రేటు కోతకు వేళాయెనా..! | RBI maintains status quo on interest rates | Sakshi
Sakshi News home page

రేటు కోతకు వేళాయెనా..!

Oct 10 2024 5:10 AM | Updated on Oct 10 2024 5:10 AM

RBI maintains status quo on interest rates

ఆర్‌బీఐ పాలసీ కమిటీ సంకేతాలు 

‘కఠినం’ నుంచి ‘తటస్థం’ వైపునకు విధాన వైఖరి మార్పు

అయితే వరుసగా 10వ సారీ రెపో రేటు యథాతథంగా 6.5%గా కొనసాగింపు..

జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం అంచనాలూ అక్కడే...

ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. 

అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్‌ నుంచి అనుసరిస్తున్న  ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.  ఇది సానుకూలాంశమని,  సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌సూద్‌ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ స్పష్టం చేశారు. 

పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... 
→ ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది.  
→ 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. 
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన  రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది.  రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్‌బీఐ గవర్నర్‌ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే.  
→ ఫీచర్‌ ఫోన్‌ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. 
→ లైట్‌ వాలెట్‌ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది.  
→ తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్‌ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.

వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... 
ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్‌ బ్యాంక్‌ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్‌ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. 
– శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్‌  

వృద్ధికి దోహదం.. 
ఆర్‌బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది.
    – సీఎస్‌ శెట్టి, ఎస్‌బీఐ చైర్మన్‌ 

రియలీ్టకి నిరాశ..
హౌసింగ్‌ డిమాండ్‌ను పెంచే అవకాశాన్ని ఆర్‌బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం.  వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు  నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. 
     – బొమన్‌ ఇరానీ, క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ 

వైఖరి మార్పు హర్షణీయం.. 
ఆర్‌బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న  సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్‌బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది.
    – దీపక్‌సూద్, అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement