మార్కెట్ పై క్రూసేడ్! | Asian markets crash as crude oil price hits | Sakshi
Sakshi News home page

మార్కెట్ పై క్రూసేడ్!

Mar 10 2026 2:39 AM | Updated on Mar 10 2026 2:39 AM

Asian markets crash as crude oil price hits

చమురు కలకలం... బేర్‌ ‘విశ్వ’ రూపం...

క్రూడ్‌ ధర 30 శాతం హైజంప్‌ 

సెన్సెక్స్‌ 1,353 పాయింట్లు పతనం 

తొలుత అన్నివైపులా అమ్మకాలు

ఇంట్రాడేలో 2,494 పాయింట్లు డౌన్‌ 

ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ డీలా

422 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమనడంతో దేశీయంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. పశ్చిమాసియాలో చమురు క్షేత్రాలపై దాడులతో చమురు ధరలు తొలుత పీపాకు 30 శాతంపైగా ఎగశాయి. దీంతో ప్రారంభంలో 2,494 పాయింట్లకుపైగా పడిపోయిన సెన్సెక్స్‌ చివరికి 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద ముగిసింది. మొదట్లో 753 పాయింట్లు పతనమైన నిఫ్టీ సైతం.. చివరికి  422 పాయింట్ల క్షీణతతో 24,028 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 76,425 దిగువకు చేరగా.. నిఫ్టీ 23,698 వద్ద కనిష్టాన్ని తాకింది. దీంతో ఒక్క రోజులో బీఎస్‌ఈ మార్కెట్‌ విలువలో రూ. 8 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. 

ధరల మంట... 
లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ ధర ఉదయం 120 డాలర్లను తాకింది. న్యూయార్క్‌లో లైట్‌ స్వీట్‌ క్రూడ్‌ సైతం 119.5 డాలర్లకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళనలు తలెత్తాయి. వెరసి దాదాపు అన్ని రంగాలలోనూ అమ్మకాలకు పరుగుతీశారు. అయితే మిడ్‌సెషన్‌కల్లా చమురు ధరలు కాస్త ఉపశమించాయి.  మరోపక్క యూఎస్‌ మార్కెట్ల ఫ్యూచర్స్‌ నష్టాలు సైతం సగానికి తగ్గాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొంతమేర రికవరీ కనిపించింది. గత వారం నైమెక్స్‌ క్రూడ్‌ 36 శాతం, బ్రెంట్‌ 28 శాతం జంప్‌ చేయడం తెలిసిందే. 

అమ్మకాల షాక్‌: ఎన్‌ఎస్‌ఈలో ఐటీ నష్టపోకుండా నిలదొక్కుకోగా.. ఆటో, పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్, మెటల్, కన్జూమర్‌ డ్యురబుల్స్, ఆయిల్‌అండ్‌ గ్యాస్, కెమికల్స్‌ 4–2% మధ్య పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, టీఎంపీపీ, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఐషర్, బజాజ్‌ ఆటో, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ, కొటక్‌ బ్యాంక్‌ 5.3–3.5% మధ్య పతనమయ్యాయి. అయితే విప్రో, ఆర్‌ఐఎల్, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌ 1.6–0.6 మధ్య బలపడ్డాయి.   

చిన్న షేర్లు డీలా బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 
2 శాతంపైగా నీరసించాయి. చమురు మంటతో టైర్లు, ఆటోమొబైల్, పెయింట్లు, ఎయిర్‌లైన్స్, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ధరలకు  రెక్కలురానుండటంతో ఆర్‌బీఐ కఠినతర విధానాలవైపు మొగ్గు చూపవలసి వస్తుందని తెలియజేశారు. దీంతో బ్యాంకింగ్‌ కౌంటర్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆసియా, యూరప్‌ మార్కెట్లు సైతం బలహీనపడటం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. 

చమురు సెగతో 
చమురు దెబ్బకు ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ 6–4.3% మధ్య పడిపోయాయి. షాలిమార్, ఇండిగో, ఏషియన్, నెరోలాక్, బెర్జర్‌ పెయింట్స్‌ 4–2% మధ్య, జేకే, సియట్, ఎంఆర్‌ఎఫ్, అపోలో టైర్స్‌ 6–2% మధ్య క్షీణించాయి. ఏటీఎఫ్‌ వ్యయాలపై భయాలతో ఇంటర్‌గ్లోబ్‌ 4 శాతం పడింది.

ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
యుద్ధ భయాలతో ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాల యూటర్న్‌ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 9,014 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్‌పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement