శరవేగంగా నేపాల్‌ సంస్కరణలు | Sakshi Guest Column On Nepal reforms are accelerating | Sakshi
Sakshi News home page

శరవేగంగా నేపాల్‌ సంస్కరణలు

Apr 23 2026 12:53 AM | Updated on Apr 23 2026 12:53 AM

Sakshi Guest Column On Nepal reforms are accelerating

విశ్లేషణ

నేపాల్‌లో మార్చి 27న ఏర్పడిన బాలేంద్ర షా ప్రభుత్వం నెల రోజులైనా పూర్తి కాకముందే ప్రవేశపెడుతున్న పరిపాలనా సంస్కరణలను గమనించినపుడు, ఇంతటి వేగం ఆచరణలో సాధ్యమయేనా అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. రబీ లమిఛానే అధ్యక్షతన గల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) దేశ చరిత్ర లోనే ఎన్నడూ లేనంత మెజారిటితో గెలిచి, పాత పార్టీలన్నింటిని అక్షరాలా ఊడ్చిపెట్టిన స్థితిలో, ప్రధాని బాలేన్‌ ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్న మాట నిజం. అది తెలిసినందువల్లనే, 27న ప్రమాణ స్వీకారం తర్వాత రెండు రోజు లకు 29న జరిగిన మొదటి క్యాబినెట్‌ సమా వేశంతోనే ఆరంభించి వరుసగా అనేక చర్యలు తీసుకోవటం కనిపిస్తున్నది.

100 అంశాల ప్రణాళిక
మనకు తెలిసిన ప్రజాస్వామ్యాన్ని, పరిపాలనను దృష్టిలో పెట్టు కుని చూసినపుడు ఆ చర్యలలో కొన్ని ఆశ్చర్యకరంగా తోస్తాయి. ఉదాహరణకు పరిపాలన వేగంగా, సమర్థవంతంగా సాగేందుకు, సామాన్యులకు కూడా ఉపయోగకరంగా ఉండేందుకు మొదటి క్యాబి నెట్‌ సమావేశంలోనే 100 అంశాల ప్రణాళిక ప్రకటించారు. వాటి అమలు తీరును ఎవరైనా సరే గమనించేందుకు ప్రత్యేకంగా వెబ్‌ సైట్‌ను సృష్టించారు. ఆ తర్వాత, 18 అభివృద్ధి రంగాలపై పూర్తి దృష్టి పెట్టి పనిచేయగలమంటూ 18 అంశాలతో ‘నేషనల్‌ కమిట్‌ మెంట్‌ డాక్యుమెంట్‌’ పేరిట ముసాయిదా పత్రాన్ని విడుదల చేసి, దానిపై పార్టీలు, సంస్థలు, మేధావులు, ప్రజల సూచనలను కోరారు. విశేషం ఏమంటే, ఓడిపోయిన పార్టీల మేనిఫెస్టోలలోని ముఖ>్యంశాలను కూడా ఈ డాక్యుమెంట్‌లో చేర్చారు. ఆ పార్టీల నాయకులు నలుగురికి కూడా ఒక కమిటీలో స్థానం కల్పించారు. దానిని బట్టి, నేపాల్‌ అధికార పక్షంతోపాటు యువ ప్రధాని ఆలోచనల తీరును అర్థం చేసుకోవచ్చు. ఇది ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన కొన్ని ప్రజాస్వామిక ప్రయోగాలను గుర్తు చేస్తున్నది. రాజీవ్‌ గాంధీ ప్రధాని అయినప్పుడు ఈ స్థాయి మార్పులైతే చేయలేదు గానీ, ముఖ్యమైన విధానపర అంశాలపై ప్రతిపక్షాలను సంప్రదించే పద్ధతిని ప్రవేశపెట్టి ప్రశంసలు పొందారు. తదనంతర పరిణామాల వల్ల అంతా భంగపడిందన్నది వేరే విషయం. 

అప్పుడే తప్పుకున్న ఇద్దరు మంత్రులు
జెన్‌–జీ ఉద్యమం నేపాల్‌ రాజకీయ వ్యవస్థను అంతగా కుదిపి వేయటానికి ఒక ముఖ్య కారణం అవినీతి అన్నది తెలిసిందే. ఆ దృష్ట్యా, అవినీతిని అన్ని స్థాయుల్లో అరికట్టగలమన్నది ఆర్‌ఎస్‌పీ ఇచ్చిన హామీ. అందుకు అనుగుణంగా, ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండు వారాలలోనే ప్రధాని సహా మంత్రులంతా తమ ఆస్తులను ప్రకటించారు. రాజును 2006లో పడగొట్టగా, అప్పటినుంచి నేటి వరకు రాజు జ్ఞానేంద్రతో పాటు అందరు మాజీ ప్రధానులు,మంత్రులు, సీనియర్‌ నాయకులు, సీనియర్‌ అధికారుల ఆస్తులపై దర్యాప్తు కోసం కమిషన్‌ను నియమించారు. అంతలోనే ఒక నిర్ణయం దేశాన్నంతా ఆశ్చర్యపరిచింది. కేవలం మూడు వారాల క్రితం నియమితుడైన కార్మిక మంత్రి దీపక్‌ కుమార్, ఒక పని చేయని ఆరోగ్య బీమా బోర్డులో అధికారి అయిన తన భార్యను కొనసాగించేందుకు అధికార దుర్వినియోగం చేశారంటూ వెంటనే క్యాబినెట్‌ నుంచి తొలగించారు. ఆ దుర్వినియోగాన్ని పట్టించుకోనందుకు ఆరోగ్యమంత్రి నిషా మెహతాకు హెచ్చరికలు జారీ చేశారు. 

ఈ కొద్ది రోజులలోనే మనీ లాండరింగ్‌ కేసులో మాజీ ప్రధాని దేవుబా దంపతులకు కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేయగా, కొద్దిమంది పెద్ద వ్యాపారులను అరెస్టు చేశారు. ఇది అనుమానించే కావచ్చు దేవుబా దంపతులు చికిత్స కోసమంటూ ముందే విదేశా లకు వెళ్లారు. (ఏప్రిల్‌ 22న ఏకంగా హోంమంత్రి సుధన్‌ గురుంగ్‌ రాజీనామా చేయడం మరో సంచలనమైంది. తన పెట్టుబడుల మీద తలెత్తిన ప్రశ్నల మీద నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగానే పదవి నుంచి తప్పుకున్నట్టు ఆయన వెల్లడించారు.) పరిపాలనా పరంగా తీసుకున్న ఒక ప్రధానమైన చర్య, ఫెడర లిజం సక్రమంగా అమలయ్యేందుకు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బాలేన్‌ జరిపిన చర్చలు. వారిలో అన్ని పార్టీల వారున్నారు. వాస్తవానికి ఫెడరలిజం ఏర్పాట్లు రాజ్యాంగంలో 2015 నుంచి ఉన్నాయి. కానీ వాటిని ఏరికోరి చేర్చిన కాంగ్రెస్, కమ్యూ నిస్టు, మావోయిస్టు పార్టీలు ఏవీ అమలుపరచలేదు. అందుకిపుడు పదేళ్ల తర్వాత మోక్షం లభిస్తున్నది. ప్రధానితో జరిగిన చర్చలలో ఆ ముఖ్యమంత్రులంతా తమకు చట్టపరమైన, ఆర్థికపరమైన, శాంతి భద్రతలపరమైన అధికారాలు సవ్యంగా లభించలేదని చెప్పారు.

అమలులో ఎదురయ్యే సవాళ్లు
18 అంశాల ‘కమిట్‌మెంట్‌ డాక్యుమెంట్‌’ గమనిస్తే, వాటిలో వ్యవసాయం, విద్యుత్తు, గనులు, మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక రంగం, టూరిజం, పౌర విమానయానం వంటి ఆర్థికాభి వృద్ధిపరమైనవి కనిపిస్తాయి. అవిగాక ఉద్యోగ – ఉపాధి కల్పన, విద్య, వైద్యం, పరిపాలనా సంస్కరణలు; పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం మొదలైనవి ఉన్నాయి. దేనికైనా నిధులు తప్పని సరి కాగా, ఆ కొరత నేపాల్‌కు ఎక్కువే. వారికి గల తీవ్రమైన కొరతలు సహజ వనరులు, పరిశ్రమలు, ఉత్పత్తి రంగం, ప్రైవేట్‌ పెట్టుబడులు పరిమితం కావటం. అయితే, ఇంతకుముందువలెగాక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, అధికార పక్షం పట్టుదల చూపటం, అవినీతిని నియంత్రిస్తుండటం వల్ల బయటినుంచి సంస్థాగతంగా, ప్రైవేట్‌ రంగం నుంచి, ప్రభుత్వాల నుంచి తోడ్పాటు లభించే అవకాశాలున్నాయి.

ప్రత్యేకంగా నిధులతోగానీ, క్రమంగా జరగవలసిన అభివృద్ధితో గానీ సంబంధం లేని చర్యలు కొన్ని 100 అంశాల ప్రణాళికలో ఉన్నాయి. అవి సాధారణ పరిపాలనాపరమైనవి. ఉదాహరణకు ఆస్తుల వెల్లడి, అవినీతిపై దర్యాప్తులు, విద్యా సంస్థలలో పార్టీ అనుబంధ యూనియన్ల రద్దు, ప్రైవేటు ఆసుపత్రులలో 10 శాతం పడకలు పేదలకు ఉచితంగా కేటాయింపు, ప్రజావసరాలు, సర్వీ సులు వారి గుమ్మం వద్దకే చేరటం వంటివి. ఇవి అమలైనకొద్దీ ఒకవైపు ప్రభుత్వంపట్ల ప్రజలకు నమ్మకం పెరగటం, వారి జీవి తాలు మెరుగు పడటం జరుగుతుంది.బాలేంద్ర షా కాఠ్మండూ మేయర్‌గా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చేసిన అభివృద్ధి పనులు, తను అవినీతిపరుడు కాకపోవటం ఈ ఎన్నికలలో బాగా కలిసి రావటం తెలిసిందే. ఆర్‌ఎస్‌పీ అధ్యక్షుడు రబీ లమీఛానేకు కూడా ముక్కుసూటి మనిషి, మంచి వక్త, సమ ర్థుడనే పేరున్నది. ఇద్దరూ ఇంతకాలం పాత పార్టీలను, వాటి అక్రమాలను వ్యతిరేకించినవారు. అందువల్ల జాగ్రత్తగా, ఇదే పట్టుదలతో వ్యవహరించినట్లయితే నేపాల్‌ ముఖచిత్రం క్రమంగా మారగలదని చెప్పవచ్చు.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement
 
Advertisement
Advertisement