నేపాల్‌లో కొత్త ప్రభుత్వ పాలన అదుర్స్‌ కదూ..? | Nepal governance and Home Minister Sudan Gurung resigns | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో కొత్త ప్రభుత్వ పాలన అదుర్స్‌ కదూ..?

Apr 22 2026 4:55 PM | Updated on Apr 22 2026 6:04 PM

Nepal governance and Home Minister Sudan Gurung resigns

కాఠ్మాండు: నేపాల్‌లో ప్రస్తుతం ఏం జరుగుతోంది? కొత్త ప్రభుత్వం ప్రజల అంచనాలకు తగ్గట్లే వ్యవహరిస్తోందా? ఎన్నెన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు నేపాల్‌ ప్రజలు. ఆ దేశంలో కొన్ని నెలల క్రితం ఉవ్వెత్తున ఎగిసిన జెన్‌ జీ ఉద్యమం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ కుదేలు అవ్వడం, ప్రభుత్వంలో అవినీతి వంటి పలు అంశాలు జెన్‌ జీ ఉద్యమానికి కారణమయ్యాయి.

ఆ తర్వాత జెన్‌ జీ నిరసనలతో రాజకీయాల్లోకి ప్రవేశించారు రాపర్‌ బాలేంద్ర షా (బాలెన్). నేపాల్ ప్రధాని అయ్యారు. ప్రభుత్వంలో పారదర్శకత, విద్యా సంస్కరణలు, వీఐపీ సంస్కృతి తొలగింపు వంటి చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. చెప్పినట్లుగానే ప్రభుత్వంలో పారదర్శకత పెంచుతున్నారు. ఏప్రిల్ 9న లేబర్, ఎంప్లాయ్‌మెంట్, సోషల్ సెక్యూరిటీ మంత్రి దీపక్ కుమార్ సాహ్‌ను క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై పదవి నుంచి తొలగించారు.

నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్ బుధవారం (ఏప్రిల్‌ 22) తన పదవికి రాజీనామా చేశారు. తన ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ, న్యాయంగా దర్యాప్తు జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని భావించి స్వచ్ఛందంగా పదవిని వదులుకున్నారు. దీంతో బాలేంద్ర షా నిజంగానే జవాబుదారీతనంతో ఉంటున్నారని, ప్రభుత్వానికి అవినీతి మచ్చ అంటనివ్వట్లేదని విశ్లేషకులు అంటున్నారు.  

నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్ బుధవారం తన పదవి నుంచి రాజీనామా చేశారు, తన ఆర్థిక ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై నైతిక బాధ్యత స్వీకరించి, దర్యాప్తు న్యాయంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాజీనామా విషయాన్ని ప్రకటిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. ప్రజా జీవితంలో నైతిక ప్రమాణాలు నిలబెట్టేందుకు పదవి నుంచి తప్పుకున్నట్టు చెప్పారు.

"నేను, సుదాన్ గురుంగ్‌ను.. 2026 మార్చి 26 నుంచి హోం మంత్రిగా అత్యంత నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఇటీవల నా షేర్లు, సంబంధిత విషయాలపై పౌరులు లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు, ఆందోళనలను నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. నా దృష్టిలో నైతిక విలువలు అన్ని పదవులకన్నా ఎక్కువ. ప్రజా విశ్వాసానికి మించిన శక్తి లేదు. నేటి 'జెన్ జీ' ఉద్యమం కూడా ఇదే సందేశం ఇస్తోంది. ప్రజా జీవితం స్వచ్ఛంగా ఉండాలి, నాయకత్వం బాధ్యత వహించాలి" అని చెప్పారు. దేశ రాజకీయ నేపథ్యం, గతంలో జరిగిన త్యాగాలను ప్రస్తావిస్తూ.. ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత తప్పనిసరి అని అన్నారు.

తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. పారదర్శకత ఉండేందుకు, ఒకే వ్యక్తికి రెండు విరుద్ధ ప్రయోజనాలు ఉండే పరిస్థితి లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఓ వైపు తాను పదవిలో ఉండి, మరోవైపు తనపై దర్యాప్తు జరిగే విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందన్నారు. అందుకే నేటి నుంచే హోం మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.

పౌరులు, మీడియా, యువత నిజాయితీ, బాధ్యతాయుత మార్గంలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. "నా నైతిక బాధ్యతను నేను పూర్తి చేశాను. ఇప్పుడు నా మీడియా స్నేహితులు, నేపాల్ సోదరులు, సోదరీమణులు, యువత అందరూ సత్యం, నిజాయితీ, ఆత్మశుద్ధి మార్గంలో నడవాలి. కొన్ని మీడియా వ్యక్తులు పొందిన 'స్వీట్ షేర్లు' (ప్రత్యేక లాభాల కోసం ఇచ్చే వాటాలు) గురించి సమాచారం త్వరలో బయటపడుతుంది. రామ రాజ్యం కోరుకునేవారు త్యాగం చేయడానికి, నైతిక ధైర్యం చూపడానికి సిద్ధంగా ఉండాలి" అని అన్నారు.

ఏప్రిల్ 9నే మరో మంత్రి ఔట్‌ 
ఇంతకుముందు ఏప్రిల్ 9న నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా.. మంత్రి దీపక్ కుమార్ సాహ్‌ను క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై, పదవి నుంచి తొలగించారు. ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన ప్రకారం.. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు సాహ్‌ను తొలగించారు. కమిషన్ అధ్యయనం ప్రకారం.. తన పదవిని దుర్వినియోగం చేసి, తన భార్య జును శ్రేష్ఠాను హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డు సభ్యురాలిగా కొనసాగించారు. ఆ పదవి చాలా కాలంగా నిర్వీర్యంగా ఉంది. కమిషన్ తన నివేదికను పార్టీకి సమర్పించి, చర్యలు తీసుకోవాలని సూచించింది.

దీంతో బాలేంద్ర షా తన మంత్రివర్గంలో అవినీతి జరగకుండా చూసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. జెన్‌ జీ కోరుకున్న అంశాల్లో ఇది ప్రధానం. గత ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి, జవాబుదారీతనంలో ఉండేవి కాదు. దేశ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయినా మంత్రులు తమ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పటి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కావట్లేదు. అప్పుడే పాలనలో పారదర్శకతను చూపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement