
గాజా శాంతి ఒప్పందంపై సంతకం తర్వాత ట్రంప్ వ్యాఖ్య
ఎన్నో నిబంధనలు, షరతులు పొందుపరిచామని వెల్లడి
ఈజిప్ట్ వేదికగా ముగిసిన శాంతి శిఖరాగ్ర సదస్సు
షర్మ్ ఎల్ షేక్(ఈజిప్ట్): గాజాలో శాంతి వీచికలు మొదలయ్యాక ఆ శాంతిని శాశ్వతంగా సుస్థిరం చేసేందుకు మొదలైన ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలుచేశారు. ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పంలోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో పలువురు యూరప్ దేశాలు, పశి్చమాసియా దేశాల అగ్రనేతల సమక్షంలో శాంతి శిఖరాగ్ర సదస్సులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ సంతకంచేశారు. ఆయనతోపాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసీ, ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా అగ్రనేతల సమక్షంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇది చరిత్రాత్మకమైన ఒప్పందం. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు నెరవేరాయి. మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కియేలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మధ్యవర్తిత్వం విషయంలో ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసి అద్భుతంగా వ్యవహరించారు. మీరు నమ్ముతారో లేదో తెలీదుగానీ అసలు ఈ వివాదం 500 నుంచి మూడువేల సంవత్సరాల నాటిది అని అనుకుంటున్నా. ఇప్పటికి ఓ కొలిక్కి వచి్చంది. ఇంకా ఇందులో ఎంతో సంక్లిష్టత ఉంది. ఈ ఒప్పందం అత్యంత చిక్కుముళ్లతో కూడుకుంది.
ఎన్నో నిబంధనలు, షరతులను పొందుపరిచాం. వాస్తవానికి పశ్చిమాసియాలో ఈ యుద్ధం చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చాలా మంది భావించారు. ఇకపై అలాంటిదేమీ ఉండబోదు. నేను గతంలో ఎన్నో సంక్లిష్టమైన సమరాలు, సమస్యలను పరిష్కరించా. ఇది మాత్రం అతిపెద్ద రాకెట్ షిప్‌లాగా సమస్యాత్మకంగా మారింది. చివరకు పరిష్కరించాం’’ అని ట్రంప్ అన్నారు. తర్వాత నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. తర్వాత నేతలంతా వేరే వేదికపై చేరారు. అక్కడ మళ్లీ ట్రంప్ బ్రిటన్, ఇటలీ, పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్, తుర్కియే తదితర కీలక దేశాల అగ్రనేతలను పొగుడుతూ మాట్లాడారు.
భారత్ గొప్పదేశం
వెనకాల పలువురు నేతలు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా వాళ్ల సమక్షంలో ట్రంప్ మాట్లాడారు. ‘‘ భారత్ గొప్పదేశం. నాకు అత్యంత మిత్రదేశం. భారత్ గొప్ప పనులెన్నో చేసింది. ఇకమీదట పాకిస్తాన్, భారత్‌లు ఇరుగుపొరుగున హాయిలా కలిసిమెలసి ఉంటాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఆ సందర్భంలో షరీఫ్ నవ్వుతూ కనిపించారు. తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ మాట్లాడారు. ‘‘పాలస్తీనియన్లకు స్వయం నిర్ణయాధికారం ఉండాల్సిందే. వాటిని భవిష్యత్తులో ఏ దేశమూ లాగేసుకోకూడదు. స్వతంత్ర దేశంగా ఎదగాలి’’ అని సిసీ ఆశాభావం వ్యక్తంచేశారు.