరకు స్పందించింది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన.. ‘భారత్, నేపాల్‌లు సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాయి. అంతేకాదు, 98% మేర సరిహద్దుల డీమార్కేషన్ కూడా పూర్తయింది కూడా. లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ ప్రాంతాలపై మాత్రమే చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లో భాగమేనని భారత్ మొదటి నుంచీ చెబుతోంది’ అని జైశ్వాల్ వివరించారు.
అంతకుముందు.. భారత్‌తో సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధానమంత్రి బాలేన్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంగళవారం ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలకు దిగడంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ప్రతినిధుల సభ– దిగువ సభ ఈ నెల 8వ తేదీ వరకు, నేషనల్ అసెంబ్లీ బుధవారం వరకు వాయిదా పడ్డాయి. భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా పలు ప్రాంతాల్లో భారత భూభాగాలను స్వాధీనం చేసుకుంది’ అంటూ ప్రధాని బాలేన్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.
ఈ వ్యవహారంపై చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణుల సలహా తీసుకుని ఒక పరిష్కారం కనుగొంటామని, ఈ విషయంలో చైనా, యూకేల సాయం కూడా తీసుకుంటామని ఆయన ప్రకటించారు. మంగళవారం దిగువసభలో స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోలేదు. ప్రధాని బాలేన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, పార్లమెంట్ రికార్డుల నుంచి వాటిని తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో, స్పీకర్ ఈ నెల 8వ తేదీ వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


